తెలంగాణ యాస.. పక్కా పల్లెటూరి భాష.. చిల్.. బ్రో.. యో..యో.. పదాలకు ఇప్పుడు ఈ గ్యాంగ్ బ్రాండ్ అంబాసిడర్. మారుమూల పల్లెటూరు నుంచి ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందారీ చిచ్చరపిడుగులు. ఏడేళ్ల పిల్లాడి నుంచి డెబ్బైఏళ్ల ముసలావిడ వరకు టాలెంట్ ఎవరిసొత్తు కాదంటూ.. ప్రతిభకు చదువుకు సంబంధం లేదని తమ నటనతో చాటి చెబుతున్నారు. వీడియో విడుదలైన గంటల్లోనే లక్షల వ్యూస్‌తో అదరగొడుతున్నారు. ఉన్న ఊరిలోనే లొకేషన్లు వెతుక్కుంటూ ఏకధాటిగా షూటింగ్‌లు చేస్తున్నారు. నాలుగేళ్ల కాలంలోనే 17.57కోట్ల అభిమానులను సంపాదించుకున్న జగిత్యాల జిల్లా లంబాడిపల్లి ‘ధూం..ధాం’ పోరగాళ్లపై సండే స్పెషల్..
– మల్యాల(చొప్పదండి)
► యూట్యూబ్ చానల్ ధూంధాం
► ప్రారంభం: 2018
► తీసిన వీడియోలు: 150
► చందాదారులు: 8.50లక్షల మంది
► వీక్షకులు: 17.57 కోట్ల మంది
► చానల్‌లో యాక్టర్లు: 11 మంది..
ప్రారంభం ఇలా..
మల్యాల మండలం లంబాడిపల్లి గ్రామానికి చెందిన అలువాల రాజు 2018లో ధూంధాం యూట్యూబ్ చానల్ ప్రారంభించాడు. షూటింగ్‌లకోసం డిగ్రీ చదువును మధ్యలో ఆపేశాడు. లంబాడిపల్లిలోని మట్టిలోనే సహజ నటన ఉంది. ఇప్పటికే చాలామంది యూట్యూబ్ ద్వారా మంచి గుర్తింపు పొందారు. ‘కికికికిక్’ ద్వారా పేరు సంపాదించిన తిరుపతి కీరోల్‌గా రసూల్, భీమన్న, గవాస్కర్, చిన్నూ, ధనుష్, సూరజ్, మణి, కరుణాకర్, రాజవ్వ తమ సహజసిద్ధ నటనతో ‘ధూంధాం’లో ఆకట్టుకుంటున్నారు. ప్రజల జీవన విధానమే కథలుగా తెరకెక్కిస్తున్నారు. లంబాడిపల్లి ప్రకృతి, పరిసరాలనే షూటింగ్‌లకు ఆవాసం చేసుకుంటున్నారు.
150 వీడియోలు.. 17.57 కోట్ల వీక్షకులు
ధూంధాం చానల్ ద్వారా ఇప్పటివరకు 150 వీడియోలు చిత్రీకరించారు. వీటిలో గ్రామంలో జులాయిగా తిరిగే వ్యక్తి సైన్యంలో చేరి, దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీడియో గంట 40 నిమిషాలు, మల్లిగాడు గంట 30నిమిషాల నిడివి గల వీడియోలతో చానల్ ప్రాచూర్యం పొందింది. కౌసుగాళ్లు, మల్లిగాడు, హోలీ, జవాన్ జర్నీ, చిల్ బ్రో, బడి దొంగలు, దుబాయ్ నుండి వస్తే.. పిలువని పేరంటానికి పోతే.. పల్లెటూరి ప్రేమకథ, ఆర్టీసీ బస్, విలేజ్ ఫ్యాషన్, కొత్తబండి, ఐఫోన్ వంటి 150వీడియోలు తీయగా, ఇప్పటి వరకు 17.57కోట్ల మంది వీడియోలను వీక్షించారు. చిల్ బ్రోలో రసూల్‌గా నటించిన మణివర్షిత్ డైలాగులతో చానల్‌కు ఆదరణ పెరిగింది. ఒకే రోజు 3లక్షల మంది వీక్షకులు చూశారు. మరో వీడియో హోలీకి ఒక్కరోజులో 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
ప్రతిభకు పట్టం
ధూంధాం చానల్ టీంలో ఎవరూ పెద్దగా చదువుకున్నవారు లేరు. ఎవరి పనివారు చేసుకుంటూనే నటిస్తున్నారు. స్వయం ఉపాధితో పాటు పదిమందికి ఉపాధి కల్పిస్తున్నాడు రాజు. ఈ యువకుడు డిగ్రీ డిస్‌కంటిన్యూ చేయగా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తూ, మల్లిగాడులో నటించిన గవాస్కర్ అదే తోవలో నడిచాడు. పిల్లి తిరుపతి వ్యవసాయం చేసుకుంటూ నటిస్తున్నాడు. పిల్లలందరూ బడికిపోయే వారే.
