సాక్షి, హైదరాబాద్ : న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ప్రత్యేకంగా తనకు ఆఫీస్ ఉండేది కాదని, కారు డిక్కీనే కార్యాలయంగా వినియోగించుకున్నానని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టబోతున్న జస్టిస్ హిమాకోహ్లీ పేర్కొన్నారు. సీజేగా పదోన్నతిపై బదిలీ అవుతున్న నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తులతో కూడిన ఫుల్‌కోర్టు సోమవారం ఘనంగా వీడ్కోలు పలికింది. ‘దేశ విభజన సమయంలో పాకిస్థాన్‌ను నుంచి భారత్‌కు వచ్చాం. ప్రాథమిక, ఉన్నత విద్య ఢిల్లీలోనే సాగింది. చదువుకునే రోజుల్లో ఆర్టీసీ బస్సుల్లోనే కళాశాలకు వెళ్లేవాళ్లం. విద్యార్థులకు ఇచ్చే బస్‌పాస్ రూ.12.50 మాత్రమే. నేను సివిల్ సర్వెంట్ కావాలని మా నాన్న కోరుకున్నారు. న్యాయవాది కావడం ఎంత మాత్రం ఇష్టం లేదు. సివిల్స్‌కు ప్రిపేరయ్యేందుకు చదువుకోవడానికి లైబ్రరీ కార్డు వస్తుందనే ఉద్దేశంతో ఎల్‌ఎల్‌బీ అడ్మిషన్ తీసుకున్నా. (వ్యక్తి స్వేచ్ఛను కాపాడారు..)
అయితే మా అమ్మ సహకారంతో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించా. న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించిన తర్వాత ప్రత్యేకంగా ఆఫీస్ లేకపోవడంతో కారు డిక్కీనే వినియోగంచుకున్నా. సివిల్ కేసుల్లో సూట్‌లో కోర్టు ఫీజు ఎంత కట్టాలో కూడా తెలియదు. ఇతర న్యాయవాదులు, సీనియర్ల ద్వారా తెలుసుకుంటూ ముందుకెళ్లా. ఓ కేసులో అడ్వకేట్ కమిషన్‌గా కోర్టు నియమించగా రిపోర్టు ఎలా తయారు చేయాలో కూడా తెలియదు. సీనియర్ న్యాయవాది సూచనలు, సలహాలతో తయారు చేశాను. ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా ఛాంబర్ కేటాయించే సమయంలోనే హైకోర్టు జడ్జిగా నియమితమయ్యా. న్యాయవాదిగా కష్టపడితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు’అని కోహ్లీ పేర్కొన్నారు. న్యాయమూర్తిగా తన అనుభవాలను పంచుకుంటూ కంటతడిపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment