
దేవరకద్ర: మహబూబ్‌నగర్ జిల్లాలో భారీ నీటి పారుదల ప్రాజెక్టుగా ఉన్న కోయిల్‌సాగర్ 67వ వసంతంలోకి అడుగిడింది. దేవరకద్ర నియోజకవర్గంలో ఉన్న కోయిల్‌సాగర్ ప్రాజెక్టును 1947లో నిజాం పాలనలో నిర్మాణ పనులు ప్రారంభించి 1955 సంవత్సరంలో పూర్తిచేశారు. ఆనాడు ప్రాజెక్టు నిర్మాణం కోసం ఖర్చు చేసింది కేవలం రూ.85 లక్షలే. ప్రాజెక్టు అలుగు స్థాయి ఎత్తు 26.6 అడుగులుగా నిర్మించారు. ఆనాటి ఆయకట్టు కింద 8 వేల ఎకరాలు ఉండగా.. కుడి, ఎడమ కాల్వల ద్వారా మొదటిసారి 1955లో జూలై 7న నీటిని వదిలారు. సిమెంట్ స్టీల్ ఉపయోగించని ఆనాడు అందుబాటులో ఉన్న సున్నం గచ్చు కలిపి రాతి కట్టడంతో ప్రాజెక్టును నిర్మించారు. ప్రస్తుతం 67వ వసంతంలోకి చేరుకున్న ప్రాజెక్టు నిర్మాణం నేటికీ చెక్కు చెదరలేదు.
1981లో క్రస్టుగేట్ల ఏర్పాటు
కోయిల్‌సాగర్ ప్రాజెక్టును ఆధునీకరించే పనులు 1981లో కాంగ్రెస్ హయాంలో చేపట్టారు. అలుగుపై 13 గేట్లను నిర్మాణం చేసి ప్రాజెక్టు కట్టను రెండు వైపులా ఆరు అడుగుల వరకు పెంచి బలోపేతం చేశారు. దీనికి గాను రూ.92 లక్షల వ్యయం అయింది. గేట్ల నిర్మాణంతో ప్రాజెక్టులో 32.6 అడుగుల మేర నీటిమట్టం పెరగడానికి అవకాశం ఏర్పడింది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 2.27 టీఎంసీలకు చేరింది. ఆయకట్టు కింద 8 వేల నుంచి 12 వేల ఎకరాలకు సాగునీరు అందించడానికి అవకాశం లభించింది.
Comments
Please login to add a commentAdd a comment