వెజిటబుల్స్‌ ఆన్‌ వీల్స్‌.. మొబైల్‌ మార్కెట్‌ రెడీ | Marketing Department Plan To Provide Mobile Vegetable Markets | Sakshi
Sakshi News home page

Vegetable Markets: మీరు కోరుకున్న ప్రాంతానికే కూరగాయలు

Published Sun, Mar 5 2023 4:32 AM | Last Updated on Sun, Mar 5 2023 4:40 AM

Marketing Department Plan To Provide Mobile Vegetable Markets - Sakshi

మార్కెటింగ్‌ శాఖ ప్రారంభించిన మొబైల్‌ కూరగాయల మార్కె ట్లకు మంచి స్పందన లభిస్తోంది. తాజా కూరగాయలను రైతులే తమ ప్రాంతానికి తెచ్చి అమ్ముతుండటం, ధరలు కూడా ఇతర మార్కెట్లతో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉంటుండటంతో వినియోగదారులు సంచార వాహనాల వద్దకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో రెండు దఫాలుగా చాలావరకు కూరగాయలు అమ్ముడుపోతుండటంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ప్రజల నుంచి విశేష స్పందన నేపథ్యంలో మార్కెటింగ్‌ శాఖ ఫోన్‌ లేదా ఈమెయిల్‌ చేస్తే  వినియోగదారులు కోరుకున్న ప్రాంతానికి ఈ మొబైల్‌ రైతు బజార్లను పంపించే వెసులుబాటు కల్పించింది. 

కూరగాయలు సైతం వివిధ యాప్‌ల ద్వారా ఆల్‌లైన్‌లో డోర్‌ డెలివరీ అవుతుండటం, వారానికో రోజు మండే మార్కెట్, ట్యూస్‌డే మార్కెట్‌ల వంటివి వీధి మలుపుల్లోనే కొనసాగుతుండటం, ఇళ్లకు సమీపంలోనే భారీ దుకాణాల్లో అందుబాటులో ఉండటంతో ఇటీవలి కాలంలో రైతుబజార్లకు వెళ్లే వారి సంఖ్య కొంత తగ్గింది. గతంలో మాదిరి కిటకిటలాడటం లేదు. చాలా సందర్భాల్లో శ్రమకోర్చి తెచ్చిన కూరగాయలు అమ్ముడుపోక రైతులు నష్టపోతున్నారు. కొన్నిసార్లు పాడైన కూరగాయలను అక్కడే పారబోసి వెళ్ళాల్సి వస్తోంది. పరిస్థితిని గమనించిన మార్కెటింగ్‌ శాఖ వినూత్నంగా ఆలోచించింది. వాహనాలు సమకూర్చి రైతులే కూరగాయల్ని బస్తీలు, కాలనీలు, గేటెడ్‌ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్‌ సముదాయాలకు తీసుకెళ్లి విక్రయించుకునే ఏర్పాటు చేసింది.

రైతుబజార్లకు వచ్చే రైతులు అక్కడినుంచి కూరగాయలను వాహనాల్లో పెట్టుకుని ఆయా ప్రాంతాలకు వెళతారన్నమాట. ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌లోని మూడు ప్రధాన రైతుబజార్ల నుంచి మార్కెటింగ్‌ శాఖ వాహనాలు పంపిస్తోంది. రైతులు వాహనాలకు సంబంధించిన డీజిల్, ఇతరత్రా ఖర్చులు ఏవీ భరించాల్సిన అవసరం లేకుండా తానే వ్యయాన్ని భరిస్తోంది. ప్రస్తుతం ఎర్రగడ్డ, ఫలక్‌నుమా, మెహిదీపట్నం రైతుబజార్ల నుంచి రైతులు వాహనాల్లో కూరగాయలు తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు. ఆన్‌లైన్‌లో వచ్చే కూరగాయలు తాజాగా ఉన్నాయో లేదో చూసుకుని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ తాజా కూరగాయలు కళ్లెదుటే కని్పస్తుండటం వల్ల వినియోగదారులు ఆకర్షితులవుతున్నారు. 

రైతుబజార్లకు తగ్గిన తాకిడి.. 
నగరవాసులు అన్ని వస్తు వులు ఆన్‌లైన్‌ ద్వారా డోర్‌ డెలివరీ పొందుతున్నారు. దీంతో రైతుబజార్లకు తాకిడి తగ్గింది. రైతులు కష్టపడి తెచ్చిన కూరగాయలు పూర్తిగా అమ్ముడవ్వక నష్టపోతున్నారు.దీంతో రైతులు వాహనాల్లో బస్తీలకు తీసుకెళ్లి విక్ర యించుకునేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించాం. 
    – లక్ష్మీబాయి, డైరెక్టర్, మార్కెటింగ్‌ శాఖ

ధరలు తక్కువ ఉంటున్నాయ్‌.. 
మా ఏరియాలో హోల్‌సేల్‌ కూరగాయల మార్కెట్‌ కానీ రైతుబజార్‌ కానీ లేదు. దీంతో కూరగాయలు కొనాలంటే చాలా దూరం వెళ్లాల్సి వచ్చేంది. ధరలు కూడా ఎక్కువగా ఉండేవి. ప్రస్తుతం వారానికి రెండుసార్లు బాలానగర్‌ బస్తీకి మొబైల్‌ రైతుబజార్‌ వస్తోంది. ధరలు కూడా తక్కువగానే ఉంటున్నాయి.  
– గణపతి, బాలానగర్‌ నివాసి 

నిర్ధారించిన ధరలకే..

కూరగాయల ధరలను మార్కెటింగ్‌ శాఖే నిర్ణయిస్తోంది. ఆయా ధరలను రైతులు తమ వాహనం వద్ద బోర్డుపై ప్రదర్శిస్తున్నారు. ఆయా వాహనాలను జీపీఎస్‌ ద్వారా ట్రాక్‌ చేస్తూ మార్కెటింగ్‌ శాఖ మొత్తం ప్రక్రియను పర్యవేక్షిస్తోంది. రైతులు ఇష్టమొచి్చన ధరలకు అమ్మకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రస్తు తం ఒక్కో రైతుబజార్‌ నుంచి 10 చొప్పున మొత్తం 30 వాహనాలు ఈ విధంగా బస్తీలకు కూరగాయలు తీసుకెళుతున్నాయి. ప్రజల నుంచి స్పందన లభిస్తున్న నేపథ్యంలో నగరంలో మొత్తం 11 రైతుబజార్లు ఉండగా..మరికొన్ని ప్రధాన రైతుబజార్ల నుంచి మొత్తం 125 వాహనాలు నడిపే ఆలోచనలో మార్కెటింగ్‌ శాఖ ఉంది.  

కూరగాయల కోసం కాల్‌ చేయాల్సిన నంబర్లు..

ఎర్రగడ్డ రైతుబజార్‌.. 7330733746 
ఫలక్‌నుమా.. 7330733743 
మెహిదీపట్నం.. 7330733745 

ఈమెయిల్‌..
ఎర్రగడ్డ రైతుబజార్‌.. MRB.E.HYD@Gmail.com
మెహిదీపట్నం..  MRB.M.HYD@Gmail.com
ఫలక్‌నుమా..  MRB.F.HYD@Gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement