సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పేరును పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేసినట్లు సమాచారం. అయితే ఉపఎన్నిక షెడ్యూల్ వెలువడ్డాకే పార్టీ అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలిసింది. షెడ్యూల్ వెలువడేలోగా పార్టీపరంగా మునుగోడు నియోజకవర్గంలో జరిగే ప్రచార కార్యక్రమాలన్నింటిలోనూ కూసుకుంట్లకే ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఆయనే పార్టీ అభ్యర్థి అనే సంకేతాలను కేడర్‌కు కేసీఆర్ పంపనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి మంగళవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.
ఈ భేటీలో మంత్రి జగదీశ్‌రెడ్డి, టీఆర్‌ఎస్ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రావు, ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, చిరుమర్తి లింగయ్యతోపాటు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సైతం పాల్గొనడం గమనార్హం. మునుగోడు నియోజకవర్గంలో గ్రామాలవారీగా జరుగుతున్న పార్టీ కార్యకర్తల సమావేశాల నివేదికలను విశ్లేషిస్తూ రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధుతోపాటు ఇటీవల ప్రకటించిన గిరిజన బంధు, గిరిజన రిజర్వేషన్ల పెంపు అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆదేశించారు. ఆత్మీయ వన భోజనాల ద్వారా మండలాలవారీగా నియమితులైన పార్టీ ఇన్‌చార్జీలు కేడర్‌కు దగ్గర కావాలని సూచించారు. చేరికల ద్వారా పార్టీ బలోపేతం కావాలని, పాత, కొత్త కేడర్‌ను సమన్వయం చేయడంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment