ఎన్నికల వేళ.. కేటీఆర్‌ కీలక నిర్ణయాలు | Minister KTR Review Meeting On Hyderabad Development | Sakshi
Sakshi News home page

ఎన్నికల వేళ.. కేటీఆర్‌ కీలక నిర్ణయాలు

Published Mon, Oct 5 2020 3:58 PM | Last Updated on Mon, Oct 5 2020 6:02 PM

Minister KTR Review Meeting On Hyderabad Development - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : హైదరాబాద్ నగరాన్ని మరింత సురక్షితం నగరంగా మార్చేందుకు చర్యలు తీసుకోవాలని ఇందుకు అవసరమైన ప్రణాళికలను తయారు చేయాలని పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర డీజీపీ మూడు కమిషనరేట్ల కమిషనర్లతో పాటు జీహెచ్ఎంసీ మున్సిపల్ శాఖ అధికారులతో కలిసి సోమవారం నిర్వహించిన ఉమ్మడి సమావేశంలో ఈ మేరకు మంత్రి పలు ప్రతిపాదనలు చేశారు. ప్రస్తుతం నగరంలో ఉన్న సుమారు ఐదు లక్షల 80 వేల సీసీ కెమెరాలకు అదనంగా మరిన్ని కెమెరాలను ఇన్ స్టాల్ చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పోలీసు అధికారులకు మంత్రి సూచించారు. హైదరాబాద్ నగరంలో మొత్తం పది లక్షల కెమెరాలను ఏర్పాటు చేసేందుకు కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. (హైదరాబాద్‌కు మరో ప్రతిష్టాత్మక సంస్థ)

దేశంలోనే అత్యధిక సీసీ కెమెరాలు కలిగిన నగరం హైదరాబాద్‌ అని, ప్రపంచవ్యాప్తంగా 16వ స్థానంలో ఉన్న నగరగా ఒక రిపోర్ట్ ప్రస్తావించిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శాంతి భద్రతలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారని, ఆ దిశగానే ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితంగా గత ఆరేళ్లుగా హైదరాబాద్‌లో శాంతి భద్రతలు విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదన్నారు. పోలీస్ శాఖను బలోపేతం చేయడం ద్వారా నగరంలో శాంతి భద్రతలను సాఫీగా కొనసాగించి పరిస్థితులను ముఖ్యమంత్రి సంకల్పించాలని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నగరానికి పెద్దఎత్తున పెట్టుబడులతో పాటు పట్టణీకరణ లో భాగంగా నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో ఇక్కడ మరింత నిఘా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా ప్రస్తుతమున్న సీసీ కెమెరాలకు తోడుగా నూతనంగా పట్టణీకరణ చెందుతున్న హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ సీసీ కెమెరాల ఏర్పాట్లపైన పరిసర మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో తో కలిసి పనిచేయాలని పురపాలక శాఖ పోలీసు శాఖకు మంత్రి కేటీఆర్ సూచించారు.

ప్రస్తుతం జీహెచ్ఎంసీ నిర్మిస్తున్న నూతన ఫ్లైఓవర్లు, రోడ్లు వంటి చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని వీటితోపాటు పార్కులు, చెరువులు, బస్తి దావఖాన, వీధి దీపాల స్తంభాలు, మెట్రో పిల్లర్ల వంటి వాటిని సీసీ కెమెరాల కోసం వినియోగించుకునే అంశాలను పరిశీలించాలన్నారు. నగరంలో ప్రజలు గూమి కూడే ప్రతి చోట సీసీ కెమెరాల నిఘా ఉండాల్సిన అవసరం ఉందని ఆ దిశగా మార్కెట్లు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు మొదలైనచోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కమాండ్ కంట్రోల్ సెంటర్ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో, హైదరాబాద్ నగరం మరింత సురక్షితంగా ఉంటుందని విశ్వాసాన్ని మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు. త్వరలో తీసుకురానున్న నూతన జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ చట్టాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు సంబంధించి ఏమైనా ప్రత్యేక అంశాలను చేర్చాల్సిన అవసరం ఉన్నదా అని ఈ సందర్భంగా పోలీసు అధికారులను మంత్రి కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. (నవంబర్‌ 11 తర్వాత ఏ క్షణమైనా...)

దీంతో పాటు హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యల పైన భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపైన కూడా పోలీస్ శాఖ నుంచి సమాచారాన్ని తీసుకున్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు జీహెచ్ఎంసీ తరఫున తీసుకోవాల్సిన చర్యల మీద కూడా మంత్రి కేటీఆర్ పలు సూచనలు చేశారు. ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో పెద్ద ఎత్తున నమోదవుతున్న సైబర్ క్రైమ్ కేసుల పరిష్కారానికి ప్రస్తుతం ఉన్న సైబర్ క్రైమ్ సిబ్బందితో పాటు సైబర్ వారియర్ లను పోలీస్ శాఖ తయారు చేసుకోవలసిన అవసరం ఉందని సూచించారు. కట్టుదిట్టంగా శాంతిభద్రతలను నిర్వహిస్తున్న హైదరాబాద్ పోలీస్ కార్యక్రమాలకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా పోలీసు అధికారులు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి కేటీఆర్ సూచించిన విధంగా పది లక్షల సీసీ కెమెరాలను ఇన్ స్టాల్  చేసే లక్ష్యాన్ని స్వీకరించి ఆ దిశగా కార్యక్రమాలు ప్రణాళికలు కొనసాగిస్తామన్నారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోద్బలంతోనే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ద్వారా శాంతిభద్రతలను గట్టిగా నిర్వహించే కలుగుతుందని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం ఉన్న సీసీ కెమెరాల ద్వారా నేరాల సంఖ్య పెద్దఎత్తున తగ్గిందని, నేరాలు జరిగిన వెంటనే నేరస్థులను అదుపులోకి తీసుకునేందుకు సీసీ కెమెరాల ఫీడ్ చాలా ఉపయుక్తంగా ఉంటుందని ఈ సందర్భంగా హోం మంత్రి అన్నారు. హైదరాబాద్ నగర అవసరాల దృష్ట్యా జిహెచ్ఎంసి, పోలీస్ శాఖ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్నదని ఆయన అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి తో పాటు నగర పరిధిలోని మూడు కమిషనరేట్ల కమిషనర్లు, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇతర పురపాలక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement