సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ని.. గ్లామర్‌ రంగానికి కొత్త | Miss India Winner Manasa Varanasi Special Story | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ నా సిటీనే.. నా బ్యూటీ

Feb 16 2021 7:05 AM | Updated on Feb 16 2021 6:06 PM

Miss India Winner Manasa Varanasi Special Story - Sakshi

‘హైదరాబాద్‌ నగరం నన్ను తీర్చిదిద్దింది. ఫుడ్‌ నుంచి ఫ్రెండ్స్‌ దాకా ఎన్నో ఇచ్చింది. నేను ఈ నగరంతో మమేకమైపోయా’’ అంటోంది నగరవాసి, తాజాగా ముంబయిలో జరిగిన పోటీల్లో మిస్‌ ఇండియా టైటిల్‌ గెల్చుకున్న మానస వారణాసి (23). గ్లామర్‌ రంగంతో ఏ మాత్రం సంబంధం లేకుండా నేరుగా బ్యూటీ కాంటెస్ట్‌లోకి అడుగుపెట్టిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌.. ఎంబ్రాయిడరీ నుంచి ట్రెక్కింగ్‌ దాకా భిన్న రకాల అభిరుచులు, చిన్న వయసులోనే పరిపక్వ ఆలోచనలతో అబ్బురపరిచే మానస ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే...     

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న నేను గ్లామర్‌ రంగానికి చాలా కొత్త. కాలేజ్‌ డేస్‌లో మిస్‌ ఫ్రెషర్‌గా గెలవడం తప్ప.. గతంలో గ్లామర్‌ రంగంలో ఎప్పుడూ ఫుల్‌టైమ్‌ పనిచేసింది లేదు. అనుకోకుండా ఈ పోటీకి ఎంపికై, టైటిల్‌ గెలుచుకోవడం చాలా ఆనందాన్నిస్తోంది.  
 
పోటీ ఇప్పటికే.. సిస్టర్స్‌గా ఎప్పటికీ... 
మిస్‌ ఇండియా పోటీలో 31 మంది ఫైనలిస్ట్‌లు పలు రాష్ట్రాల నుంచి, కేంద్ర పాలిత ప్రాంతం నుంచి కూడా ప్రాతినిధ్యం వహించారు. కోవిడ్‌ కారణంగా ఈ పోటీ చాలా వరకూ వర్చువల్‌గానే సాగింది. వీరిలో 15 మంది ముంబయిలో జరిగిన ఫైనల్స్‌కు ఎంపికై హాజరయ్యారు. ఈ పోటీల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నా. అంతేకాదు స్టైలింగ్‌ నుంచి ఎక్సర్‌సైజ్‌ దాకా ఎన్నో మెళకువలు కూడా నేర్చుకున్నా. ఈ అనుభవం మర్చిపోలేనిది. పోటీ కేవలం ఇక్కడి వరకే. తర్వాత స్వంత సిస్టర్స్‌లా లైఫ్‌ లాంగ్‌ టచ్‌లో ఉంటాం.  

కుటుంబమే కీర్తి... మనుషులే స్ఫూర్తి... 
అమ్మమ్మ, తల్లిదండ్రులు, సోదరి ఇదే నా కుటుంబం. వాసవిలో ఇంజినీరింగ్‌ చదివా. సాధారణ జీవితం, అత్యున్నత ఆలోచనలు, విద్యకు ప్రాధాన్యం ఇచ్చే కుటుంబం మాది. అది నేర్పిన విలువలే నన్ను నిర్వచిస్తాయి. తమను తాము ఎప్పటికప్పుడు పునర్నిర్వచించుకుని, పునరావిష్కరించుకునే మనుషులే నాకు స్ఫూర్తి. జీవితాంతం వ్యక్తిగా పరిణతి సాధించుతూనే సాగుతాను. ఏ విషయంలోనైనా అంతిమంగా పశ్చాత్తాపం చెందాల్సిన అవసరం లేని సంపూర్ణ జీవితమే నాకు ప్రధానం.   

సినిమా... రమ్మంటే? 
భవిష్యత్తు మనకేమి ఇస్తుందో ఎవరికి తెలుసు? ఒక కొత్త ఆశలు..అవకాశాల ప్రపంచాన్ని సృష్టించుకోవడానికి నేను మిస్‌ ఇండియా పోటీలకు వచ్చాను. ఈ టైటిల్‌ నన్నెక్కడికి తీసుకెళుతుందో చూడాలని నేను ఉద్విగ్నంగా ఎదురు చూస్తున్నా. సినిమా రంగ ప్రవేశం అనే ప్రశ్నకు కాలం మాత్రమే సమాధానం చెబుతుంది. నా వరకూ నాకు ఎదురయ్యే ప్రతి అవకాశానికి తలుపులు తెరచి ఉంచాలనేది ఇప్పటిదాకా సాగిన నా ప్రయాణం నాకు నేర్పింది. అద్భుత యోగం.. అందం మానసికం.. 

శరీరంతో పాటు మనసు ఆత్మల మేలు కలయికే ఫిట్‌నెస్‌. అది అందించేదిగా నేను ఎంచుకున్న యోగా నా జీవితంలో అద్భుతాలు చేసింది. ఇతరుల్ని మెప్పించడానికి చేసే ప్రయత్నం కాక నిన్ను నువ్వు మెప్పించుకోవడమే ముఖ్యమనేది ఫ్యాషన్‌లో పాటించే సూచించే సూత్రం. నువ్వేమిటి అనే విషయంలో ఆత్మవిశ్వాసంతో ఉంటే నీకు నువ్వెప్పుడూ అందంగానే ఉంటావు. నీ గురించి నువ్వు సంతృప్తిగా భావించకపోతే అందంగా ఉండడం అనేదానిలో అర్ధం లేదు.  

అందాల భామ.. అభిరుచుల చిరునామా.. 
నగరానికి చెందిన మానస వారణాసి ప్రస్తుతం ఫైనాన్షియల్‌ ఇన్ఫర్మేషన్‌ ఎక్స్‌ఛేంజ్‌ ఎనలిస్ట్‌గా ఓ ప్రైవేట్‌ సంస్థలో పనిచేస్తున్నారు. మానస తండ్రి అనుమణి వారణాసి, తల్లి శైలజ వారణాసి. ఇన్‌స్ట్రా గ్రామ్‌ ద్వారా పెట్స్‌పై ప్రేమ నుంచి తన ఎంబ్రాయిడరీ స్కిల్స్‌ దాకా ఎన్నో ఆమె పంచుకుంటుంటారు. ట్రెక్కింగ్, స్కై గేజింగ్‌ తదితర సాహసాలు చేయడాన్ని ఇష్టపడే మానస సైన్‌ లాంగ్వేజ్‌ లో కూడా శిక్షణ పొందారు.  

ఒక సాధారణ యువతిగా నగరానికి చెందిన ఎన్జీవో ‘మేక్‌ ఎ డిఫరెన్స్‌’తో కలిసి పనిచేయడం నన్ను చాలా మార్చింది. నా అంతర్ముఖ వ్యక్తిత్వాన్ని అధిగమించడానికి, విద్యాపరమైన సమానత్వాన్ని అర్ధం చేసుకోవడానికి కూడా ఉపకరించింది. ఆ అనుభవాన్ని ఉపయోగించుకుని ఇక మిస్‌ ఇండియాగా సమాజానికి నా వంతు బాధ్యత స్వచ్ఛంగా, స్వచ్ఛందంగా నిర్వర్తిస్తాను. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement