సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం రాష్ట్ర మహిళా కమిషన్ ముందు హాజరు కానున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణంపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనకు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఉదయం 11 గంటలకు ఆయన మహిళా కమిషన్ కార్యాలయానికి వెళ్లనున్నారు.
ఈ నెల 15న తెలంగాణ భవన్‌లో జరిగిన స్టేషన్ ఘన్‌పూర్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్, ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద, వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఈ నెల 16న కేటీఆర్‌కు నోటీసులు జారీ చేశారు.
ఇదిలా ఉండగా కేటీఆర్ తాను చేసిన వ్యాఖ్యలపై ఈ నెల 16వ తేదీనే క్షమాపణ చెప్పారు. ‘పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే విచారం వ్యక్తం చేస్తున్నాను. నా అక్క చెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు’అని ‘ఎక్స్’లో పేర్కొన్నారు.
మరుసటి రోజు కూడా తన వ్యాఖ్యలకు బేషరతు బహిరంగ క్షమాపణ చెప్పినట్లు మీడియా ప్రతినిధులకు వెల్లడించారు. కాగా మహిళా కమిషన్ నోటీసుల మేరకు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇస్తానని ఆయన ప్రకటించారు. అదే సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కొల్లాపూర్, షాద్‌నగర్‌తో పాటు రాష్ట్రంలో మహిళలపై జరిగిన అఘాయిత్యాల వివరాలను కూడా మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌కు అందజేస్తానని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment