సాక్షి, హైదరాబాద్: సినీ స్టూడియోలకు నామమాత్రపు ధరకే ప్రభుత్వాలు గతంలో కూడా భూమిని కేటాయించాయని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. మంత్రిమండలి అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే దర్శకుడు శంకర్‌కు భూ కేటాయింపుపై ఆమోదం తెలిపిందని పేర్కొంది. సినీ దర్శకుడు ఎన్.శంకర్‌కు రూ.5 లక్షల చొప్పున మోకిల్లలో 5 ఎకరాల భూమిని కేటాయించడాన్ని సవాల్ చేస్తూ కరీంనగర్ జిల్లాకు చెందిన జె.శంకర్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ ఇటీవల ఈ కౌంటర్‌ను దాఖలు చేశారు.
దర్శకుడు శంకర్ వెనుకబడిన నల్లగొండ జిల్లా నుంచి వచ్చిన బడుగు వర్గాలకు చెందిన వ్యక్తని, సినీ పరిశ్రమలో ఆయనకు 36 ఏళ్ల అనుభవం ఉందని తెలిపారు. రూ.50 కోట్లతో ప్రపంచ స్థాయి స్టూడియో నిర్మిస్తానని, తనకు రాయితీ పద్ధతిలో భూమి కేటాయించాలని శంకర్ ప్రభుత్వానికి 2016లో దరఖాస్తు చేసుకున్నారని వివరిం చారు. స్థానిక ప్రతిభావంతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, ఈ నేపథ్యంలో శంకర్‌కు భూమి కేటాయించే అంశాన్ని పరిశీలించాలని ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సిఫార్సు చేసిందన్నారు.
‘‘అక్కినేని నాగేశ్వర్‌రావుకు అప్పటి ప్రభుత్వం అన్నపూర్ణ స్టూడియో నిర్మాణం కోసం 1975లో రూ.5 వేల చొప్పున 22 ఎకరాలను కేటాయించింది. పద్మాలయ స్టూడియో కోసం 1983లో రూ.8,500 చొప్పున 9.5 ఎకరాలను కేటాయించింది’’అని అరవింద్‌కుమార్ తెలిపారు. 1984లో సురేశ్ ప్రొడక్షన్‌కు నామమాత్రపు ధరకే అప్పటి ప్రభుత్వం 5 ఎకరాలను కేటాయించింది. 1984లో దర్శకుడు రాఘవేందర్‌రావు, చక్రవర్తి, కృష్ణమోహన్‌కు రూ.8,500 ప్రకారం అర ఎకరం చొప్పున కేటాయించారు. శంకర్‌కు నార్సింగి, శంకర్‌పల్లి రహదారి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఎటువంటి అభివృద్ధి చేయని భూమి కేటాయించాం.
అక్కడ మార్కెట్ విలువ ఎకరా రూ.20 లక్షలుగా ఉంది. సినీపరిశ్రమ అభివృద్ధి, ఉద్యోగ కల్పన చేయాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున 5 ఎకరాలను కేటాయించింది. ఇందులో కోసం శంకర్ రూ.4.4 కోట్లు డిపాజిట్ చేశారు. స్టూడియో నిర్మాణంతో 100 మంది శాశ్వత, 200 మంది తాత్కాలిక కార్మికులకు ఉపాధి కల్పించడంతోపాటు, మరో వెయ్యి మంది కళాకారులకు ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారు’’అని వివరించారు. ఈ నేపథ్యంలో ఈ వ్యాజ్యాన్ని కొట్టివేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment