
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో వివిధ కాలనీల్లో సంవత్సరాలుగా పేరుకుపోయిన రెవెన్యూ సమస్యలపైన పురపాలక శాఖ మంత్రి కే.తారక రామారావు(కేటీఆర్) శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, కాలనీల సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. నూతన రెవెన్యూ చట్టం ద్వారా ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ వ్యవసాయ భూముల పైన హక్కులు కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. (చదవండి: ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాకం..)
సామాన్యుడిపై ఎలాంటి భారం పడకుండా అండగా ఉంటామన్నారు. అవినీతికి పాతర వేస్తూ నూతన చట్టానికి ఆమోదం తీసుకున్నట్లు ఆయన వివరించారు. రాష్ట్రంలో భవిష్యత్తులో అన్ని రిజిస్ట్రేషన్లు ధరణి పోర్టల్ ఆధారంగానే జరుగుతాయని చెప్పారు. హైదరాబాద్ నగరంలో సుమారు 24 లక్షల 50 వేల ఆస్తులు ఉన్నట్లు అంచనా ఉందని చెప్పారు. హైదరాబాద్ ప్రజలు నిశ్చింతగా వారి ఆస్తి హక్కులను పొందేలా, సమస్యలను పరిష్కరించేలా.. పేద, మధ్య తరగతి ప్రజలకు వారి ఆస్తుల పట్ల హక్కులు కల్పించాలని ప్రయత్నం చేస్తున్నట్లు కేటీఆర్ వివరించారు. రానున్న 15 రోజుల పాటు ధరణి పోర్టల్ లో ఆస్తుల నమోదు కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులంతా చురుగ్గా పాల్గొనాలని సూచించారు. ఎవరు కూడా దళారులను నమ్మొద్దని, ఒక్కపైసా ఇవ్వవద్దని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment