చిలకలగూడ: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల వయోపరిమితిని పెంచడాన్ని నిరసిస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కాకతీయ వర్సిటీ విద్యార్థి బోడ సునీల్ నాయక్ మృతి చెందాడు. శుక్రవారం తెల్లవారుజామున నిమ్స్ మిలీనియం బ్లాక్ ఐసీయూలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగ గ్రామ సమీపంలోని తేజావత్ రాంసింగ్ తండాకు చెం దిన సునీల్ డిగ్రీ చదివాడు. ఐదేళ్లుగా పోలీసు ఉద్యోగం కోసం ప్రయ త్నం చేస్తున్నాడు. 2016లో నిర్వహించిన పోలీస్ ఉద్యోగ నియామకాల్లో అర్హత సాధించి దారుఢ్య పరీక్షల్లో రాణించలేకపోయాడు. ప్రస్తుతం హన్మకొండలో పోటీ పరీక్షల కోసం సన్నద్ధం అవుతున్నాడు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. ప్రభుత్వం ఇక ఉద్యోగాలకు ప్రకటన జారీ చేయదన్న మనస్తాపంతో గత నెల 26న కేయూ క్రీడా మైదానంలో పురుగుల మందు తాగాడు. ‘నేను చేతకాక చావడం లేదు.. నా చావుతోనైనా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించాలి’ అని సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. పోలీసులు వెంటనే అతడిని ఎంజీఎం ఆస్పత్రికి.. పరిస్థితి ఆందోళనకరంగా మారడటంతో నిమ్స్‌కు తరలించారు. ఐసీయూలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు.
గాంధీలో పోస్టుమార్టం.. ఉద్రిక్తత
సునీల్ మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. వివిధ విద్యార్థి సంఘాల నాయకులు అక్కడికి చేరుకుని నిరసన తెలపడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేశారు. ఆందోళన చేపట్టిన బీజేవైఎం, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, జనసేన యూత్‌వింగ్, వైఎస్ షర్మిల పార్టీలకు చెందిన వారిని పోలీసులు అరెస్ట్ చేసి బొల్లారం, కార్ఖానా ఠాణాలకు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. పలు విద్యార్థి సంఘాలకు చెందిన నాయకులు ప్రవీణ్‌రెడ్డి, శ్రీహరి, సుమన్‌శంకర్, దయాకర్, విజయ్‌కుమార్, రవి, మహేందర్, రవినాయక్, వైఎస్ షర్మిల పార్టీ ముఖ్యనేతలు ఇందిరాశోభన్, సాహితి, యూత్ కాంగ్రెస్ నాయకుడు శివసేనారెడ్డి తదితరులు ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, ప్రత్యేక అంబులెన్స్‌లో సునీల్ మృతదేహాన్ని స్వస్థలానికి తరలించారు.
మరణవాంగ్మూలంగా సెల్ఫీవీడియోను పరిగణించాలి: బండి సంజయ్
సునీల్ తీసుకున్న సెల్ఫీ వీడియోను మరణవాంగ్మూలంగా స్వీకరించి, అందుకు కారణమైన సీఎం కేసీఆర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. గాంధీ మార్చురీ వద్ద మృతుని కుటుంబసభ్యులను పరామర్శించిన అనంతరం బీజేపీ కోర్‌కమిటీ సభ్యుడు వివేక్‌తో కలసి మీడియాతో మాట్లాడారు. సునీల్ ఆత్మహత్యాయత్నానికి ముందు తీసుకున్న వీడియోలో ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడంతోనే మనస్తాపం చెందానని, తన మృతికి సీఎం కేసీఆర్ కారణమని స్పష్టంగా చెప్పాడని అన్నారు. కేసీఆర్ కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు ఉన్నాయని.. అందుకే రాష్ట్రంలోని నిరుద్యోగులను పట్టించుకోవడం లేదని, కేసీఆర్ ఉద్యోగం ఊడితేనే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయన్నారు. ప్రభుత్వం వెంటనే నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సునీల్ కుటుంబసభ్యులకు షర్మిల టీం పరామర్శ
సునీల్ కుటుంబ సభ్యులను వైఎస్ షర్మిల పార్టీ ముఖ్యనేతలు ఇందిరాశోభన్, సాహితీ పరామర్శించారు. తర్వాత నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం లోటస్‌పాండ్‌లో మీడియాతో సాహితి మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న నిరుద్యోగుల ఆత్మహత్యలకు సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మంత్రి ఎర్రబెల్లి ఇంటి ముట్టడి...
సాక్షి ప్రతినిధి, వరంగల్: సునీల్ మృతి వార్త ఉమ్మడి వరంగల్‌లో దావానలంలా వ్యాపించింది. శుక్రవారం ఉదయం నుంచే విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. సునీల్ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన ప్రదర్శనలు చేపట్టడంతో పలుచోట్ల ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేయూలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. హన్మకొండలోని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇంటిని ముట్టడించిన విద్యార్థి సంఘాలు ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి.
ఇంటి ఆవరణలోని సామగ్రిని ధ్వంసం చేయడంతో పాటు ఇంటిపైకి రాళ్లు రువ్వారు. పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకుని హన్మకొండ పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఇదిలా ఉండగా, సునీల్ మృతదేహం శుక్రవారం సాయంత్రం తండాకు చేరుకోగా.. ఎమ్మెల్యే సీతక్క, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ తదితరులు గ్రామస్తులతో కలసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంబులెన్స్ ముందు బైఠాయించారు. సునీల్ కుటుంబానికి రూ.కోటి పరిహారం కావాలంటూ డిమాండ్ చేశారు.
ఐఏఎస్‌ను కావాల్సినోన్ని..
‘మిత్రులందరికీ నమస్కారం.. ఫ్రెండ్స్.. నేను చేతకాక చనిపోవడం లేదు. రాష్ట్రంలో చాలా మంది విద్యార్థులు నా లెక్క ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు.. నేను పాయిజన్ తీసుకున్నా. తెలంగాణలో ఉద్యోగాలు లేవు.. నోటిఫికేషన్లు లేవు. గత ఐదేళ్ల నుంచి ప్రిపేర్ అవుతున్నా.. నేను ఐఏఎస్ ఆఫీసర్ కావాల్సినోడిని.. ఇలా చనిపోతున్నా. విద్యార్థుల్లారా.. మీరు కేసీఆర్‌ను విడిచిపెట్టకండి.. అసలే విడిచిపెట్టకండి,’ – సెల్ఫీ వీడియోలో సునీల్
Comments
Please login to add a commentAdd a comment