
ఖమ్మం జిల్లా రేమిడిచర్లలో మాట్లాడుతున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
ఎర్రుపాలెం: ‘దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డే నా రాజకీయ గురువు. అభిమాన నాయకుడు. అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ ఆయనే నా నాయకుడు.. అని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆయన చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఆదివారం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం రేమిడిచర్ల, జమలాపురం, వెంకటాపురం గ్రామాల్లో కొనసాగింది.
ఈ సందర్భంగా రేమిడిచర్లలో విలేకరులతో మాట్లాడారు. వైఎస్ కుమార్తెగా షర్మిలను కూడా గౌరవిస్తానని, రాజకీయంగా ఎవరి పార్టీ వారిదేనని అన్నారు. ఆమె కూడా వైఎస్సార్ అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటున్నానని చెప్పారు. తెలంగాణలో షర్మిల పార్టీ వల్ల కాంగ్రెస్‌కు నష్టం జరగదని తెలిపారు. ముందస్తు ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని మంత్రి కేటీఆర్ భయంతో, ఆందోళనతో ప్రకటనలు చేస్తున్నారని చెప్పారు. బీజేపీ విభజన రాజకీయాలను ప్రోత్సహిస్తోందని, ఇది దేశ భవిష్యత్‌కు ప్రమాదమని హెచ్చరించారు. దేశం ఒక్కటిగా ఉండాలని కోరుకునే వారు రాజకీయ విభేదాలను పక్కన పెట్టి ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు.
పాదయాత్రకు రెండు రోజుల విరామం..
ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీకి ఈడీ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్నందున 13, 14 తేదీల్లో పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు విరామం ఇస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. 15న తిరిగి ప్రారంభిస్తానని వెల్లడించారు.