వచ్చే నెల 1న కేరళను తాకనున్న రుతుపవనాలు
ఆరు రోజుల్లో తెలంగాణకు విస్తరించే అవకాశం
రాష్ట్రంలో ఈసారి సాధారణం కంటే ఎక్కువగానే వర్షపాతం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. గతేడాదితో పోలిస్తే ఈసారి రాష్ట్రంలో సంతృప్తికర వర్షాలు కురుస్తా యని తెలిపింది. జూన్ మొదటి వారంలోనే రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని పేర్కొంది. నైరుతి రుతుపవనాల సీజన్‌పై ప్రాథ మిక అంచనాలను వాతావరణ శాఖ విడుదల చేసింది. ‘సాధారణంగా మే నెల చివరి వారంలో దక్షిణ అండమాన్ సముద్రంలోకి నైరుతి రుతుప వనాలు ప్రవేశిస్తాయి.
ఆ తర్వాత రెండు వారాల్లో కేరళను తాకిన తర్వాత క్రమంగా ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందుతాయి. కానీ ఈ సీజన్‌లో కాస్త ముందుగానే దక్షిణ అండమాన్ సముద్రంలోని నైరుతి రుతుపవనాలు ప్రవేశించే పరిస్థితు లు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో జూన్ ఒకటో తేదీన కేరళను తాకుతాయి. అవి క్రమంగా వ్యాప్తి చెంది ఆరు రోజుల్లో తెలంగాణలోకి ప్రవే శిస్తాయి..’ అని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఎల్‌నినో బలహీనపడే అవకాశం
‘ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యన నైరుతి రుతుపవనాల సీజన్లో వర్షాలు ఆశాజనకంగా ఉంటాయి. గతేడాది కంటే కాస్త ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం భూమధ్యరేఖ పసిఫిక్ ప్రాంతంలో మధ్యస్థ ఎల్‌నినో పరిస్థితులు నెలకొని ఉన్నాయి. నైరుతి సీజన్ ప్రారంభంలో ఎల్‌నినో పరిస్థితులు బలహీనపడే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. దీంతో వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది.
రాష్ట్రంలో నైరుతి రుతు పవనాల సీజన్‌లో కురవాల్సిన సాధారణ వర్ష పాతం 72.21 సెంటీమీటర్లు. గత 2021, 2022 సీజన్లలో సాధారణం కంటే 40 శాతం అధిక వర్షాలు నమోదయ్యాయి. అయితే 2023 నుంచి ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం ఒక్కసారిగా తగ్గింది. గతేడాది వానాకాలం సీజన్‌లో సాధారణ వర్ష పాతం నమోదైనప్పటికీ కొన్ని ప్రాంతాల్లో తీవ్ర మైన డ్రైస్పెల్స్, కొన్ని ప్రాంతాల్లో కుండపోత వానలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే సాధారణ వర్షపాతం నమోదు కాగా.. జిల్లాల వారీగా పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది.
చాలా మండలాల్లోని అనేక ప్రాంతాల్లో లోటు వర్షపాతం నమోదయ్యింది. కాగా ఈసారి నైరుతి సీజన్ ప్రథ మార్థంలో ఎల్‌నినో ప్రభావం బలహీనపడి, సీజన్ ప్రారంభం నుంచే వర్షాలు కురుస్తాయని, రాష్ట్రంలో సీజన్ సాధారణ వర్షపాతం 72.21 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతమే నమోదు కావొచ్చని వివ రించింది. నైరుతి సీజన్‌లో 106 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
తేలికపాటి నుంచి మోస్తరు వర్షసూచన
పశ్చిమ విదర్భ, దాని పరిసర ప్రాంతాలలో ఏర్పడిన ఆవర్తనం బుధవారం తూర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది. ఇది సముద్ర మట్టం నుంచి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నట్లు తెలిపింది. రాష్ట్రానికి దక్షిణ, ఆగ్నేయ దిశ నుంచి బలమైన గాలులు వీస్తున్నట్లు సూచించింది.
రానున్న రెండ్రోజులు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రుంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉందని వివరించింది.
బుధవారం రాష్ట్రంలో చాలాచోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయి. ప్రధాన నగరాల్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. నల్లగొండలో 39.5 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత, మెదక్‌లో 21.5 డిగ్రీ సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment