అక్రమ మైనింగ్‌లో మనీలాండరింగ్‌పై ఈడీ ఆరా
ఇంటితోపాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు
ఏకకాలంలో పలుచోట్ల సోదాలు..పలు కీలక పత్రాలు స్వాదీనం
ఇది ముమ్మాటికి రాజకీయ కుట్ర: ఎమ్మెల్యే గూడెం
సాక్షి, హైదరాబాద్/పటాన్‌చెరు/పటాన్‌చెరు టౌన్: అక్రమ మైనింగ్ వ్యవహారంలో మనీలాండరింగ్ కోణంలో ఆరా తీస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, ఆయన సోదరుడు గూడెం మధుసూధన్‌రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టింది. గురువారం ఉదయాన్నే ఈడీ అధికారులు బృందాలుగా విడిపోయి సోదాలు ప్రారంభించారు.
మహిపాల్‌రెడ్డి, మధుసూధన్‌రెడ్డితోపాటు మైనింగ్‌కు సంబంధించి కార్యాలయాలు, బంధువులు, బినామీల ఇళ్లలో ఏకకాలంలో ఈడీ అధికారులు హైదరాబాద్, పరిసరాల్లోని మొత్తం ఏడుకు పైగా ప్రాంతాల్లో సోదాలు జరిపారు. ఉదయం ప్రారంభమైన ఈ సోదాలు సాయంత్రం వరకు దాదాపు 11 గంటలపాటు సాగాయి. నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆరోపణలపై మధుసూధన్ రెడ్డిపై పటాన్‌చెరు పోలీసులు గతంలో కేసు నమోదు చేశారు.
కేసు దర్యాప్తులో భాగంగా మధుసూదన్‌రెడ్డిని స్థానిక పోలీసులు అరెస్టు చేసి జ్యుడీíÙయల్ కస్టడీకి తరలించారు. ఆ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద మరో కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా గురువారం సోదాలు నిర్వహించినట్టు తెలిసింది.
ఈ సోదాల్లో పలు కీలక పత్రాలను, డిజిటల్ డివైజ్‌లను స్వా«దీనం చేసుకున్నట్టు సమాచారం. ఎమ్మెల్యే ఇంట్లోని వ్యక్తులు ఎవరినీ బయటికి రానీయలేదు. అలాగే వారి ఫోన్లను కూడా ఈడీ బయటకు అనుమతించలేదు. నివాసాల వద్ద ఉన్న కార్లలో కూడా తనిఖీలు చేసి అధికారులు కొన్ని కాగితాలను తీసుకెళ్లారు.
నిబంధనల అతిక్రమణపై కేసు నమోదు
కేంద్ర పర్యావరణ నిబంధనల ఉల్లంఘనలు, అనుమతించిన పరిమితికి మించి తవ్వకాలు వంటి ఆరోపణలపై స్థానిక తహసీల్దార్ ఫిర్యాదు మేరకు మధుసూదన్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధానంగా సంతోష్ గ్రానైట్ మైనింగ్, ఈ ఆరోపణలకు కేంద్ర బిందువుగా మారింది. సంబంధిత అనుమతుల గడువు ముగిసినా కూడా మధుసూదన్‌రెడ్డి మైనింగ్ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారంటూ ఇటీవల అధికారులు క్రషర్లను స్వాధీనం చేసుకున్నారు.
పటాన్‌చెరు నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలు వెలుగులోకి రావడంతో సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ కమిటీ విచారణ చేపట్టింది. కమిటీ విచారణలో లక్డారంలో మధుసూధన్‌రెడ్డికి చెందిన కంపెనీలు నిర్వహిస్తున్న అనేక అక్రమ మైనింగ్ కార్యకలాపాలు బయటపడ్డాయి.
మహిపాల్‌రెడ్డి, మధుసూధన్‌రెడ్డిలకు సంబంధించిన వ్యాపారాలపైనా ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇటీవలే రూ.3 కోట్లతో మహిపాల్ రెడ్డి అల్లుడు లాండ్‌క్రూజర్ కారును కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించి డబ్బు ఎక్కడిది అన్న కోణంలోనూ ఈడీ ఆరా తీస్తున్నట్టు తెలిసింది.
కొండను తవ్వి ఎలుకను పట్టారు
ఈడీ తనిఖీలకు తాము పూర్తిగా సహకరించామని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చెప్పారు. సోదాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని నిర్ధారించుకున్నాక అధికారులు వెళ్లిపోయారన్నారు. కొన్ని దస్తావేజులకు సంబంధించిన జిరాక్స్ పత్రాలను వెంట తీసుకెళ్లారని పేర్కొన్నారు. ఇది పూర్తిగా రాజకీయ కక్షపూరిత దాడిగా ఆయన అభివరి్ణంచారు. దేశం యావత్తు ఈడీ అధికారుల తీరును ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment