
సాక్షి,కొత్తగూడెంటౌన్( ఖమ్మం): తమ వద్ద బిల్డింగ్ కొనుగోలు చేసి, దానికి సంబంధించిన డబ్బులు ఇవ్వకుండా పట్టణానికి చెందిన ఓ ప్రముఖ వైద్యుడు ఇబ్బందులకు గురిచేస్తున్నాడని చెబుతూ ఓ కుటుంబం నిర్మాణంలో ఉన్న భవనం ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించింది. ఈ ఘటన మంగళవారం పట్టణంలో చోటుచేసుకుంది. ఈ సందర్భంగా బాధితులు మదన్‌లాల్ తుర్కిల్, బబ్లూ, మనోహర్, శివలాల్, మహేందర్‌లాల్, దేవేందర్‌లాల్ తుర్కిల్, చౌహాన్‌లాల్ తుర్కిల్ మాట్లాడారు.
2015లో తమకు చెందిన స్థలం ఓ ప్రముఖ వైద్యుడు కొనుగోలు చేశాడని తెలిపారు. దానికి సంబంధించిన నగదును పూర్తిగా చెల్లించలేదని, కానీ, ఆ స్థలంలో ప్రస్తుతం పెద్ద భవనం కడుతున్నాడని చెప్పారు. డబ్బుల గురించి అడిగితే ఇవ్వాల.. రేపు.. అంటూ దాటేస్తున్నాడని, ఆరేళ్లుగా ఆయన చుట్టూ తిరుగుతున్నామని వాపోయారు. ఇక తిరగడం తమ వల్ల కాదని చెబుతూ గణేశ్ టెంపుల్ లైన్‌లో ఉన్న బిల్డింగ్ ఎక్కారు.
తమకు డబ్బులు చెల్లించేవరకు దిగమని భీష్మించారు. విషయం పోలీసులకు తెలియడంతో ఘటనా స్థలానికి త్రీటౌన్ ఎస్‌ఐ శ్రీనివాస్ సిబ్బందితో చేరుకున్నారు. బాధితులతో మాట్లాడారు. వారు ఎంతకీ వినకపోవడంతో నచ్చజెప్పేందుకు యత్నించారు. తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తామని, నగదు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని వైద్యుడి తరఫున పోలీసులు హామీ ఇవ్వడంతో వారు కిందకు దిగారు. సుమారు మూడు గంటల పాటు వారు బిల్డింగ్ పైనే ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. చివరకు వారు కిందకు దిగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment