సాక్షి, హైదరాబాద్: శాసనసభకు మాజీ సీఎం కేసీఆర్ కొన్ని ప్రత్యేక కారణాల వల్ల రాలేకపోయారని, ఆయన వచ్చి మాట్లాడినా, ఆయన స్థానంలో బీఆర్‌ఎస్ సభ్యులుగా తాము మాట్లాడినా అది పార్టీ అభిప్రాయమే అవుతుందని బీఆర్‌ఎస్ నేత కడియం శ్రీహరి పేర్కొన్నారు. కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను కేఆర్‌ఎంబీకి అప్పగించలేదన్న అంశంపై సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చ జరిగింది. ఈ చర్చకు బీఆర్‌ఎస్ పార్టీ శాసనసభాపక్ష నేత కేసీఆర్ హాజరు కాకపోవటాన్ని అధికార పక్ష సభ్యులు పదే పదే పేర్కొన్న సందర్భంలో కడియం స్పందించారు. కేసీఆర్ హాజరు కాలేకపోయినా, పార్టీ అభిప్రాయంగా తాము మాట్లాడుతున్నామని వెల్లడించారు.
హరీశ్‌కు కేటీఆర్ అభినందన
కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతపై జరిగిన చర్చలో పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్‌రావును బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’వేదికగా అభినందించారు. అంశంపై పట్టులేని ముఖ్యమంత్రి రేవంత్, ఆయన సహచర మంత్రివర్గాన్ని హరీశ్‌రావు అద్భుతంగా ఒంటిచేత్తో ఎదుర్కొన్నారన్నారు. కృష్ణా జలాలు, కేఆర్‌ఎంబీ విషయంలో కాంగ్రెస్ నాయకులు చేసిన అసత్య ప్రచారం, అబద్ధాలను తిప్పికొట్టి అపోహలు తొలగించారన్నారు. మంగళవారం జరిగే ‘చలో నల్లగొండ’సభలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తనదైన శైలిలో కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారం, అబద్ధాలను తిప్పి కొడతారని కేటీఆర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment