Telangana: All Set For BRS Maiden Public Meeting In Khammam - Sakshi
Sakshi News home page

ఖమ్మం గులాబీ వనం.. ఐదు లక్షల మంది వీక్షించేలా ప్రాంగణం

Jan 18 2023 2:44 AM | Updated on Jan 18 2023 2:22 PM

Telangana All Set For BRS Maiden Public Meeting in Khammam - Sakshi

ఖమ్మంలో నిర్వహించే బహిరంగ సభ వేదిక 

సాక్షి ప్రతినిధి,  ఖమ్మం: భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) తొలి బహిరంగ సభకు ఖమ్మం ముస్తాబైంది. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే సభ పురస్కరించుకుని నగరమంతా గులాబీ తోటలా మారింది. రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, పువ్వాడ అజయ్‌కుమార్‌ ఐదు రోజులుగా ఇక్కడే మకాం వేసి ఏర్పాట్లు చేయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు ఢిల్లీ, పంజాబ్, కేరళ రాష్ట్రాల సీఎంలు, పలు పార్టీల జాతీయ స్థాయి నేతలు హాజరవుతుండడంతో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

నూతన కలెక్టరేట్‌కు ప్రారంభోత్సవం, మెడికల్‌ కళాశాలకు శంకుస్థాపన, కంటివెలుగు రెండో దశ ప్రారంభ కార్యక్రమంలో కూడా అతిథులు పాల్గొంటారు. వీరంతా ప్రసంగించాక చివర్లో కేసీఆర్‌ ప్రసంగించనున్నారు. సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు, సీపీఐ సీని­యర్‌ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావుకు కూడా ఆహ్వానం అందింది. మంత్రి పువ్వాడతో పాటు పలువురు ముఖ్యనేతలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను కూడా వేదికపైకి ఆహ్వానిస్తారు. 

13 నియోజకవర్గాలు.. 5 లక్షల మంది 
ఖమ్మం సమీపాన రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెంలోని వంద ఎకరాల్లో సభకు ఏర్పాట్లు చేశారు. ఐదు లక్షల మంది వీక్షించేలా ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. ఉమ్మడి ఖమ్మంతో పాటు సూర్యాపేట, మహబూబాబాద్‌ జిల్లాల్లోని 13 నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేస్తున్నారు. ఇక ఖమ్మానికి తూర్పు, పశ్చిమం వైపు మొత్తం 20 పార్కింగ్‌ ప్రాంతాలకు 448 ఎకరాలు కేటాయించారు.

సభ ప్రాంగణంలో 25 ఎల్‌ఈడీలు, లక్ష మంది కూర్చునేలా కుర్చీలు ఏర్పాట్లు చేశారు. 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 12 లక్షల తాగునీటి ప్యాకెట్లు సిద్ధం చేశారు. సీనియర్, జూనియర్‌ ఐపీఎస్‌లు, పోలీసు సిబ్బంది కలిపి 5,200 మంది బందోబస్తులో పాల్గొంటుండగా, కలెక్టరేట్, సభా ప్రాంగణంలో 100కు పైగా సీసీ కెమెరాలు అమర్చారు. ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, డీఐజీ, వరంగల్‌ సీపీ ఏ.వీ.రంగనాథ్, 
సీపీ విష్ణు ఎస్‌.వారియర్‌ బందోబస్తులో నిమగ్నమయ్యారు. 

