శుక్రవారం ఖమ్మంజిల్లా ప్రాజెక్టులపై సమీక్షలో మాట్లాడుతున్న భట్టి, ఉత్తమ్, పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కృష్ణాబోర్డుకు అప్పగించేందుకు తమ ప్రభుత్వం ఒప్పుకోలేదని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ అంశంపై మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధమని కొట్టిపారేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రాజెక్టులపై శుక్రవారం ఆయన సచివాలయంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆ జిల్లాకు చెందిన ఇతర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సమీక్షించారు.
అనంతరం భట్టి విక్రమార్కతో కలిసి సచివాలయం మీడియా పాయింట్‌లో విలేకరులతో మాట్లాడారు. 10 ఏళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో తెలంగాణకు నీటి కేటాయింపుల్లో ఒక్క చుక్కను అదనంగా తీసుకొచ్చారా? అని ప్రశ్నించారు. ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించే అంశంపై గత ప్రభుత్వం అనుసరించిన వైఖరి, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలపై త్వరలో రాష్ట్ర శాసనసభలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
సీతారామ ప్రాజెక్టులో భారీ దోపిడీ: భట్టి విక్రమార్క
సీతారామ–సీతమ్మసాగర్ ప్రాజెక్టు పేరుతో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం భారీ దోపిడీకి పాల్పడిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.792 కోట్లతో రాజీవ్‌సాగర్, రూ.760 కోట్లతో ఇందిరాసాగర్ మిగులు పనులు పూర్తి చేస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3.3లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు లభించేదన్నారు. మొత్తం రూ.1552 కోట్లతో పూర్తయ్యే ఈ ప్రాజెక్టులను రీడిజైనింగ్ పేరుతో కలిపేసి సీతారామ ప్రాజెక్టుగా పేరు మార్చడంతోపాటు అంచనా వ్యయం రూ.13,057 కోట్లకు చేరిందని, కేసీఆర్ ప్రభుత్వం ఆ తర్వాత రూ.18,500 కోట్లకు పెంచిందని ఆరోపించారు.
అదనపు నీటినిల్వ సామర్థ్యం కోసం రూ.3481 కోట్లతో సీతమ్మసాగర్ బ్యారేజీ నిర్మాణం చేపట్టి తర్వాత దీని వ్యయం సైతం రూ.4481 కోట్లకు పెంచిందన్నారు. ఇలా సీతారామ–సీతమ్మప్రాజెక్టుల అంచనాలను మొత్తం రూ.22,981 కోట్లకు పెంచారని విమర్శించారు. రూ.1552 కోట్లతో పూర్తి అయ్యే ప్రాజెక్టు అంచనాలను రూ.22,981 కోట్లకు పెంచి ఇప్పటికే రూ. 8వేల కోట్లను ఖర్చు చేసినా ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేదని మండిపడ్డారు. శబరి, గోదావరి కలిసే చోట పోలవరం వద్ద ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ఇందిరాసాగర్ నిర్మాణాన్ని గత ప్రభుత్వం విరమించుకోవడంతో 365 రోజులు ప్రవహించే శబరి నదిని రాష్ట్రం కోల్పోయిందన్నారు.
దేశ చరిత్రలో ఇంత దోపిడీ జరిగి ఉండదు: ఉత్తమ్
భారతదేశ చరిత్రలో ఇలాంటి దోపిడీ జరగడం చాలా అరుదు అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రూ.10, రూ.20 కోట్లకే ఉద్యోగాలు పోతాయని, ప్రభుత్వాలు కూలుతాయన్నారు. రోజురోజుకు బయటకు వస్తున్న విషయాలను చూసి నీటిపారుదలశాఖ మంత్రిగా నిర్ఘాంతపోతున్నట్టు పేర్కొన్నారు. ఎన్నో కుంభకోణాలు జరిగాయని, విచారణకు ఎంత మందో జడ్జిలు కావాలో అన్న అంశంపై ఆలోచన చేస్తున్నామని చెప్పారు.
ఇప్పటికే సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని హైకోర్టు సీజేకు లేఖ రాశామని, కేసీఆర్, హరీశ్‌రావులు నీటిపారుదలశాఖ మంత్రులుగా వ్యవహరించి ఆ శాఖను ధ్వంసం చేశారన్నారు. గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన అధికారులనే ఇంకా కొనసాగించడంపై విలేకరులు ప్రశ్నించగా, త్వరలో మార్పులు చూస్తారని బదులిచ్చారు. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతారామపై ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై మంత్రివర్గంలో చర్చిస్తామని చెప్పారు. ప్రాజెక్టులకు జాతీయ హోదా కలి్పంచే విధానం లేదని, బదులుగా రాష్ట్రంలోని ప్రాజెక్టులకు కేంద్ర పథకాల కింద 60శాతం నిధులు ఇస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని, ఇందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.
జాతీయ హోదాపై మాట్లాడేందుకు హరీశ్‌రావుకు సిగ్గుశరం ఉండాలన్నారు. గతంలో 2–4శాతం వడ్డీలతో ప్రభుత్వాలు రుణాలు తెచ్చాయని, తెలంగాణ వచ్చాక 10.5శాతం వరకు అధిక వడ్డీలతో గత ప్రభుత్వం రూ.2లక్షల కోట్ల అప్పులు చేసి మనందరి జీవితాలను తాకట్టు పెట్టిందన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో నీటిపారుదల శాఖ రుణాల తిరిగి చెల్లింపులకే రూ.18వేల కోట్లు, జీతాలకు మరో రూ..2వేల కోట్లు, గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన బిల్లుల చెల్లింపులకు మరో రూ. 9500 కోట్లు అవసరమన్నారు.
తమ ప్రభుత్వం విజ్ఞప్తి చేయడంతో వడ్డీలను తగ్గించేందుకు కేంద్ర ఆర్థిక శాఖమంత్రి సహకరిస్తామని హామీ ఇచ్చారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కర్ణాటకకు వెళ్లి తాగునీటి అవస రాల కోసం 10 టీఎంసీలను విడుదల చేయాలని కోరుతామని చెప్పారు. కృష్ణా జలాలపై మాట్లాడే అర్హత బీఆర్‌ఎస్‌కు ఉందా? శ్రీశైలం ప్రాజెక్టు వెనుకభాగంలో ఏపీ లిఫ్ట్‌లు కట్టుతుంటే ఎప్పుడైనా మాట్లాడారా? అని నిలదీశారు. ఏపీ చేపట్టిన సంగమేశ్వరం ప్రాజెక్టుపై ఒక్కసారైనా కేసీఆర్, హరీశ్ మాట్లాడారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలతోపాటు సీలేరు ప్రాజెక్టును కేంద్రం ఏపీకి కేటాయించినా ఏం చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment