
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, ఇల్లెందు: ముప్ఫై ఏళ్ల క్రితం ఇంటినుంచి వెళ్లి తప్పిపోయిన ఓ తల్లి తిరిగి కుటుంబ సభ్యులందర్నీ కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. భద్రాద్రి కొత్త గూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలోని నంబర్ 2 బస్తీలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. కొత్తగూడెంలోని హెడ్ ఆఫీస్ వద్ద నివాసం ఉండే పుప్పాల నారాయణకు ఇద్దరు భార్యలు లక్ష్మీ, పార్వతి. లక్ష్మీకి నలుగురు సంతానం కాగా.. ఇద్దరు కొడుకులు పుప్పాల రవీంద్రనాథ్, కృష్ణ , ఇద్దరు కుమార్తెలు సరళ, ఉమామహేశ్వరి. ఇక పార్వతికి ఇద్దరు కుమార్తెలు..విజయ, పద్మ ఉన్నారు. అయితే ఇంట్లో తలెత్తిన మనస్పర్థల కారణంగా పార్వతమ్మ హైదరాబాద్‌లో ఐటీఐ చదువుతున్న మారు తల్లి కుమారుడు రవీంద్రనాథ్ వద్దకు వెళ్లింది.
అక్కడ రెండ్రోజులపాటు ఉంది. ఆ తర్వాత ఇంటికి వెళ్తానని చెప్పి బస్సు ఎక్కింది. కానీ..తిరిగి ఇంటికి చేరుకోలేదు. హన్మకొండలో బస్సు దిగింది. ఎటు వెళ్లాలో తెలియక ఓ అనాథాశ్రమంలో చేరింది. అక్కడే ఏడేళ్లు గడిపింది. అక్కడ్నుంచి అనాథాశ్రమం నుంచి ఆమెను బయటకు పంపడంతో విజయవాడ కనకదుర్గ అమ్మవారి గుడిలో లడ్డూలు తయారు చేసే పనికి కుదిరింది. కరోనా కారణంగా ఆలయాలు మూతపడటంతో ఆమెను మమత అనాథాశ్రమం వారు చేరదీశారు. వారం క్రితం అక్కడి అనాథాశ్రమం నిర్వాహకుల అనుమతి కోరి కొత్తగూడెం రాగా..అక్కడ తమ ఇంటి ఆనవాళ్లు గానీ..కుటుంబ సభ్యుల వివరాలు గానీ లభించకపోవడంతో పార్వతమ్మ ఇల్లెందులో తన బంధువులు ఇంటికి వెళ్లింది.
ఇల్లెందులో దిగి నంబర్–2 బస్తీకి చేరుకుని తమ బంధువుల అడ్రస్ అడుగుతుండగా..ఆనాటి తరంవారు పార్వతమ్మన గుర్తు పట్టి ఆమెను బంధువుల ఇంటికి చేర్చారు. వారు పార్వతమ్మ బిడ్డలకు సమాచారం అందించడంతో బిడ్డలు వచ్చి తల్లిని కలుసుకున్నారు. 30 ఏళ్ల తర్వాత ఇంటికి చేరడం..అందరినీ చూడటంతో తన జీవితం ధన్యమైందని పార్వతమ్మ చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment