సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టీకా నిల్వలు శనివారంతో ఖాళీ కావడం వల్ల వ్యాక్సినేషన్ ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రోజుకు సరాసరి లక్షన్నర టీకా డోసులు వేస్తున్నామని, రోజుకు 10 లక్షల టీకాలు వేసే సామర్థ్యం కూడా ఉందని చెప్పారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ సమస్యను త్వరగా పరిష్కరించాలని ఆయన కేంద్రాన్ని కోరారు.
ప్రాణవాయువు కొరత లేదు...
కరోనా తీవ్రత పెరుగుతున్నందున ఆక్సిజన్ కొరత లేకుండా కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామని మంత్రి ఈటల తెలిపారు. ప్రస్తుతానికి రోజుకు 260 టన్నుల ఆక్సిజన్ అవసరం పడుతోందని, రోగుల సంఖ్య పెరిగితే మున్ముందు 360 టన్నులు అవసరం అవుతుందన్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలోని ఆసుపత్రులకు ఆక్సిజన్ కు కొరత లేదన్నారు. రోగుల కోరిక మేరకు కాకుండా అవసరాన్ని బట్టి ప్రైవేట్, ప్రభుత్వ డాక్టర్లు ఆక్సిజన్ ఇవ్వాలన్నారు. కొందరైతే రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు 95–96 శాతం ఉన్నా ఆక్సిజన్ పెట్టాలని కోరుతున్నారన్నారు. మరోవైపు కొందరు రోగులే రెమిడిసివీర్ ఇంజెక్షన్ ఇవ్వాలని కోరుతున్నారన్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు రెమిడెసివిర్ పంపినట్లు వివరించారు.
గత 4 నెలలుగా కరోనా కేసులు తగ్గినందున డిమాండ్ లేకపోవడంతో కంపెనీలు రెమిడెసివీర్ తయారీని తగ్గించాయన్నారు. వాటిని తయారు చేశాక 15 రోజుల పాటు పరిశీలించాలి. ఈ నేపథ్యంలో 15 రోజుల ప్రొటోకాల్‌ను కొన్ని దేశాలు వారానికి తగ్గించాయి. ఆ ప్రకారమే ఇక్కడ చేయాలని కేంద్రాన్ని కోరామని, అలా అనుమతి వస్తే త్వరలో 3 లక్షల ఇంజెక్షన్లు తెలంగాణకు వస్తాయన్నారు. రెమిడెసివర్ తయారీ కంపెనీలతో సీఎం కేసీఆర్ నిత్యం మాట్లాడుతున్నారన్నారు. పారిశ్రామిక అవసరాలకు వాడకం తగ్గించి ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరా చేయాలని కూడా సీఎం సూచించారన్నారు. ఎవరికైనా అవసరమైతే రోగుల చిటీ తీసుకొస్తే డ్రగ్ కంట్రోల్ అధికారులు రెమిడెసివిర్ ఇస్తారన్నారు. అయినా అది సర్వరోగ నివారిణి కాదన్నారు.
ఎక్కడా పడకల కొరత లేదు...
కొన్ని ఆసుపత్రులు మినహాయిస్తే రాష్ట్రంలో ఎక్కడా పడకల కొరత లేదని మంత్రి ఈటల అన్నారు. ప్రతి రోగికీ స్పెషలిస్టులు అవసరంలేదని, సాధారణ ఎంబీబీఎస్ డాక్టర్లు కూడా కరోనా చికిత్స చేయవచ్చని ఆయన చెప్పారు. 95 శాతం మంది కరోనా రోగులకు లక్షణాలు ఉండట్లేదని, కాబట్టి వారికెవరికీ ఆస్పత్రుల అవసరం లేదన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 63 వేల పడకలు అందుబాటులో ఉన్నాయన్నారు. భారీ సంఖ్యలో కేసులు పెరుగుతున్నా సీరియస్ కేసులు తక్కువగా ఉంటున్నాయన్నారు. జీహెచ్‌ఎంసీలో కేసులు ఎక్కువగా వస్తున్నాయని, అందుకే మంత్రి కేటీఆర్ మున్సిపల్ శాఖను అప్రమత్తం చేశారన్నారు. శానిటైజేషన్ పెంచుతామన్నారు. లాక్‌డౌన్, కరŠూప్య పెట్టబోమని, అటువంటి అవసరం లేదని ఈటల స్పష్టం చేశారు. కరోనా రాకుండా చూసుకోవడంలో మాస్క్‌లే శ్రీరామరక్ష అన్నారు.
కరోనా కట్టడిలో దేశంలోనే ముందున్నాం...
కరోనా కట్టడిలో రాష్ట్రం దేశంలోనే ముందుందని ఈటల చెప్పారు. తెలంగాణలో మరణాలు తక్కువగా నమోదవుతున్నాయన్నారు. కరోనా నియంత్రణకు అవసరమైతే రూ. వందల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదని, తాను ఇప్పటివరకు సాధారణ మాస్కే పెట్టుకొని ప్రజల్లో తిరుగుతున్నానన్నారు.
గాలి ద్వారా వైరస్ వదంతే...
గాలి ద్వారా కరోనా వైరస్ సోకుతుందని వదంతులు వస్తున్నాయని, అయితే దీన్ని ఎలా చెప్పగలమని ఈటల ప్రశ్నించారు. వైరస్ ఏ విధంగా ఉంటుందో, ఎలా ప్రవర్తిస్తుందో ఎవరికీ తెలియదన్నారు. ఇప్పటివరకు 99.5 శాతం మందికి కరోనా సోకినా నయమైందని, మిగిలినవారిలో కొందరు మరణించారన్నారు. కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు సీరియస్ కేసులను గాంధీ ఆస్పత్రికి పంపిస్తున్నాయన్నారు. సెకెండ్ వేవ్ దేశాన్ని, రాష్ట్రాన్ని వణికిస్తుందన్నారు. మహారాష్ట్రలో కరోనా కేసులు బాగా పెరిగాయన్నారు. 45 ఏళ్లు పైబడిన వారంతా టీకా తీసుకోవాలన్నారు. యువత కూడా వైరస్ బారిన పడుతున్న దృష్ట్యా 25 ఏళ్లు పైబడిన వారికి కూడా టీకా ఇవ్వాలని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ దృష్టికి తీసుకెళ్లినా ఇంతవరకు స్పందించలేదని ఈటల పేర్కొన్నారు. గతంలో 10–12 రోజులకు కరోనా లక్షణాలు కనిపించేవనీ, కానీ సెకండ్ వేవ్‌లో 2–3 రోజులకే తీవ్రత పెరుగుతోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment