సాక్షి ప్రత్యేకం: కామారెడ్డి రైతులు తెలంగాణ చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. తీర్పుతో తమకు న్యాయం అందించినందుకు కృతజ్ఞత ప్రదర్శించారు. సీజే ఉజ్జల్ భుయాన్‌తో పాటు తీర్పు వెలువరించిన సహ న్యాయమూర్తి జస్టిస్ తుకారాం చిత్రానికీ పాలాభిషేకం జరిగింది. ఇక్కడిదాకా బాగానే ఉంది. పనిలో పనిగా ఆ ఫ్లెక్సీలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కనిపించారు. ఆయనపై మిల్క్‌బాత్‌తో పాటు బోనస్‌గా పొగడ్తల వర్షం కురిసింది. ఎందుకంటే ఆయన వాదపటిమ ఎఫెక్ట్ వల్లే న్యాయపీఠం దద్దరిల్లి.. దెబ్బకు న్యాయమూర్తులు దిగొచ్చారట!.
యస్.. ఒక పార్టీ అధ్యక్షుడు. స్వయంగా తన వాదనలను ధర్మాసనం ముందు వినిపించాడట. ఇది ప్రపంచంలో మునుపెన్నడూ చోటుచేసుకుని చారిత్రక ఘట్టమట. పైగా ఒక్కసారిగా కాదు.. కోర్టు ఆయన వాదనలను పదే పదే విందట. రైతులూ రెప్పేయకుండా పాల్ వాదనలూ వింటూ ఉండిపోయారట. అఫ్‌కోర్స్.. ఆ ఓపికకుగానూ ఆయన న్యాయమూర్తులకు కృతజ్ఞతలు కూడా తెలియజేశారట. ప్రభుత్వం కామారెడ్డి మాస్టర్‌ప్లాన్ వ్యవహారాన్ని కోర్టులోనూ నిలువరించాలని యత్నించినా.. పాల్ మాత్రం తొణకలేదట. కేసీఆర్ సర్కార్ మోకాలు అడ్డుపెడితే.. హైజంప్ చేసి మరీ పోరాటపటిమ కనబరిచారట పాల్.
కేఏపాల్ ఫీట్స్ ఎప్పుడూ చూపరులను ఆకట్టుకుంటాయి. సోషల్ మీడియాలో మస్త్ ఎంటర్‌టైన్‌మెంట్ పంచుతాయి. ఒకప్పుడు.. ఇప్పటికీ.. ఎప్పటికీ కూడా!. అవి శ్రుతి మించినా.. నవ్వుకునేవాళ్లు లేకపోలేదు. అయినా.. డోంట్ కేర్ అనడం ఆయన నైజం. అందుకు ఎగ్జాంపుల్ కామారెడ్డి మాస్టర్‌ప్లాన్ కోర్టు వ్యవహారం. కేసీఆర్ ప్రభుత్వం కోర్టు ఆదేశాలను దిక్కరించి.. అనుమతి లేకుండా పేదల నుంచి భూముల్ని లాక్కుంది. అవును.. పాల్‌గారూ మీరు చెప్పింది ముమ్మాటికీ నిజమే అన్నారట సీజే!. వెంటనే మాస్టర్‌ప్లాన్ రద్దు చేయాలని చెబుతూ కొత్త ఆదేశాలు జారీ చేశారట. పాల్ ఏం వాదించారోగానీ.. సీజే బెంచ్ మాత్రం ఫిదా అయ్యిందట. వెరసి.. జనవరి 30, 2023 తెలంగాణ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు అయ్యిందట. కేఏ పాల్ నేరుగా చెప్పిన పదిహేడు పాయింట్లకు.. గౌరవ ఉన్నత న్యాయస్థానమే చలించిపోయిందట.
ఆ ఫలితమే.. తెలంగాణ ప్రభుత్వాన్ని కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని ఆదేశించేలా చేసిందట. ఏమో మరి ఈ విడ్డూరం!. అందుకే పేద రైతుల పాలిట పెన్నిధి అంటూ పాల్‌పై ప్రశంసల అభిషేకం కురిస్తున్నారు శ్రేయోభిలాషులు. అంతేకాదు.. పలువురు ఫైర్ బ్రాండ్‌లు, రాజకీయ ఉద్దండులు ఉన్న తెలంగాణలో.. కేసీఆర్ పాలిట ఏకైక పోరాట సింహం పాల్ మాత్రమే అంటున్నారు ఆయన వీర శ్రేయాభిలాషులు. అందుకేనేమో.. కామారెడ్డి రైతుల్లో కలిసిపోయి.. పాల్ ఫొటోను ఇరికించి మరీ! పాలాభిషేకం చేశారట. అన్నట్లు కేసీఆర్ కొత్తగా కట్టిన సెక్రటేరియెట్ ప్రారంభ కార్యక్రమం ఎందుకు వాయిదా పడిందో తెలుసా?.. దట్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టూ కే.ఎ.పాల్. దానిని నిలువరించాలని ఐదుసార్లు వాదించారట ఆయన!. ప్చ్.. ఎంతైనా పాల్ కేక.. ఆ వినోదానికైనా పాలాభిషేకం జరగాల్సిందే!.
Comments
Please login to add a commentAdd a comment