చిచ్చరపిడుగులు
ధూంధాం చానల్‌లో 11మందిలో ఆరుగురు చిన్నారులే. పిల్లల సహజ నటనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. బడికి వెళ్లే వయసులోనే సంపాదిస్తూ తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటున్నారు రసూల్, చిన్నూ, ధనుష్, సూరజ్, మణి, కరుణాకర్. ప్రతీ నెలా వారి పాత్రలకు అనుగుణంగా కొంతమొత్తం వస్తుండడంతో తల్లిదండ్రులు సైతం ప్రోత్సహిస్తున్నారు.
డైలాగ్ కింగ్ అంటరు
మాది లంబాడిపల్లి. అమ్మానాన్న పెంట సురేశ్, రాజమణి. తాటిపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న. బడికి పోయి వచ్చినంక నటిస్తున్న. ఎంత పెద్ద డైలాగ్ అయిన ఆగకుండా చెప్పుత. డైలాగ్ కింగ్ అంటరు నన్ను. వీడియోల్లో నటిస్తే వచ్చే డబ్బు ఇంటికి ఆసరాగా ఉంటోంది. అమ్మానాన్న కూడా ప్రోత్సహిస్తున్నారు.
– సూరజ్, ఏడో తరగతి
ఎవుసం చేసుకుంటూనే..
పదో తరగతి సదివిన. ఇప్పటి దాకా 80వీడియోల్లో నటించిన. రోజూ ఎవుసం పనిచేసుకుంటూనే వీడియోలు చేస్తా. ఆర్టీసీ బస్ మొదటి వీడియో పేరు తెచ్చింది. ఆర్మీ జవాన్ వీడియో మంచి పేరు తెచ్చింది. అందరం ఒకే కుటుంబంగా ఉంటాం. అన్నదమ్ముల్లా మెదులుతాం.
– పిల్లి తిరుపతి, లంబాడిపల్లి
అమ్మానాన్నప్రోత్సాహం
వీడియోలు తీయాలని ఉందని చెబితే అమ్మానాన్న నర్సవ్వ, చంద్రయ్య రూ.లక్ష ఇచ్చి ప్రోత్సహించారు. డిగ్రీ మధ్యలోనే ఆపేశా. నటించాలనే కోరికతో చానల్ ప్రారంభించిన. స్క్రిప్ట్ రైటింగ్, డైరెక్షన్, ఎడిటింగ్ అన్నీ నేనే చేస్తా. నటించడం కన్నా డైరెక్షన్ చేయడం చాలా అవసరం అనిపించింది. ఇప్పటి వరకు 150 వీడియోలు తీసిన.
– అలువాల రాజు, ధూంధాం చానల్ నిర్వాహకుడు
సదువుకుంటు.. సంపాదిస్తున్న
మాది గంగాధర మండలం కురుమపల్లి. అమ్మానాన్న తొట్ల తిరుపతి, లావణ్య. చానల్ ప్రారంభం నుంచి నటిస్తున్న. మాది వ్యవసాయ కుటుంబం. అమ్మమ్మ ఊరు లంబాడిపల్లి. ఇక్కడే ఉండి చదువుకుంటున్న. ఇప్పటి వరకు సుమారు 70వీడియోల్లో నటించా. సదువుకుంటూనే వీడియోల్లో నటిస్తున్న. వచ్చే ఆదాయంతో అమ్మానాన్నకు ఆసరాగా ఉంటున్నా.
– రసూల్(మణివర్షిత్)
Comments
Please login to add a commentAdd a comment