కుటుంబ సభ్యులతో మానస సందడి
సాక్షి, చిక్కడపల్లి: మిస్ వరల్డ్ కిరీటాన్ని సాధించడమే తన లక్ష్యమని మిస్ ఇండియా మానస వారణాసి అన్నారు. బుధవారం సాయంత్రం నగరంలోని అశోక్‌నగర్ వీధి నంబర్– 2లోని తన నివాసానికి చేరుకున్నారు. ఆమెకు తల్లిదండ్రులు శైలజ, రవిశంకర్, చెల్లెలు మేఘన, అమ్మమ్మ గరికపాటి అన్నపూర్ణ, స్నేహితులు, అపార్ట్‌మెంట్‌వాసులు ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం మానసను లెజెండ్ అపార్ట్‌మెంట్ వాసులు ఆత్మీయంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె ఏమన్నారంటే..
♦చాలా రోజుల తర్వాత నగరంలోని సొంతింటికి వచ్చాను. మిస్ ఇండియా పోటీలో నిలిచేందుకు ఎంతోకాలం నిరీక్షించాను. ముంబై వెళ్లి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో ఉంటూ ఎంతో కష్టపడి పోటీలకు సన్నద్ధమయ్యాను.
♦మిస్ ఇండియా ఓ బిగ్ చాలెంజ్. దానిని సొంతం చేసుకోవడం సంతోషంగా ఉంది. ఈ ప్లాట్‌ఫాం వైపు స్నేహితులు ఎంతగానో ప్రోత్సహించారు. మా అమ్మానాన్న సైతం ఆ దిశగా ముందుకు నడిపించారు. ఇప్పుడు వారెంతో సంతోషపడుతున్నారు. ఇండియాను ఇంటర్నేషనల్ ప్లాట్‌ఫాంపై నిలబెట్టేందుకు కృషి చేస్తా. సినిమా అవకాశాలు ప్రస్తుతానికి వాటి జోలికి వెళ్లను. నా లక్ష్యం మిస్‌వరల్డ్ మాత్రమే.
♦మిస్ ఇండియా మానసను చూడగానే అశోక్‌నగర్‌లోని స్ట్రీట్ నంబర్ వాసులు, లెజెండ్ అపార్ట్‌మెంట్ వాసులు ఆమెపై పూలవర్షం కురిపించి సత్కరించారు. డప్పు దరువులకనుగణంగా చిన్నారులతో కలిసి ఆమె డ్యాన్స్ చేయడం అందరినీ అలరించింది. స్నేహితులు, బంధువులు పూల బొకేలతో మానసను అభినందించారు. ఆమెతో సెల్ఫీలు దిగారు.
స్నేహితులతో కలసి తీన్మార్ డ్యాన్స్ చేస్తున్న మిస్ ఇండియా మానస వారణాసి
మాకెంతో గర్వకారణం
తమ అపార్ట్‌మెంట్లో ఉండి ఎంతో స్నేహపూర్వకంగా కలిసిమెలిసి అందరితో వినయంగా మాట్లాడే మానసకు మిస్ ఇండియా రావడం గర్వకారణం. – సందీప్ మిశ్రా, అపార్ట్‌మెంట్ వాసి
మిస్ వరల్డ్ రావాలి..
లెజెండ్ అపార్ట్‌మెంట్‌లో మానసను తొమ్మిదేళ్లుగా చూ స్తున్నాం. ఆమెకు మిస్ ఇండి యా రావడం ఎంతో సంతో షంగా ఉంది. మిస్ వరల్డ్ కూడా రావాలని ఆశిస్తున్నాం.
– పద్మాకర్ జాదవ్, అపార్ట్‌మెంట్ వాసి
విమానాశ్రయంలో ఘనస్వాగతం
శంషాబాద్: మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న తర్వాత తొలిసారిగా మానస వారణాసి బుధవారం హైదరాబాద్‌కు వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయంలో కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, అభిమానులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మానస వారణాసి మీడియాతో మాట్లాడుతూ.. మిస్ ఇండియా పోటీల్లో వివిధ రాష్ట్రాల అమ్మాయిలతో కలిసి ఉన్నానని, మంచి వాతావరణంలో పోటీలు జరిగాయన్నారు. వలంటీర్‌గా తాను పనిచేసిన అనుభవం కూడా తన విజయానికి దోహదపడిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment