ఊపిరి పీల్చుకునే లోపే.. దోమల దాడి మొదలైంది! | Malaria, Dengue What Is Symptoms Causes And More | Sakshi
Sakshi News home page

ఊపిరి పీల్చుకునే లోపే.. దోమల దాడి మొదలైంది!

Published Mon, Jul 5 2021 7:58 AM | Last Updated on Mon, Jul 5 2021 12:24 PM

Malaria, Dengue What Is Symptoms Causes And More - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా సెకండ్‌వేవ్‌ ఉద్ధృతి మిగిల్చిన విషాదాన్ని సిటిజన్లు ఇంకా పూర్తిగా మరిచిపోకముందే.. డెంగీ, మలేరియా, డయేరియా, టైఫాయిడ్‌ వంటి సీజనల్‌ వ్యాధులు వెంటాడుతున్నాయి. కొద్ది రోజులుగా చాపకింద నీరులా విస్తరిస్తున్న సీజనల్‌ వ్యాధులు గ్రేటర్‌ వాసుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఉస్మానియా, ఫీవర్‌ ఆస్పత్రులకు జ్వర పీడితుల తాకిడి పెరుగుతోంది. కోవిడ్‌ కారణంగా ప్రభుత్వం గత ఏడాది ఇళ్లు, వీధులు, కాలనీలను శానిటైజ్‌ చేసింది. దోమల నియంత్రణ కోసం ఫాగింగ్‌ కూడా చేసింది. ఫలితంగా డెంగీ, మలేరియా కేసులు తక్కువగా నమోదయ్యాయి. ఈ ఏడాది ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం దోమలు విజృంభిస్తున్నాయి. సిటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.  

ఊపిరి పీల్చుకునే లోపే.. 
కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిబంధనలు కూడా ఎత్తేసింది. ఏప్రిల్, మే నెలల్లో రోజుకు సగటున 1500 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో సగటున కేసులు 200 మించి నమోదు కావడం లేదు. వైరస్‌ ఉద్ధృతి తగ్గిందని అంతా ఊపిరి పీల్చుకునే లోపే.. డెంగీ, మలేరియా, డయేరియా వంటి సీజనల్‌ వ్యాధులు చాపకిందనీరులా విస్తరిస్తున్నాయి. 

ఇలా దాడి.. 
మలేరియాకు ‘ఆడ అనాఫిలన్‌’ దోమ కారణం. ఇది మురుగునీటిలో ఎక్కువగా పెరుగుతోంది. ఈ మలేరియా జ్వరాలు రెండు రకాలు కాగా, వీటిలో ఒకటి ప్లాప్మోడియం వైవాక్స్‌(పీవీ)కాగా, రెండోది ప్లాస్మోడియం పాల్సీఫారం (పీఎఫ్‌). రెండోది అత్యంత ప్రమాదకరం. నగరంలో ఏటా పాల్సీఫారం కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. చలిజ్వరం, తలనొప్పి, వాంతులతో పాటు తీవ్రమైన నీరసం ఉంటుంది. సాయంత్రం వేళల్లో జ్వరం ఎక్కువగా ఉంటుంది. చికిత్సను నిర్లక్ష్యం చేస్తే.. కాలేయం, మెదడు, మూత్ర పిండాలు దెబ్బతిని వ్యక్తి చనిపోయే ప్రమాదం ఉంది.  

ఈడిస్‌ఈజిప్టే (టైగర్‌) దోమ కుట్టడంతో డెంగీ సోకుతుంది. మూతల్లేని మంనీటి ట్యాంకులు, ఇంట్లోని పూలకుండీలు, కొబ్బరి బొండాలు, టైర్లు, ప్లాస్టిక్‌ డబ్బాలు, అపార్ట్‌మెంట్‌ సెల్లార్లు, కొత్త నిర్మాణాల్లో ఈ దోమలు ఎక్కువగా పెరుగుతాయి. ఈ దోమ కుట్టిన 7 నుం 8 రోజుల తర్వాత తీవ్రమైన జ్వరం, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, కండరాల నొప్పులు, శరీరంపై ఎర్రటి దద్దుర్లు, కళ్లు కదలించలేకపోవడం వంటి లక్షణాలు కన్పిస్తాయి. కిత్సను నిర్లక్ష్యం చేస్తే.. సాధారణంగా శరీరంలో 1.50 లక్షల నుం 4 లక్షల వరకు ఉండే ప్లేట్‌లెట్స్‌ సంఖ్య 20 వేలలోపు పడిపోయి కోమాలోకి వెళ్లిపోతారు. 

కలుషిత నీరు, ఆహారం ద్వారా డయేరియా అతిసారం వ్యాపిస్తుంది. కలుషితమైన నీటిని సరిగా శుభ్రం చేయకుండా తాగడం వల్ల వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, టైఫాయిడ్‌ జ్వరాల బారినపడుతుంటారు. నిల్వ ఉన్న ఆహార పదార్థాలపై ఈగలు వాలడం వల్ల ఆహారం కలుషితం అవుతుంది. అప్పుడే ఉడికించిన తాజా ఆహారంతో పాటు వేడిచేసి చల్లార్చిన నీటిని తాగడం వల్ల ఈ వ్యాధులు దరిచేరకుండా చసు కోవచ్చు. 

ఈ జాగ్రత్తలు తీసుకోండి..  
ఒకవైపు కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూనే.. మరో వైపు ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటికి సమీపంలో చెత్త కుప్పులు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కూలర్లు, నీటి ట్యాంకులను శుభ్రం చేసుకోవాలి. వారానికోసారి డ్రై డేగా పాటించాలి. ఇంట్లోని పూలకుండీలు, ఇంటిపై ఉన్న పాత ప్లాస్టిక్‌ డబ్బాలు, టైర్లు, సీసాలు, కుండలు లేకుండా చూసుకోవాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement