
సాక్షి, మల్యాల(చొప్పదండి): ‘ఇంటింటికీ పింఛన్లు ఇచ్చుకుంట.. మాకు ధీముగా ఉన్న కేసీఆర్ సారు సల్లంగుండాలె బిడ్డా..’అని రోడ్డు వెంట మక్కకంకులు కాల్చి విక్రయిస్తున్న ఓ మహిళ వ్యాఖ్యానించింది. ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటన ముగించుకుని తిరుగుప్రయాణంలో మల్యాల మండలం నూకపల్లి శివారులో కాసేపు ఆగారు. అక్కడే మక్కకంకులు అమ్ముతున్న ఓ మహిళ వద్దకు వెళ్లి వాటిని కొనుగోలు చేశారు.
ఆమెతో మాటలు కలుపుతూ, కంకులు తింటూ సీఎం కేసీఆర్ పాలనపై కవిత ఆరా తీశారు. అయితే, తనకే కాదు ఇంటింటికీ పింఛన్ వస్తోందని ఆ మహిళ సంతోషంగా చెప్పింది. ‘కేసీఆర్ సారు పదికాలాలు సల్లంగుండాలె’అని దీవించింది. సీఎం కేసీఆర్ కూతురు కవిత తన వద్దకు వచ్చి కంకులు కొనుగోలు చేయడం చాలా సంతోషంగా ఉందని ఉబ్బితబ్బిబ్బయింది. ఎమ్మెల్సీ కవితను చూసి వచ్చిన స్థానికులు ఆమెతో సెల్ఫీలు దిగారు.
Comments
Please login to add a commentAdd a comment