సాక్షి, హైదరాబాద్: వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం ఘోరంగా విఫలమైందని రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రానికి స్పష్టత లేదని, తెలంగాణవాసిగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్ర రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌తో కలసి మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడారు. పంజాబ్ తరహాలో తెలంగాణలోనూ కేంద్రం వరి ధాన్యం కొనుగోలు చేయాలని, లేనిపక్షంలో భవిష్యత్‌లో జరిగే పరిణామాలకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బాధ్యత వహించాలని హెచ్చరించారు.
బాయిల్డ్ రైస్‌ను కేంద్రం ప్రోత్సహించడం వల్లే దేశవ్యాప్తంగా అనేక బాయిల్డ్ రైస్ మిల్లులు ఏర్పడ్డాయన్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే డబ్బు చెల్లిస్తోందని, కానీ కేంద్రం నుంచి ఆరు నెలల తర్వాత ధాన్యం కొనుగోలు డబ్బు వస్తుండటంతో రాష్ట్రంపై వడ్డీ భారం పడుతోందన్నారు. వడ్డీ భారాన్ని భరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినా ఇప్పటివరకు చలనం లేదని నిరంజన్‌రెడ్డి వెల్లడించారు.
దేశంలో బియ్యం నిల్వలు పేరుకుపోయాయని కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ చెప్తుం డగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాత్రం వరి ధాన్యం పండించాలని చెప్తున్నారని నిరంజన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ నుంచి వరి ధాన్యం కొనుగోలు చేయాలని మంత్రి కేటీఆర్‌తో కలిసి తాను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసిన సంద ర్భంలో ఆయన వెకిలినవ్వుతో సమాధానం ఇచ్చారని మంత్రి గంగుల అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment