జనంలో తక్కువ.. సోషల్‌ మీడియాలో ఎక్కువ  | KTR Slams On BJP Goebbels Social Media Propaganda | Sakshi
Sakshi News home page

జనంలో తక్కువ.. సోషల్‌ మీడియాలో ఎక్కువ 

Published Thu, Oct 29 2020 1:17 AM | Last Updated on Thu, Oct 29 2020 1:17 AM

KTR Slams On BJP Goebbels Social Media Propaganda - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారతీయ జనతా పార్టీ పరిస్థితి ‘సమాజంలో తక్కువ.. సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ’అనే రీతిలో ఉందని టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు ఎద్దేవా చేశారు. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చూపుతూ బీజేపీ గోబెల్స్‌కే పాఠాలు నేర్పేస్థాయికి చేరిందని ఘాటైన విమర్శలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. ‘బీజేపీ నాయకులు, కార్యకర్తలు వాట్సాప్‌ యూనివర్సిటీ విద్యార్థుల్లా ప్రవర్తిస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ పార్టీ గతంలో కంటే ఎక్కువ మెజారిటీ సాధిస్తుంది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు’అని వ్యాఖ్యానించారు.  

ఓపిక నశిస్తే ఎవరినీ వదలిపెట్టం..  
బీజేపీ నేతలు సీఎం కేసీఆర్‌పై నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఓపిక నశిస్తే తామూ కేంద్ర మంత్రులు, ప్రధాని సహా ఎవరినీ వదిలిపెట్టకుండా కడిగిపారేస్తామని కేటీఆర్‌ హెచ్చరించారు. ‘కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను ఘోరంగా దెబ్బతీసింది. కరోనాకు ముందు ఎనిమిది త్రైమాసికాల పాటు జీడీపీ క్షీణిస్తూ వచ్చింది. లాక్‌డౌన్‌ సమయానికి జీరో స్థాయికి చేరింది. హైదరాబాద్‌ వరదల గురించి మాట్లాడుతున్న బీజేపీ నేతలు, బెంగళూరు వరదల గురించి ఎందుకు మాట్లాడటం లేదు’అని కేటీఆర్‌ అన్నారు. ‘దుబ్బాకకు ఏం చేశామో శ్వేతపత్రం విడుదల చేయాలని అడగటం సరికాదు. నలుగురు బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి అదనపు నిధులు తెచ్చారా? కేంద్రం నిధుల వాటాపై మంత్రి హరీశ్‌ విసిరిన సవాలుకు బీజేపీ నేతలు పారిపోయారు. హిందూ, ముస్లిం గొడవ తప్ప వారికి మరో ఎజెండా లేదు’అని కేటీఆర్‌ ధ్వజమెత్తారు.  

హరీశ్‌కు క్రెడిట్‌ ఇస్తే తప్పేంటి? 
‘హరీశ్, నేను ఎవరైనా.. పార్టీ కోసమే పనిచేస్తాం. హార్సెస్‌ ఫర్‌ ఫోర్సెస్‌ అనే సామెత ప్రకారం ఏ గుర్రాన్ని ఏ రేసులో పరుగెత్తించాలో మా అధ్యక్షుడు కేసీఆర్‌కు తెలుసు. ఎవరు సైన్యాన్ని నడుపుతారో వారికే పార్టీ బాధ్యత అప్పగిస్తుంది. హరీశ్‌ జిల్లా మంత్రి కాబట్టి ఆయన ఆధ్వర్యంలో కేడర్‌ పనిచేస్తుంది. సీఎం కేసీఆర్‌ అడుగు పెట్టకుండానే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ నియోజకవర్గం హుజూర్‌నగర్‌లో 47 వేల ఓట్ల మెజారిటీ సాధించాం. దుబ్బాక ప్రచారానికి సీఎం వెళ్లాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నా. అవసరం ఉంటే ప్రచారానికి వెళ్లడంపై సీఎం స్వయంగా నిర్ణయం తీసుకుంటారు. మా పార్టీకి అన్ని నియోజకవర్గాల్లో బహుళ నాయకత్వం ఉంది. రాష్ట్ర స్థాయిలో సీనియర్లు ఉన్నారు. ఆధునిక భావాలు కలిగిన వారు వస్తే పార్టీలోకి తీసుకుంటాం. అలాంటి వారు అన్ని పార్టీల నుంచి మాతో టచ్‌లో ఉన్నారు. దుబ్బాక ఎన్నిక తర్వాత కాంగ్రెస్‌ నేతలు వేరే పార్టీల్లో చేరతారు. కాంగ్రెస్, బీజేపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరికలు ఉంటాయి. రాజకీయ విదూషకుడు రేవంత్‌ను ప్రజలు సీరియస్‌గా తీసుకోవడం లేదు. రేపో మాపో ఆయన బీజేపీలో చేరతాడనే వార్తలు వింటున్నాం. ఆయన రాజకీయ వ్యాఖ్యాతగా మారారు’అని కేటీఆర్‌ విమర్శించారు. 

తలసరి ఆదాయం రెట్టింపు..  
‘రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తాజా నివేదిక ప్రకారం రూ.27,718 కోట్ల రుణ మాఫీ చేశాం. రైతు బంధు కింద రూ.28 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేయడంతో పాటు రైతు బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీకి అదనంగా నిధులు ఇచ్చాం. తలసరి ఆదాయం రాష్ట్రంలో ఆరేండ్లలో రెట్టింపు కావడంతో పాటు, జీఎస్‌డీపీ మూడు వందల రెట్లు పెరిగింది. రైతుబంధుతో చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం దక్కిందని ఆర్‌బీఐ నివేదికలో వెల్లడించింది. షీ టీమ్స్‌ పనితీరు బాగా ఉంది. గురువారం మరో భారీ పారిశ్రామిక పెట్టుబడిపై ప్రకటన చేస్తాం’అని కేటీఆర్‌ వెల్లడించారు. ఇటీవల వర్షాల కారణంగా జరిగిన పంట నష్టంపై కేబినెట్‌లో చర్చించి ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకుంటారని మంత్రి చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement