సాక్షి, హైదరాబాద్: కోవిడ్ చికిత్సలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన ‘మోనోక్లోనల్ యాంటీబాడీస్ కాక్‌టెయిల్ డ్రగ్’ ప్రభావవంతంగా పనిచేస్తోందని వైద్యులు చెప్తున్నారు. రాష్ట్రంలోని ఏఐజీ, యశోద ఆస్పత్రుల్లో రెండు వారాలుగా ఈ మందును ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నారు. ఇప్పటివరకు ఈ ఔషధంతో ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదని, సైడ్ ఎఫెక్టులు తక్కువగా ఉంటున్నాయని వైద్యులు చెప్తున్నారు. తమ పరిశీలన వివరాలను ‘సాక్షి’కి వెల్లడించారు.
ఏమిటీ కాక్‌టెయిల్ డ్రగ్?
కసిరివిమాబ్, ఇమ్డెవిమాబ్ ఔషధాలను కలిపి మోనోక్లోనల్ యాంటీబాడీస్ కాక్‌టెయిల్‌గా రూపొందించారు. కరోనా స్పైక్ ప్రొటీన్, దాని అటాచ్‌మెంట్ మానవ కణాల్లోకి ప్రవేశించకుండా ఈ మందు అడ్డుకుంటుంది. వివిధ వేరియంట్లపై ఇది సమర్థంగా పనిచేస్తోందని, పేషెంట్లు ఆస్పత్రి లో చేరాల్సిన పరిస్థితి తక్కువగా ఉందని, మరణాలు 70 శాతం వరకు తగ్గుతున్నాయని వైద్యులు తేల్చారు. కరోనా పాజిటివ్‌గా తేలగా నే ఈ మందు తీసుకోవాలి.
మూడో వేవ్ ముంగిట..
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ప్పుడు మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఇంజెక్షన్ తీసుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. తర్వాత అమెరికా, బ్రిటన్ తదితర దేశాల్లో విస్తృతంగా వినియోగంలోకి వచ్చింది. తాజాగా మన దేశంలో ఈ మందు అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతినిచ్చింది. కరోనా మూడో వేవ్ రావొచ్చన్న అంచ నాల నేపథ్యంలో.. కోవిడ్‌ను తొలిదశలోనే నియంత్రించే మందు అందుబాటులోకి రావడం మంచిదని వైద్యులు చెప్తున్నారు.
మోనోక్లోనల్ కాక్‌టెయిల్ డ్రగ్‌తో లాభం ఏమిటి?
నాగేశ్వర్‌రెడ్డి: కోవిడ్ సోకాక హైకోమార్బిడ్ కండిషన్ ఉన్న 65 ఏళ్లపై వయసువారు, స్థూలకాయులు, టైప్–2 డయాబెటీస్, కిడ్నీ వ్యాధులు, రోగనిరోధకశక్తి చాలా తక్కువగా ఉన్నవారు, దీర్ఘకాలిక తీవ్ర అనారోగ్య సమస్యలున్న పేషెంట్లలో 30 శాతం వరకు సీరియస్ అవుతున్నారు. మరణాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. అలాంటి వారిని ఈ ఇంజెక్షన్ ఆదుకుంటుంది. సీరియస్ కాకుండా కాపాడుతుంది. ఇది కోవిడ్ చికిత్సలో గేమ్ చేంజర్ అవుతుంది.
ఇంజెక్షన్ వేశాక ఫలితాలు ఎలా ఉన్నాయి?
అమెరికాలో ఈ మందు ఖరీదు చాలా ఎక్కువ. ఒక ఇంజెక్షన్ కు దాదాపు 20 వేల డాలర్లు అంటే.. మన కరెన్సీలో రూ.14 లక్షలు అవుతుంది. ధర ఎక్కువ, బీమాలో కవర్ కాకపోవడంతో అక్కడ ఎక్కువగా తీసుకోవడం లేదు. ఇండియాలో రూ.60 వేలకే ఇది అందుబాటులోకి వస్తోంది. మా ఆస్పత్రుల్లో సీరియస్ కండిషన్ ఉన్న 45 మందికి ఈ ఇంజెక్షన్ ఇచ్చాం. వారికి 24 గంటల్లోనే జ్వరం, ఒళ్లు నొప్పులు తగ్గాయి. దుష్ప్రభావాలు ఏమీ కనిపించలేదు. అందరికీ వారంలోనే కరోనా నెగెటివ్ వచ్చింది. సీరియస్ కేసులుగా మారడం లేదు.
కొత్త వేరియంట్లపై పనిచేస్తుందా?
బ్రిటన్ , దక్షిణాఫ్రికా, బ్రెజిల్ వేరియంట్లపై సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు ఇంతకుముందే తేలింది. భారత్‌లోని వేరియంట్ల విషయంగా పరిశోధన చేస్తున్నాం. ఇప్పటికైతే బాగా పనిచేస్తున్నట్టు గుర్తించాం. మరో రెండు వారాల్లో పూర్తి స్పష్టత వస్తుంది. ఆ తర్వాతే విస్తృతంగా వినియోగించే వీలుంటుంది.
ఎవరెవరు తీసుకోవాలి, ఏ జాగ్రత్తలు పాటించాలి?
మేం చాలా జాగ్రత్తగా, నిబంధనల మేరకు ఎవరికి అవసరమో వారికే ఇస్తున్నాం. స్వల్ప లక్షణాలుండగానే తీసుకుంటే త్వరగా తగ్గిపోతుంది కదా అని భావించొద్దు. స్టెరాయిడ్స్ మాదిరిగా దీనిని కూడా ఎక్కువగా ఉపయోగించేస్తే.. కొత్త వేరియంట్లు ఏర్పడి, సమస్య వస్తుంది. అందువల్ల అనవసరంగా తీసుకోవద్దు. ఎవరికి అవసరమనేది వైద్యులు నిర్ధారిస్తారు. ఆక్సిజన్ అవసరమైన పేషెంట్లు, ఐసీయూ, వెంటిలేటర్లపై ఉన్న వారికి ఇది ఉపయోగపడదు.
సరిపడా ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయా?
ఇప్పటిదాకా అమెరికాలో రోష్ కంపెనీ ఒక్కటే ఈ ఇంజక్షన్లను ఉత్పత్తి చేసింది. ఇటీవలే ఇలాయ్‌లిలీ కంపెనీకి కూడా అనుమతినిచ్చారు. మన దేశంలో జైడస్ కంపెనీకి అనుమతి లభించినట్టు చెప్తున్నారు. ఇండియన్ కంపెనీలు దీనిని తయారు చేస్తే పది పదిహేను వేలకే ఇంజెక్షన్ అందుబాటులోకి రావొచ్చు. ఒకవేళ మూడో వేవ్ వస్తే ఈ ఔషధంతో బాగా ప్రయోజనం ఉంటుంది.
కంట్రోల్ చేస్తుంది
కాక్‌టెయిల్ యాంటీబాడీస్ ఎందుకు?
కరోనా వైరస్ జతకట్టే స్పైక్ ప్రోటీన్‌కు ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ అతుక్కుని కలిసిపోతాయి. అయితే సింగిల్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఇస్తే కొన్నిసార్లు దానిని తట్టుకునే వేరియంట్లు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల వేలాది మోనోక్లోనల్ యాంటీబాడీస్‌ను తీసుకుని.. వైరస్ ప్రొటీన్‌కు అతుక్కోగలిన వాటిని ఎంపిక చేశారు. వీటిలో ఒకటి తప్పిపోయినా రెండోది జత కలిసేందుకు వీలుగా రెండింటినీ కలిపి కాక్‌టెయిల్‌గా తయారుచేశారు. కొన్ని రకాల వేరియంట్లపై ఇది సమర్థవంతగా పనిచేస్తున్నట్టు తేలింది.
సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తున్నాయా?
నిజానికి ఇది సైడ్ ఎఫెక్ట్స్ లేని మందు. వైరస్ సోకిన తొలిదశనే తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా ఇతర ప్రయోజనాలు లభిస్తాయి. మా ఆస్పత్రుల్లో వంద మంది దాకా ఈ మందు ఇచ్చాం. ఒకే ఒక్క పేషెంట్‌కు కాస్త జ్వరం వచ్చి తగ్గిపోయింది. మరో పేషెంట్‌కు సీటీ స్కాన్ లో కొంత ఇన్ఫెక్షన్ పెరిగినట్టు అనిపించినా త్వరగా రికవరీ అయ్యారు. ఈ ఇంజెక్షన్ ఇచ్చాక మళ్లీ హాస్పిటల్‌కు వచ్చిన వారెవరూ లేరు.
ఈ మందును వ్యాక్సిన్‌తో పోల్చవచ్చా?
ఈ కాక్‌టెయిల్ డ్రగ్ వ్యాక్సిన్ లా పనిచేస్తోందని ఒక పరిశోధనలో గుర్తించారు. ఒకే ఇంట్లో ఉంటున్న కుటుంబంలో.. ఒకరికి పాజిటివ్ రాగానే మిగతా వారికి ఈ మందు ఇచ్చి పరీక్షించారు. వారందరిలో యాంటీబాడీస్ ఏర్పడి కరోనా రాకుండా నియంత్రించినట్టు తేలింది. అంటే ముందస్తు జాగ్రత్తగా దీనిని వ్యాక్సిన్‌లా వాడొచ్చని వెల్లడైంది.
ఏ వయసు వారికి ఈ ఇంజెక్షన్ వేయొచ్చు?
పన్నెండేళ్ల వయసు పైబడిన అందరికీ (కనీస బరువు 40 కిలోలు ఆపై ఉండాలి) మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఇవ్వొచ్చు. పేషెంట్ల అవసరాన్ని బట్టి వైద్యులు నిర్ణయం తీసుకుంటారు. పిల్లల్లో టైప్–1 డయాబెటీస్, సికిల్‌సెల్, పుట్టుకతోనే గుండెజబ్బు, రోజూ మందులు వాడే దీర్ఘకాలిక ఊపిరితిత్తుల రోగులు తదితర తీవ్ర జబ్బులున్న వారికి కూడా కరోనా నివారణ కోసం ఈ ఇంజెక్షన్ ఇచ్చేందుకు అనుమతి ఉంది.
-యశోద ఆస్పత్రి చీఫ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ హరికిషన్ గోనుగుంట్ల
చదవండి: COVID Vaccine: వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా సోకిందా?
Comments
Please login to add a commentAdd a comment