సాక్షి, హైదరాబాద్: కరోనా రెండో వేవ్ నియంత్రణ కోసం రాష్ట్రంలో విధించిన లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ, పలు సడలింపులు ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రస్తుత లాక్‌డౌన్ గడువు బుధవారం (ఈ నెల 9) వరకు ఉండగా.. మరో 10 రోజులపాటు పొడిగించింది. సడలింపు సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పెంచింది. ప్రజలు ఇళ్లు, గమ్యస్థానాలకు చేరుకునేందుకు మరో గంటపాటు అదనంగా సమయం ఇచ్చింది. సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కఠినంగా లాక్‌డౌన్ అమలు చేయాలని పోలీసు శాఖను ఆదేశించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సుదీర్ఘంగా దాదాపు 8 గంటల పాటు జరిగిన కేబినెట్ భేటీలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం రాష్ట్రంలో ఈ నెల 19 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఏడు నియోజకవర్గాల్లో లాక్‌డౌన్ యథాతథం
రాష్ట్ర సరిహద్దుల్లోని సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జునసాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ నియోజకవర్గాల పరిధిలో మాత్రం ప్రస్తుతమున్న తరహాలోనే.. మిగతా పది రోజుల పాటు లాక్‌డౌన్ అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ నియోజకవర్గాల్లో ఇటీవల పర్యటించిన వైద్యాధికారుల బృందం కరోనా ఇంకా అదుపులోకి రాలేదని నివేదిక ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఈ నియోజకవర్గాల్లో రోజూ ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే సడలింపు ఉంటుంది.
15 రోజుల్లోగా 4.46 లక్షల రేషన్‌కార్డులు
రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకొని, నిరీక్షణలో ఉన్న 4,46,169 మంది అర్హులకు వెంటనే రేషన్ కార్డులు మంజూరు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. 15 రోజుల్లోగా రేషన్ కార్డులిచ్చే ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. ఇక రేషన్ డీలర్ల కమీషన్ సహా ఇతర సమస్యలు, పీడీఎస్‌లోని ఇబ్బందుల పరిష్కారం కోసం.. గంగుల కమలాకర్ అధ్యక్షతన హరీశ్, తలసాని, సబిత, ఇంద్రకరణ్‌రెడ్డి సభ్యులుగా మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది.
మంగళవారం ప్రగతి భవన్‌లో కేబినెట్ సమావేశానికి హాజరవుతున్న మంత్రులు తలసాని, కేటీఆర్, సత్యవతి రాథోడ్, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్
9 ఉమ్మడి జిల్లాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు
హైదరాబాద్ మినహా మిగతా తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో ‘తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల (టీఎస్‌ఎఫ్íపీజెడ్) ఏర్పాటుకు మంత్రివర్గం అనుమతించింది. ఒక్కొక్కటీ 250 ఎకరాలకు తగ్గకుండా రైస్‌మిల్లులు, ఇతర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.
27 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా డిజిటల్ సర్వే
రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ భూములపై డిజిటల్ సర్వే చేపట్టి.. అక్షాంశ, రేఖాంశాల (కోఆర్డినేట్స్) ను నిర్ధారించాలని.. ఉమ్మడి 9 జిల్లాల్లో జిల్లాకు 3 గ్రామాల చొప్పున 27 చోట్ల పైలట్ ప్రాజెక్టుగా సర్వే చేపట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించింది.
ధాన్యం కొనుగోళ్లు వెంటనే పూర్తిచేయాలి
యాసంగిలో ఇప్పటికే 84 లక్షల టన్నుల వరి ధా న్యం సేకరణ జరిగిందని.. మిగిలిన కొద్దిపాటి ధా న్యం కొనుగోళ్లను కూడా వెంటనే పూర్తి చేయాలని కేబినెట్ భేటీ సందర్భంగా సీఎం ఆదేశించారు.
మాతా శిశు సంరక్షణకు ప్రత్యేక భవనాలు
రాష్ట్రంలో మాతా శిశు సంరక్షణకు సంబంధించి వైద్యసేవలను మరింతగా పటిష్టం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇతర రోగులతో కలపకుండా తల్లీబిడ్డలకు ప్రత్యేకంగా వైద్యసేవలు అందించాలని.. ఈ మేరకు ప్రధాన ఆస్పత్రి భవనంలో కాకుండా ప్రత్యేక భవనంలో ఏర్పాటు చేయాలని, తగిన వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించింది. ఆ ప్రత్యేక భవనంలోనే హైరిస్క్ ప్రసవాలకు అవసరమైన వైద్యసేవల కోసం ప్రత్యేక ‘మెటర్నల్ ఐసీయూ’లను, నవజాత శిశువుల కోసం ఎస్‌ఎన్‌సీయూలను ఏర్పాటు చేయాలని సూచించింది. ఇక గర్భిణులకు మూడో నెల నుంచే సమతుల పౌష్టికాహార కిట్లను అందించాలని నిర్ణయించింది. కరోనా మూడోవేవ్ రావచ్చనే అంచనాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని, సిబ్బందిని, మందులను సమకూర్చుకోవాలని అధికారులను ఆదేశించింది.
రూ.10 వేల కోట్లతో ఆస్పత్రుల మెరుగు
ఇరిగేషన్ రంగాన్ని పటిష్టం చేసి వ్యవసాయంలో గుణాత్మక మార్పులు సాధించిన తరహాలోనే రాష్ట్రంలోని ప్రజారోగ్య రంగంపై పూర్తి దృష్టి సారించాలని కేబినెట్ తీర్మానించింది. రానున్న రెండేళ్లలో రూ.10,000 కోట్లు ఖర్చు చేసి.. రాష్ట్రంలోని పేదలకు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో వైద్యం అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల స్థితిగతులు, మెరుగైన సౌకర్యాలు, సిబ్బంది, ఇతర మౌలిక సౌకర్యాలను సమీక్షించేందుకు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అధ్యక్షతన మంత్రులు జి.జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌లతో మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసింది. దేశంలో అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న తమిళనాడు, కేరళ రాష్ట్రాలతోపాటు శ్రీలంకకు వెళ్లి అధ్యయనం చేసి.. సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
అన్ని జిల్లాల్లో డయాగ్నస్టిక్ సెంటర్లు
రాష్ట్రంలో బుధవారం 19 జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాగ్నస్టిక్స్ కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. వీటితోపాటు మిగతా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ త్వరలో డయాగ్నస్టిక్ సెంటర్ల ఏర్పాటుకు మంత్రివర్గం నిర్ణయించింది. అన్ని డయాగ్నస్టిక్ కేంద్రాల్లో ఈసీజీ, డిజిటల్ ఎక్స్–రే, అల్ట్రా సౌండ్, 2డీ ఎకోతోపాటుగా ‘మామ్మోగ్రామ్’ యంత్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చింది. దీనితోపాటు వైద్యారోగ్య శాఖకు సంబంధించి మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.
►సత్తుపల్లి, మధిర పట్టణాల్లో కొత్తగా 100 పడకల ఆస్పత్రులను నిర్మించాలి. ప్రస్తుతమున్న ఆస్పత్రులను మాతా శిశు సంరక్షణ కేంద్రాలుగా వినియోగించుకోవాలి.
►సూర్యాపేటలో ప్రస్తుతమున్న 50 పడకల మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని 200 పడకలకు పెంచాలి.
►రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థాయిల్లోని దవాఖానాల్లో రోగుల సహాయకులుగా వచ్చేవారికి వసతి కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
►తెలంగాణ హెల్త్ ప్రొఫైల్‌ను ములుగు, సిరిసి ల్ల జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలి.
►ఎలర్జీ సమస్యల పరీక్షలు, చికిత్సకు హైదరాబాద్, వరంగల్, సిద్దిపేటలో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
►డయాలసిస్ కేంద్రాలలో మరిన్ని యంత్రాలు, కొత్తగా మరిన్ని కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం.
►కేన్సర్ రోగులకు జిల్లా కేంద్రాల్లోనే కీమోథెరపీ, రేడియోథెరపీ అందించేలా.. అవసరమైన మౌలిక వసతులతో జిల్లా కేన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
►అన్ని దవాఖానాల్లో అవసరాలను అందుకునే విధంగా బ్లడ్ బ్యాంకులను ఆధునీకరించి అవసరమైన మేరకు కొత్త బ్లడ్ బ్యాంకులను ఏర్పాటు చేయాలి.
►వైద్యానికి సంబంధించి ఆర్థోపెడిక్, న్యూరా లజీ తదితర ప్రత్యేక విభాగాలలో, మెరుగైన వైద్య సేవలకోసం కావలసిన మౌలిక వసతుల కల్పన, అవసరమైన సిబ్బంది నియామకం చేపట్టాలని వైద్యశాఖకు ఆదేశం.
►వరంగల్ సెంట్రల్ జైలు స్థలంలో ఎయిమ్స్ తరహాలో మల్టీసూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలి.
►రాష్ట్రంలోని అన్ని దవాఖానాల్లో ఎండీ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు అభ్యసించిన అర్హులను నియమించుకుని హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కోసం వినియోగించాలి.
►నర్సింగ్, మిడ్ వైఫరీ కోర్సులు, ల్యాబ్, రేడియాలజీ, డయాలసిస్ టెక్నీషియన్లు వంటి ప్రత్యేక నైపుణ్య కోర్సులను ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అందుబాటులోకి తేవాలని ఆదేశం.
Comments
Please login to add a commentAdd a comment