కేంద్రమే అప్పు తీసుకోవాలి | KCR Asks PM Modi To Reverse Decision On GST Shortfall Borrowings | Sakshi
Sakshi News home page

కేంద్రమే అప్పు తీసుకోవాలి

Published Wed, Sep 2 2020 2:04 AM | Last Updated on Wed, Sep 2 2020 7:56 AM

KCR Asks PM Modi To Reverse Decision On GST Shortfall Borrowings - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రస్తుత కోవిడ్‌ సంక్షోభ పరిస్థితుల్లో పరస్పరం సహకరించుకుని సమాఖ్యవాదాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కోరారు. ఏ రాష్ట్రంలో ఏ మూల అభివృద్ధి జరిగినా అది జాతీయాభి వృద్ధికి దోహదం చేస్తుందని, ఈ పరిస్థితుల్లో రాష్ట్రాలకు మరింత చేయూత అందించాల న్నారు. జీఎస్టీ పరిహారం చెల్లింపులకు సంబం ధించి కేంద్రం చేసిన ప్రతిపాదనలను వెనక్కు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధానికి ముఖ్యమంత్రి సోమవారం మూడు పేజీల లేఖ రాశారు. కేంద్రమే రుణం తీసుకుని రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం పూర్తి స్థాయిలో చెల్లించాలన్నారు. 

ప్రధానికి సీఎం రాసిన లేఖలో ఏముందంటే..
‘కేంద్రం చెల్లించాల్సిన జీఎస్టీ పరిహారం ప్రతిపాదనలపై తీవ్ర ఆందోళనతో ఈ లేఖ రాస్తున్నా. జీఎస్టీలో చేరడం ద్వారా స్వల్పకాలికంగా నష్టం ఉంటుందని తెలిసినా జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చేరాం. దీర్ఘకాలంలో ప్రయోజనం ఉంటుందని, పెట్టుబడులు వస్తాయని పూర్తి స్థాయిలో మద్దతు తెలిపాం. యూపీఏ అధికారంలో ఉండగా కేంద్ర అమ్మకపు పన్ను ఎత్తివేత ద్వారా కలిగే రెవెన్యూ నష్టాన్ని పూర్తిగా పరిహారం కింద చెల్లిస్తామని రాష్ట్రాలకు హామీ ఇచ్చారు. కానీ అలా చెల్లించకపోవడంతో తెలంగాణ రూ. 3,800 కోట్లు నష్టపోయింది. ఈ చేదు అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాలు చేసిన ఒత్తిడితో జీఎస్టీ అమలు ద్వారా వచ్చే రెవెన్యూ లోటును పరిహారం రూపంలో రెండు నెలలకోసారి చెల్లించేలా చట్టంలో చేర్చారు. కానీ, కేంద్రం ఈ పరిహారం చెల్లింపులో ఆలస్యం చేస్తోంది. ఏప్రిల్‌–2020 నుంచి చెల్లించడం లేదు. 

ఖర్చులు పెరిగాయి...
ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాల రెవెన్యూ వసూళ్లు తగ్గిపోగా, ఖర్చులు పెరిగాయి. కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో తెలంగాణ 83 శాతం ఆదాయాన్ని కోల్పోయింది. కోవిడ్‌ సంబంధిత ఖర్చు ఎక్కువ కావడంతో బహిరంగ మార్కెట్‌లో అప్పులు తెచ్చి నడిపించడం పెద్ద సవాల్‌గా మారింది. వేస్‌ అండ్‌ మీన్స్, ఓవర్‌ డ్రాఫ్ట్‌కు వెళ్లాల్సి వచ్చింది. భారత ప్రభుత్వ నియంత్రణలో ఉన్న విశాల ఆర్థిక విధానం వల్ల రాష్ట్రాలు అప్పులు తెచ్చుకునేందుకు కూడా కేంద్రంపై ఆధారపడాల్సిన పరిస్థితి. రాజ్యాంగం పేర్కొన్న సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రానికి 3.5 శాతం రుణ పరిమితి ఉంటే రాష్ట్రాలకు 3 శాతమే కల్పించారు. చట్టంలోని అంశాలను కేంద్రం ఉల్లంఘిస్తోంది. జీఎస్టీలో చేరడం ద్వారా రాష్ట్రాలు మరింత ఆర్థిక సౌలభ్యాన్ని ఆశించాయి. కానీ, జీఎస్టీలో చేరడం ద్వారా ఇతర పన్నుల రూపంలో ఆదాయం సమకూర్చుకునే అవకాశాలు కోల్పోయాయి. కేంద్రానికి మాత్రం ఆదాయపు పన్ను, కార్పొరేట్‌ పన్ను, కస్టమ్స్‌ డ్యూటీల రూపంలో మరిన్ని పన్నులు రాబట్టుకునే వెసులుబాటు వచ్చింది. ఆర్‌బీఐ డివిడెండ్ల ద్వారా, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా పన్నేతర ఆదాయం కూడా పెంచుకోవచ్చు. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం విరివిగా నిధులు ఇవ్వాల్సి ఉంది. కానీ కేంద్రం తాను నిధులు ఇవ్వకుండా రావాల్సిన వాటిని కూడా తిరస్కరిస్తోంది. చట్టపరమైన హక్కులనూ కాలరాస్తోంది.

ఆత్మనిర్భర్‌తో ముడిపెట్టడం సరికాదు...
జీఎస్టీ పరిహారం చెల్లింపులకు, ఆత్మనిర్భర్‌ ప్యాకేజీకి ముడిపెట్టడం కూడా ఆ ప్యాకేజీ ద్వారా రాష్ట్రాలకు కలిగే పూర్తి ప్రయోజనాలను అడ్డుకోవడమే. కేంద్రం సెస్, సర్‌ చార్జీల ద్వారా పెద్ద ఎత్తున ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు. లీటర్‌ పెట్రోల్‌పై రూ.13 సెస్‌ విధించడం ద్వారా ఏటా రూ.2 లక్షల కోట్లు కేంద్రానికి రానున్నాయి. జీఎస్టీ సెస్‌ మిగిలినప్పుడు ఆ మొత్తాన్ని తదుపరి సంవత్సరాల్లో కూడా వినియోగించుకునే వీలుండే (నాన్‌ ల్యాప్సబుల్‌) పరిహార నిధిలో జమ చేయకుండా కేంద్రం కన్సాలిడేటెడ్‌ ఫండ్‌లో జమ చేసుకుంది. 2017–18, 2018–19 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వ ఖర్చులకు ఉపయోగించుకుంది. ఇప్పుడు ఆ సెస్‌ లోటు వచ్చిందని రాష్ట్రాలను అప్పు తెచ్చుకోమంటున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అభిప్రాయం అడిగిన విధంగా జీఎస్టీ పరిహారం చెల్లింపు లోటును రాష్ట్రాలు అప్పులు తీసుకోవడం ద్వారా పూడ్చుకునే ప్రతిపాదనను వెనక్కు తీసుకోవాలి. ఇందుకు ప్రత్యామ్నాయంగా తక్కువ పడిన పరిహారం మొత్తాన్ని కేంద్రమే అప్పు తీసుకోవాలి. ఈ అప్పుకు సంబంధించిన అసలు, వడ్డీని జీఎస్టీ కింద 2022 తర్వాత వసూలయ్యే సెస్‌ నుంచి జీఎస్టీ కౌన్సిల్‌లో నిర్ణయం తీసుకోవడం ద్వారా చెల్లించాలి. చివరిగా, సమాఖ్య స్ఫూర్తిని బలోపేతం చేయడం ద్వారా విపత్కర పరిస్థితుల్లో కష్టాలను అధిగమించడంతో పాటు బలమైన దేశంగా నిలబడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మీ దృష్టికి తెస్తున్నా. బలమైన రాష్ట్రాలు బలమైన దేశాన్ని నిర్మిస్తాయి. ఈ కారణంతోనే జీఎస్టీ కౌన్సిల్‌లో ఇప్పటి వరకు అన్ని రాష్ట్రాల ఏకాభిప్రాయంతోనే నిర్ణయాలు జరిగాయి. ఈ సంప్రదాయం ఇక ముందు కూడా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా. నా విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించి ప్రత్యామ్నాయంపై మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా.’  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement