
సాక్షి, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ పట్టణం ఆవిర్భవించి శుక్రవారం నాటికి 130 ఏళ్లు గడుస్తోంది. గంగా జమునా తహజీబ్‌కు ఆలవాలంగా ప్రముఖులతో కీర్తింపబడుతున్న ఈ ప్రాంతంలో పాలు, పెరుగు సమృద్ధిగా లభించేవని, చుట్టూర ఉన్న అడవుల్లో పాలుగారే చెట్లు అధికంగా ఉండటంతో పట్టణంలోని కొంత భాగాన్ని పాలమూరు అనే వారని కథనాలు ఉన్నప్పటికీ.. మహబూబ్‌నగర్‌ను అసిఫ్ జాహి వంశస్థుడైన 6వ నిజాం నవాబు మీర్ మహబూబ్ అలీఖాన్ బహద్దూర్ పేరు మీద నామకరణం చేశారని తెలుస్తోంది. గతంలో రుక్మమ్మపేట, చోళవాడి, పాలమూరుగా పిలువబడిన ఈ ప్రాంతాన్ని పరిపాలించిన అసఫ్‌జాహి రాజులు 1890, డిసెంబర్ 4న మహబూబ్‌నగర్‌గా మార్చారని చరిత్ర చెబుతోంది.
శాతవాహన, చాళుక్య రాజుల పాలన అనంతరం గోల్కొండ రాజుల పాలన కిందికి వచ్చింది. 1518 నుంచి 1687 వరకు కుతుబ్‌షాహి రాజులు, అప్పటి నుంచి 1948 వరకు అసబ్‌జాహి నవాబులు పాలించారని, స్వాతం్రత్యానంతరం 1948, సెపె్టంబర్ 18న నైజాం సారథ్యంలోని హైదరాబాద్ రాష్ట్రాన్ని జాతీయ స్రవంతిలో కలిపిన సందర్భంగా ఇక్కడ ఉన్న భవనాలు, భూములను ప్రభుత్వం స్వా«దీనం చేసుకొని వాటిని వివిధ కార్యాలయాలకు వినియోగించారు.
నిజాం భవనాలే ప్రభుత్వ కార్యాలయాలు..
నిజాం పాలనలో నిర్మించిన భవనాలను ప్రస్తుతం పలు ప్రభుత్వ కార్యాలయాలకు వినియోగిస్తున్నారు. వాటిలో కలెక్టరేట్, తహసీల్దార్ కార్యాలయం, జిల్లా కోర్టుల సముదాయం, ఎస్పీ కార్యాలయం, మైనర్ ఇరిగేషన్ ఈఈ ఆఫీస్, ఫారెస్టు ఆఫీసెస్ కాంప్లెక్స్, పోస్టల్ సూపరింటెండెంట్ కార్యాలయం, ఆర్‌అండ్‌బీ అతిథిగృహం, ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, డీఈఓ ఆఫీస్, ఆర్‌అండ్‌బీ ఈఈ కార్యాలయం, జిల్లా జైలు, వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్, బ్రాహ్మణవాడిలోని దూద్‌ఖానా, పాత పోస్టల్ సూపరింటెండెంట్, షాషాబ్‌గుట్ట హైసూ్కల్, మోడల్ బేసిక్ హైస్కూల్, రైల్వేస్టేషన్ ఉన్నాయి.
నేడు ఆవిర్భావ వేడుకలు..
ఆరో నిజాం నవాబ్‌మీర్ మహబూబ్ అలీఖాన్ బహదూర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో 130వ మహబూబ్‌నగర్ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్ రహీం గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కోవిడ్ నిబంధనల మేరకు వేడుకలు జరుపుతామని పేర్కొన్నారు.