మహిళపై అత్యాచారయత్నం ఘటనపై బాధిత వర్గం నిరసన
నిందితుడి ఇల్లు, ఆటోతో పాటు 50కి పైగా దుకాణాలకు నిప్పు
పలు వాహనాలు, బైకులు ధ్వంసం
పట్టణంలో కర్ఫ్యూ..నిషేధాజ్ఞలు: డీజీపీ
సాక్షి, ఆసిఫాబాద్/సాక్షి, హైదరాబాద్: గత ఆదివారం ఓ మహిళపై ఆటోడ్రైవర్ అత్యాచారయత్నం చేయడంతో పాటు హత్యకు ప్రయతి్నంచిన ఘటన మంగళవారం వెలుగులోకి రావడం, బాధిత వర్గం పెద్దయెత్తున ఆందోళనకు దిగడంతో కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. నిరసనకారులు బుధవారం ఉదయం నిందితుడి ఇళ్లు, ఆటోను తగలబెట్టడంతో మొదలైన విధ్వంసం సాయంత్రం వరకూ కొనసాగింది.
పట్టణంలో బంద్‌కు పిలుపునిచ్చిన బాధిత వర్గం మరో వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగింది. వారికి చెందిన రెండు ప్రార్థనా మందిరాల్లో ఫర్నిచర్ కొందరు ధ్వంసం చేశారు. నాయకులపై దాడి చేయడమే కాకుండా వారి ఇళ్లపై రాళ్ల వర్షం కురిపించారు. ఇళ్లల్లోకి చొరబడి సామాగ్రి పగులగొట్టారు. కార్లు, మాక్సీ క్యాబ్‌లు, బైక్‌లను ధ్వంసం చేసి నిప్పుపెట్టారు. 100కు పైగా దుకాణాలను తగులబెట్టారు.
నిందితుడికి చెందిన వర్గం జైనూరు వదిలి మైదాన ప్రాంతానికి తరలి పోవాలని డిమాండ్ చేశారు. వేలాది మంది బాధిత వర్గం వారు పట్టణంలోకి చేరుకుని ఒక్కసారిగా విధ్వంసానికి పాల్పడడం, ఇంకోవైపు మరోవర్గం కూడా కొన్నిచోట్ల దాడులకు దిగడంతో వారిని నిలువరించడం పోలీసులకు కష్టసాధ్యంగా మారింది. కాగా జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు నేతృత్వంలో బాధిత వర్గాన్ని శాంతింప జేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇరువర్గాల వారు సంయమనం పాటించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఒక ప్రకటనలో కోరారు.
బాధితురాలికి మంత్రి సీతక్క పరామర్శ
గాంధీ ఆస్పత్రి: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జైనూరు బాధితురాలిని మంత్రి సీతక్క పరామర్శించారు. మరింత మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. స్థానిక యువత సంయమనం పాటించాలని కోరారు. కాగా కాలేయ వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్న ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం షాపెల్లి గ్రామానికి చెందిన ముద్రబోయిన రఘును కూడా మంత్రి పరామర్శించారు.
1,000 మంది పోలీసులు, ఆర్‌ఏఎఫ్‌తో బందోబస్తు: డీజీపీ
జైనూరులో జిల్లా యంత్రాంగం కర్ఫ్యూ, 144 సెక్షన్ విధించిందని డీజీపీ జితేందర్ తెలిపారు. మహిళపై అత్యాచారయత్నం, హత్యాయత్నం ఘటనతో జైనూరులో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినట్లు బుధవారం ఒక ప్రకటనలో ఆయన వెల్లడించారు. దాడులు, ప్రతిదాడులతో పరిస్థితి చేయి దాటుతుండడంతో ఆదిలాబాద్, మంచిర్యాల, సిరిసిల్ల, జగిత్యాల, తెలంగాణ స్పెషల్ పోలీసు ప్లాటూన్స్ కలిసి మొత్తం 1,000 మంది పోలీసులను, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను రంగంలోకి దింపినట్లు తెలిపారు.
జైనూరులో పరిస్థితిని తనతో పాటు అదనపు డీజీ (శాంతిభద్రతలు), నార్త్ జోన్ ఐజీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలిపారు. ఇంటర్నెట్‌పై నిషేధం విధించామన్నారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు డీజీపీ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment