బయ్యారం: నవమాసాలు మోసి కన్న శిశువును మానవత్వం లేకుండా వదిలించుకున్నారు గుర్తుతెలియని వ్యక్తులు. ఈ విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. బచ్చలిబజార్‌లో నివసించే ఆశ వర్కర్ లక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం, శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన ఓ ఆడశిశువును లక్ష్మి ఇంటి సమీపంలో వదిలివెళ్లారు.
చిన్నారి ఏడుపు వినిపించడంతో స్థానికులు పరిశీలించగా పసికందు కనిపించింది. వెంటనే ఆశ వర్కర్‌తో పాటు స్థానికులు చిన్నారిని బయ్యారం పీహెచ్‌సీకి తీసుకెళ్లి చైల్డ్‌హెల్ప్‌లైన్, పోలీస్, బాలసంరక్షణ అధికారులకు సమాచారం అందించారు. ఎస్సై జగదీశ్, బాలల సంరక్షణ అధికారి నరేష్, చైల్డ్‌హెల్ప్‌లైన్ టీమ్ సభ్యులు, అంగన్‌వాడీ కార్యకర్తలు ఆస్పత్రికి చేరుకుని స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం శిశువును మెరుగైన వైద్యం కోసం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పసికందును వదిలిపెట్టి వెళ్లిన వారిని గుర్తించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాలల సంరక్షణ, చైల్డ్ హెల్ప్‌లైన్ టీం సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
శిశువు ఆకలి తీర్చిన మరో అమ్మ
పేగుబంధాన్ని ఓ అమ్మ వద్దనుకొని వదిలిపెడితే.. మరో అమ్మ ప్రేమతో ఆ బిడ్డ ఆకలితీర్చింది. బచ్చలిబజార్‌లో వదిలిపెట్టిన ఆ పసికందును స్థానిక పీహెచ్‌సీకి తరలించిన సమయంలో ముçస్తఫానగర్‌కు చెందిన సోని ఆ శిశువును చూసేందుకు పీహెచ్‌సీ వద్దకు వచ్చింది. ఆ సమయంలో శిశువు ఆకలితో ఏడుస్తుండటంతో సోని తన ఒడిలోకి తీసుకొని పాలిచ్చి అమ్మప్రేమను ప్రదర్శించింది. దీంతో స్థానికులు సోనిపై ప్రశంసలు గుప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment