మలేషియా వ్యాపారవేత్తలతో మంత్రి శ్రీధర్‌బాబు
సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో పెట్టుబడుల కోసం తెలంగాణలో అత్యంత అనుకూల వాతావరణం ఉందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని మలేషియా పారిశ్రామికవేత్తలను కోరారు. శ్రీధర్‌బాబు గత నెలలో మలేషియా తెలుగు మహాసభలకు హాజరైన సందర్భంగా అక్కడి పారిశ్రామికవేత్తలను రాష్ట్రానికి ఆహ్వానించారు.
ఈ మేరకు పలువురు పారిశ్రామికవేత్తలు రాష్ట్ర పర్యటనకు వచ్చారు. మలేషియా తెలంగాణ అసోసియేషన్ చొరవతో సోమవారం సచివాలయంలో మలేషియా వాణిజ్య ప్రతినిధులతో మంత్రులు శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వర్‌రావు, జూపల్లి కృష్ణారావు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సౌర విద్యుత్ రంగం, డ్రైపోర్టుల నిర్మాణం, మురుగు నీటి శుద్ధి ప్లాంట్ల ఏర్పాటు, మహిళా పారిశ్రామికవేత్తలు, అంకుర సంస్థలకు విదేశాల్లో మార్కెటింగ్ సౌకర్యం కల్పించడంపై చర్చించారు.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి
హుస్సేన్ సాగర్‌లో పూడికతీత, మురుగు నీటి శుద్ధికోసం అత్యాధునిక సీవరేజీ ప్లాంట్ల ఏర్పాటులో పాలు పంచుకోవాలని మలేషియా పారిశ్రామికవేత్తలను మంత్రి శ్రీధర్‌బాబు కోరారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న డ్రైపోర్టుల నిర్మాణంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ... ప్రస్తుతం మలేషియా నుంచి పామాయిల్ మొలకలు దిగుమతి చేసుకుంటున్నామని, అలా కాకుండా విత్తనాలు సరఫరా చేయడానికి గానీ, ఇక్కడే నర్సరీ ఏర్పాటు చేయడానికి గానీ ముందుకొస్తే సహకరిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment