
సాక్షి, హైదరాబాద్: ‘ఐటీ సంస్థలపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మంది బతుకుతున్నారు. కోవిడ్ అదుపులో ఉన్నందున ఐటీ సంస్థలు కరోనా నిబంధనలను పాటిస్తూ, గతంలో మాదిరి యథావిధిగా కార్యకలాపాలను నిర్వహించుకోవాలి. వర్క్ ఫ్రం హోం విధానానికి స్వస్తి పలకాలి. ఐటీ శాఖ కూడా ఈ మేరకు ఆయా సంస్థలకు సమాచారమిచ్చింద’ని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లాక్‌డౌన్ నిబంధనలను సడలించి 3 నెలలు గడుస్తున్నా రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉందని, ఎక్కడా అసాధారణంగా కేసులు పెరగలేదన్నారు.
హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లోనూ కరోనా నియంత్రణలోనే ఉందని చెప్పారు. ‘బడులు ప్రారంభమయ్యాయి. విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకు విద్య, వైద్య శాఖలు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 40–50 శాతం మంది విద్యార్థులు హాజరవుతుండగా, ప్రైవేటు బడుల్లో 25 శాతం మేరకు హాజరవుతున్నారు. ఎలాంటి భయాందోళన లేకుండా పిల్లల్ని బడికి పంపించాలని తల్లిదండ్రులను కోరుతున్నా. ఒక్క పాఠశాలలో కూడా ఐదుకు మించి కేసులు నమోదు కాలేదు. 1.10 లక్షల మంది విద్యార్థులను పరీక్షిస్తే వారిలో 55 మందిలో మాత్రమే కరోనా బయటపడింది’అని ఆయన చెప్పారు. ‘హైకోర్టు ఆదేశాలను అనుసరించి వసతిగృహాలు, గురుకుల పాఠశాలలు, కళాశాలలను కూడా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.
కరోనా థర్డ్‌వేవ్ వస్తుందని కొన్ని సంస్థలు చెబుతూ వస్తున్నాయి. మూడోదశ వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం’అని పేర్కొన్నారు. ‘మొత్తం 27 వేల పడకలకుగాను ఇప్పటికే 19 వేల పడకల్లో ఆక్సిజన్ సౌకర్యం కల్పించాం. ఈ నెలాఖరులోగా మిగిలిన పడకల్లోనూ ఆక్సిజన్ సౌకర్యం కల్పించేందుకు సన్నాహాలు కొనసాగుతున్నాయి. రూ.138 కోట్ల వ్యయంతో పిల్లల్లో కరోనా చికిత్సకు ఏర్పాట్లు చేస్తున్నాం. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే గాంధీ సహా ఐదు ప్రాంతీయ ఆసుపత్రుల్లో కొత్తగా 792 పడకలను సిద్ధం చేస్తున్నాం. మొత్తంగా బోధనాసుపత్రుల్లో 3,200 పడకలను పిల్లల కోసం ఏర్పాటు చేస్తున్నాం’అని శ్రీనివాసరావు తెలిపారు.
ప్రతి గ్రామానికి వెళ్లి టీకా వేస్తాం..
రాష్ట్రంలో ఇప్పటివరకూ 1.96 కోట్ల కరోనా టీకా డోసులను పంపిణీ చేసినట్లు శ్రీనివాసరావు తెలిపారు. ఇందులో 1.43 కోట్లు మొదటి డోసులు కాగా, 54 లక్షల వరకూ రెండు డోసులు పొందినవారున్నారన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మొదటి డోస్ టీకా దాదాపుగా 100 శాతం పూర్తయిందన్నారు. అయితే రాష్ట్రంలో ఇంకా 49 శాతం మంది కనీసం ఒక్క డోసు కూడా తీసుకోలేదన్నారు. ‘ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికీ టీకా పొందని వారు ఎక్కువమంది ఉన్నారు.
అందుకే వచ్చే 4 వారాల్లో ప్రతి గ్రామానికి వెళ్లి టీకాలను అందించేలా స్పె షల్‌డ్రైవ్ అమలు చేస్తాం’అని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20 లక్షల డోసులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ నెలాఖరుకు మరో 25 లక్షల డోసులు రానున్నాయన్నారు. వచ్చే నెలలో 75–80 లక్షల డోసులు వచ్చే అవకాశాలున్నాయన్నారు. మరో కొత్త రకం, అది కూడా బలమైన మార్పు చెందిన వైరస్ వస్తే తప్ప మూడోదశ ఉధృతి వచ్చే అవకాశాల్లేవని తేల్చిచెప్పారు.
10 వేలకు పడిపోతేనే ప్లేట్‌లెట్లు ఎక్కించాలి
గతేడాదితో పోల్చితే ఈసారి వైరల్ ఫీవర్ కేసులు పెరుగుతున్నాయని శ్రీనివాసరావు అన్నారు. కొన్ని జిల్లాల్లో డెంగీ, మలేరియా కేసులు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయని చెప్పారు. ప్రతి నెలా 1.5 లక్షల నుంచి 2 లక్షల వరకూ వైరల్ జ్వరాల కేసులు వస్తుంటాయని, సెప్టెంబర్‌లో మరింత పెరిగే అవకాశముందన్నారు. డెంగీ రోగుల్లో ప్లేట్‌లెట్లు తగ్గినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో వాటిని ఎక్కించేందుకు వీలుగా 22 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్లేట్‌లెట్ల పరికరాలను అం దుబాటులో ఉంచినట్లు చెప్పారు. లక్షకుపైగా ప్లేట్‌లెట్లు ఉన్నా కూడా అవసరం లేకపోయినా కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో వాటిని ఎక్కించాలని ఒత్తిడి తెస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయన్నారు. ప్లేట్‌లెట్లు 10 వేలకు పడిపోతేనే ఎక్కించాలని చెప్పాలి. ప్లేట్‌లెట్ల పేరిట దోపిడీకి పాల్పడవద్దని ప్రైవేటు ఆసుపత్రులను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment