సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి పూర్తి స్థాయిలో ప్రోత్సాహాన్ని అందించడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. దేశ ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో కీలక పాత్ర పోషించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరుగుతున్న ఈ–మొబిలిటీ వీక్‌లో భాగంగా ఈ–మోటార్ షోను బుధవారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. 24/7 విద్యుత్‌ను అందించే సామర్థ్యం, ప్రగతిశీల ‘ఈవీ’వినియోగ పాలసీలతో దేశంలోనే అత్యంత విద్యుదీకరించిన రాష్ట్రంగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
సెల్ మాన్యుఫాక్చరింగ్, సెల్ కాంపోనెంట్ తయారీ, బ్యాటరీ మారి్పడి స్టేషన్లు, 2–వీలర్, 3–వీలర్, బస్సుల్లో ఈవీ తయారీ...ఇలా విద్యుత్ వాహన రంగానికి సంబంధించి తెలంగాణ సమగ్ర వ్యూహాన్ని అనుసరిస్తోందన్నారు. అధునాతన ఆటోమోటివ్ టెక్నాలజీల అభివృద్ధిలో నగరం అగ్రగామిగా ఉందని, రానున్న రోజుల్లో ఈ–మోటార్ షో ఆటోమొబైల్ కంపెనీలకు మార్గదర్శక వేదికగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ మోటార్ షోను ఆద్యంతం ఆసక్తిగా తిలకించిన ఆయన హాప్ ఓఎక్స్‌ఓ సిటీ బైక్ సహా పలు ఈవీ వాహనాలను ఆవిష్కరించారు. ఈ ప్రదర్శన 3 రోజులపాటు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment