సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ నగరంలో అధునాతన సదుపాయాలతో కూడిన లగ్జరీ స్విమ్మింగ్ పూల్ ఈ సంవత్సరం అందుబాటులోకి రానుంది. సికింద్రాబాద్ లాలాపేట్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియంలో ఈ పూల్ పనులు ప్రారంభమయ్యాయి. ఇది అందుబాటులోకి వస్తే ఇటు సాధారణ ప్రజలకు స్విమ్మింగ్ సదుపాయంతోపాటు, అటు జాతీయస్థాయి ఈత పోటీల్లో పాల్గొనేవారికీ ఉపయుక్తంగా ఉంటుంది. దాదాపు కోటి జనాభా ఉన్న హైదరాబాద్ మహానగరంలో ప్రజలకు సరిపడా స్విమ్మింగ్‌పూల్స్ లేవు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఏడు ప్రాంతాల్లో మాత్రమే ఈత కొలనులు ఉన్నాయి.
అవి అమీర్‌పేట, విజయనగర్‌కాలనీ, మొఘల్‌పురా, చందూలాల్ బారాదరి, సనత్‌నగర్, సికింద్రాబాద్, అంబర్‌పేటల్లో ఉన్నాయి. ప్రైవేటు స్విమ్మింగ్‌పూల్స్ అందరికీ అందుబాటులో లేవు. నగరంలో వివిధ సదుపాయాల కల్పనలో భాగంగా స్విమ్మింగ్‌పూల్స్‌పై సైతం దృష్టి సారించిన అధికారులు లాలాపేట్ స్టేడియంలో స్విమ్మింగ్‌పూల్ నిర్మాణానికి సిద్ధమయ్యారు. 2275 చదరపు మీటర్ల స్థలంలో 1050 చదరపు మీటర్ల మేర స్విమ్మింగ్‌పూల్ నిర్మించనున్నారు. ఈ పూల్ పెద్దల కోసం కాగా, చిన్నపిల్లలకు సైతం మరో పూల్ నిర్మించనున్నట్లు సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. అంతర్జాతీయస్థాయి ప్రమాణాలకు తీసిపోని విధంగా దీన్ని నిర్మించనున్నట్లు చెప్పారు. పార్కింగ్‌తో పాటు వెయిటింగ్ లాబీ, తదితర సదుపాయాలుంటాయి.
స్విమ్మింగ్‌పూల్ వివరాలు..
ప్రధాన స్విమ్మింగ్‌పూల్ విస్తీర్ణం : 1050 చ.మీ.
పిల్లల స్విమ్మింగ్‌పూల్ విస్తీర్ణం : 40 చ.మీ.
డాక్ ఏరియా : 930 చ.మీ.
పార్కింగ్ ప్రదేశం : 400 చ.మీ.
భవన విస్తీర్ణం : 246 చ.మీ.
- ఇందులో ప్రధాన పూల్ వైశాల్యం 50్ఠ21 మీటర్లు. లోతు 1.35 మీటర్ల నుంచి 2 మీటర్లు ఉంటుంది.
- పిల్లల పూల్ 5 ఇంటూ 8 మీటర్ల వైశాల్యంతో నిర్మిస్తారు.
- ప్రైవేట్ స్విమ్మింగ్‌పూల్స్‌తో పోలిస్తే, జీహెచ్‌ఎంసీ స్విమ్మింగ్‌పూల్స్ ఫీజులు చాలా తక్కువ. అర్హులైన కోచ్‌లు ఉంటారు. పోటీలకు హాజరయ్యే వారికి శిక్షణ సదుపాయాలు ఉంటాయి.
జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో..
12 స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, 521 ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి. ప్రతి సంవత్సరం వేసవిలో సమ్మర్ కోచింగ్ క్యాంప్‌ల పేరిట దాదాపు 1600 కేంద్రాల్లో బాలబాలికలకు వివిధ క్రీడాంశాల్లో శిక్షణనిప్పిస్తున్నారు. శిక్షణనిచ్చే వారిలో జాతీయస్థాయి క్రీడాకారులు కూడా ఉంటారు.
Comments
Please login to add a commentAdd a comment