కుషాయిగూడ: తప్పిపోయిన ఇద్దరు చిన్నారుల ఆచూకీ ఓ అధికారి ఫోన్‌లో పెట్టిన స్టేటస్‌తో కనుగొన్న ఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మాలోరి లక్ష్మీరవి, సత్యమూర్తి దంపతులు కాప్రా, గాంధీనగర్ కాలనీలో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటున్నారు. వారికి శివ అశ్లేష (7), యామిని (4) ఇద్దరు కూతుళ్లు. అశ్లేష రెండో తరగతి చదువుతుండగా యామిని అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్తుంది. శుక్రవారం రోజులానే వెళ్లిన ఇద్దరు చిన్నారులు సాయంత్రం ఇంటికి వెళ్లే సమయంలో ఇల్లు మర్చిపోయి నేరేడ్‌మెట్ వైపు నడుచుకుంటూ వెళ్లిపోయారు.
ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన ఎస్సై వేణుమాధవ్ చిన్నారుల ఫొటోలను తన సెల్‌ఫోన్ స్టేటస్‌లో పెట్టి ఆచూకి తెలిస్తే సమాచారం ఇవ్వాలని సూచించారు. పెట్రోలింగ్ పోలీసుల సాయంతో సుమారు గంట పాటుగా పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. అంతలోనే ఎస్సై స్టేటస్ చూసిన తెలిసిన వ్యక్తి పిల్లలు నేరేడ్‌మెట్ ప్రాంతంలో ఉన్నట్లు తెలిపాడు. వెంటనే అక్కడికెళ్లి పిల్లలను స్టేషన్‌కు తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్సై వేణుమాధవ్ సమయస్ఫూర్తిని స్థానికులు అభినందించారు.
(చదవండి: ఆరోగ్యవంతమైన సమాజం కోసం యోగా అవసరం’)
Comments
Please login to add a commentAdd a comment