సీఎంల పర్యటన షెడ్యూల్‌ 
►పినరయి విజయన్‌ మినహా మిగతా ముగ్గురు సీఎంలు, ముఖ్య నేతలు బుధవారం ఉదయం 10.10 గంటలకు బేగంపేట వి­మా­నాశ్రయం నుంచి రెండు హెలీకాప్టర్లలో బయలుదేరతారు. (పినరయి విజయన్‌ నేరుగా ఖమ్మంకు వెళ్తారు.)
►10.35 గంటలకు యాదగిరిగుట్ట చేరుకుని 10.40 గంటలకు లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటా­రు. ఈ నేపథ్యంలో ఉదయం 9 నుంచి మధ్యా­హ్నం ఒంటిగంట వరకు భక్తులకు దర్శనాలు, ఆర్జిత సేవలను నిలిపివేశారు. 
►11.40 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.20 గంటలకు ఖమ్మం చేరుకుంటారు.  
►ఖమ్మంలో నూతన కలెక్టరేట్‌తో పాటు కంటి వెలుగు రెండో దశ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేస్తారు. 
►2.25 గంటలకు కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌ నుంచి బయలుదేరి 2.30 గంటలకు బహిరంగ సభాస్థలికి చేరుకుంటారు. 
►2.30 నుంచి 5 గంటల వరకు సభలో పాల్గొంటారు. కేరళ, ఢిల్లీ, పంజాబ్‌ సీఎంలు ముగ్గురూ హెలీకాప్టర్‌లో విజయవాడ వెళ్లి అక్కడినుంచి విమానాల్లో వారి రాష్ట్రాలకు బయలుదేరతారు. 
►సీఎం కేసీఆర్‌ ఖమ్మం నుంచి నేరుగా హెలీకాప్టర్‌లో హైదరాబాద్‌ చేరుకుంటారు.  

ప్రత్యేకంగా ప్రధాన వేదిక 
ప్రధాన వేదికను వాటర్‌ ప్రూఫ్, ఫైర్‌ ప్రూఫ్‌ జర్మనీ స్ట్రక్చర్‌ రూఫ్‌తో సిద్ధం చేయగా, గులాబీ రంగు జోడించారు. వేదికపై భారత్‌ రాష్ట్ర సమితి పేరు, వరుసగా సీఎంలు కేసీఆర్, పినరయి విజయన్, అరవింద్‌ కేజ్రీవాల్, భగవంత్‌ మాన్, మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్, డి.రాజా ఫొటోలతో ఫ్లెక్సీ ఏర్పాటుచేశారు. 200 మంది కూర్చునేలా వేదికను నిర్మించారు. వేదిక వెనుక నాలుగు విశ్రాంతి గదులు, వేదిక ఎదురుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలు కూర్చునేలా గ్యాలరీ సిద్ధం చేశారు.

నగరంలోకి ప్రవేశించేది మొదలు చుట్టూరా గులాబీ జెండాలు, సీఎం కేసీఆర్, జిల్లా నేతల ఫొటోలతో పాటు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పథకాలతో కటౌట్లు, హోర్డింగ్‌లు ఏర్పాటయ్యాయి. మంత్రులు హరీశ్‌రావు, పువ్వాడ అజయ్‌కుమార్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, మల్లారెడ్డి తదితరులు మంగళవారం సాయంత్రం సభా ప్రాంగణం, కలెక్టరేట్‌ను పరిశీలించారు. భారీ సభ దృష్ట్యా బుధవారం ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు ఖమ్మం వైపు వచ్చే సాధారణ, భారీ వాహనాలన్నింటినీ దారి మళ్లించనున్నట్లు పోలీసులు వెల్లడించారు.

సూర్యాపేట నుంచి ఖమ్మం వైపు వస్తూ సత్తుపల్లి, రాజమండ్రి, విశాఖపట్నం వెళ్లాల్సిన వాహనాలను కోదాడ హైవే మీదుగా విజయవాడ వైపు మళ్లిస్తారు. ఇలావుండగా టీఆర్‌ఎస్‌ ఏర్పాటైనప్పటి నుంచి భారీ ఎత్తున జరిగిన సభల జాబితాలో ఖమ్మం బీఆర్‌ఎస్‌ సభ కూడా చేరుతుందని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. 2016లో ఖమ్మంలో టీఆర్‌ఎస్‌ ప్లీనరీ తర్వాత ఉమ్మడి జిల్లాలో పార్టీ పరంగా ఇదే భారీ సభ కావడం గమనార్హం. నాటి నుంచి నేటి వరకు సభల ఏర్పాట్లను హైదరాబాద్‌కు చెందిన సుజాత సౌండ్స్‌ నిర్వాహకులే చూస్తుండడం మరో విశేషం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement