1,950కోట్లు ఇవ్వండి | KTR Letter To Union Ministers, To Release Funds For Development | Sakshi
Sakshi News home page

1,950కోట్లు ఇవ్వండి

Published Thu, Dec 31 2020 2:49 AM | Last Updated on Thu, Dec 31 2020 5:25 AM

KTR Letter To Union Ministers, To Release Funds For Development - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని పట్టణాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతూ పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు కేంద్రానికి లేఖ రాశారు. వచ్చే ఏడాది రాష్ట్రంలో రూ.9,749 కోట్లతో పట్టణాభివృద్ధి చేపట్టనున్నామని, ఇందులో 20% కేంద్రం వాటాగా బడ్జెట్లో రూ.1,950 కోట్లు కేటా యించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర పట్టణ వ్యవహారాలు, హౌసింగ్‌ మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌కు బుధవారం ఆయన లేఖ రాశారు.

హైదరాబాద్‌ అర్బన్‌ అగ్లోమరేషన్‌ ఏరియా పేరిట వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామని, నగర భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టు మురుగునీటి ప్రవాహ వ్యవస్థను అభివృద్ధి చేసేం దుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర  సీవరేజి మాస్టర్‌ ప్లాన్‌ను అమలు చేస్తోందని పేర్కొన్నారు. ప్రణాళిక, సర్వే, డిజైన్, అంచనాల తయారీని పూర్తి చేసిందని, మూడు ప్యాకేజీల్లో కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.  చదవండి: (అలర్ట్‌: జ్వరముంటే కరోనా వ్యాక్సిన్‌ వద్దు)

డీపీఆర్‌లు సిద్ధం
సీవరేజి ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు, మురుగునీటి ట్రంక్‌ లైన్ల ఏర్పాటు పనులకు డీపీఆర్‌లు సిద్ధం చేశామని కేటీఆర్‌ తెలిపారు. సీవరేజి ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు(ఎస్టీపీ), సీవరేజ్‌ కలెక్షన్‌ నెట్‌వర్క్‌ ట్రంక్, సివర్‌ లైన్ల నెట్‌వర్క్‌ మొత్తం 2,232 కిలోమీటర్ల మేర ఉంటుందని, రూ. 3722 కోట్లతో 36 నెలల్లో ఈ పనులు పూర్తి చేయనున్నామని పేర్కొన్నారు. రానున్న కేంద్ర బడ్జెట్లో కనీసం 20 శాతం వాటాగా రూ.750 కోట్లను ఈ పనులకు కేటాయించాలని కోరారు. హైదరాబాద్‌లో వరదలు ముంచెత్తడానికి ప్రధాన కారణమైన నాలాల అభివృద్ధికి రూ.1,200 కోట్ల అంచనాలతో స్ట్రాటజిక్‌ నాలా డెవలప్‌మెంట్‌ కార్యక్రమాన్ని చేపట్టనున్నామని, దీనికి రూ.240 కోట్లను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. 

వరంగల్‌ నియో మెట్రో రైలుకు రూ.210 కోట్లు 
వరంగల్‌ నగరంలో నియో మెట్రో రైల్‌ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని కేటీఆర్‌ తెలిపారు. 15 లక్షలున్న వరంగల్‌ జనాభా 2051 నాటికి 35 లక్షలకు పెరిగే అవకాశం ఉందన్నారు. వరంగల్‌ నియో మెట్రో డీపీఆర్‌ సిద్ధం అయిందని, సుమారు 15.5 కిలోమీటర్ల ఉండే వరంగల్‌ మెట్రో కారిడార్‌కి రూ.1,050 కోట్ల ఖర్చు అవుతుందని, కేంద్రం వాటాగా రూ.210 కోట్లను ఈక్విటీ లేదా గ్రాంట్‌ రూపంలో కేటాయించాలని కోరారు. చదవండి: (నేర, మావో రహిత తెలంగాణే లక్ష్యం)

డ్రైనేజి పనులకు రూ.750 కోట్లు కేటాయించండి
ఎన్జీటీ మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలోని 57 పురపాలికల్లో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజి, వేస్ట్‌ వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్రాజెక్టు చేపట్టేందుకు రూ.13,228 కోట్లు అవసరమవుతాయని, తొలి దశలో 30 పట్టణాల్లో రూ.2,828 కోట్లతో పనులు చేపట్టనున్నామని కేటీఆర్‌ లేఖలో పేర్కొన్నారు. పురపాలికల్లో సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ పనుల కోసం రూ.258 కోట్లతో టెండర్లు పూర్తయ్యాయని తెలిపారు. వివిధ పురపాలికల్లో పేరుకుపోయిన 70 లక్షల మెట్రిక్‌ టన్నుల లెగసి డంప్‌ను రూ.520 కోట్లతో బయో మైనింగ్, రెమేడియేషన్‌ చేస్తున్నట్లు తెలిపారు. మానవ వ్యర్థాల ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లకు సంబంధించి రూ.250 కోట్లతో ఇప్పటికే 76 పురపాలికల్లో పనులు పూర్తయ్యాయన్నారు. వచ్చే ఏడాది రూ.3,777 కోట్లతో పురపాలికల్లో వివిధ పనులు చేపట్టనున్నామని, కనీసం 20 శాతం వాటాగా రూ.750 కోట్లను కేంద్ర బడ్జెట్లో కేటాయించాలని పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement