సాక్షి, హైదరాబాద్: గుట్టలోని రాతిభాగంపై నల్లటి పట్టీలా రంగుతో గీసినట్టు కనిపిస్తున్నది ఈ ప్రకృతి ఆవిష్కృత ‘చిత్రం’. సాధారణ గ్రానైట్ మధ్యలో ఓ చారలా ఏర్పడింది ఈ డోలరైట్. దాన్ని మనం బ్లాక్ గ్రానైట్‌గా పేర్కొంటాం. కోట్ల సంవత్సరాల కాలక్రమంలో రాతి మధ్యలోంచి డోలరైట్ భాగం ఇలా చొచ్చుకొచ్చి ఓ గీతలా ఏర్పడింది. దీని జియోలాజికల్ శాస్త్రీయ నామం ‘డైక్’. ఈ డైక్ జనగామకు 20 కిలోమీటర్ల దూరంలో నర్మెట మండలం వెల్దండ గ్రామశివారులో వెలుగుచూసింది.
దీన్ని ఔత్సాహిక పరిశోధకుడు రత్నాకర్‌రెడ్డి ఇటీవల గుర్తించారు. స్థానిక గుళ్ల చెరువు సమీపంలోని రాజన్నగుడిగా పేర్కొనే శిథిల త్రికూటాలయం వెనక వైపు ఈ డైక్ కనిపిస్తోంది. ఆలయంలోని రాజరాజేశ్వరస్వామి వేములవాడకు తరలివెళ్తున్న సమయంలో రథం వల్ల ఈ గుర్తు ఏర్పడిందని ఓ కథనం ప్రచారంలో ఉంది. కానీ, దీనిని జియోలాజికల్ వండర్‌గా నిపుణులు పేర్కొంటున్నారు. శిలాద్రవం (మాగ్మా) ఉబికి వచ్చి ఇలా గట్టిపడటంతో డైక్ ఏర్పడిందని జీఎస్‌ఐ విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ చకిలం వేణుగోపాలరావు, కాకతీయ విశ్వవిద్యాల యం జియోలజీ విభాగానికి చెందిన మల్లికార్జునరెడ్డి, ద్రవిడ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యుడు హర్షవర్ధన్ పేర్కొన్నట్టు రత్నాకర్‌రెడ్డి వివరించారు.
కిలోమీటర్ల పొడవు మేర..
ఈ డైక్ భూమి అంతర్భాగంలో కొంతభాగం, మళ్లీ ఉపరితలంలో కొన్ని కిలోమీటర్ల మేర విస్తరించి ఉందని రత్నాకర్‌రెడ్డి తెలిపారు. గుట్టభాగంలో బలహీనంగా ఉన్న చోటును ఈ మాగ్మాలు ఆక్రమిస్తుంటాయి. బలహీన భాగాన్ని ఒత్తిడితో ఛేదిస్తూ ఏళ్ల కాలక్రమంలో మాగ్మా పైకి ఉబికి వస్తుంది. అలా దాదాపు 250 నుంచి 280 కోట్ల సంవత్సరాల క్రితం వెల్దండలో ఈ డైక్ ఏర్పడి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ నల్లరాతి డోలరైట్‌నే ఇక్కడ కృష్ణశిలలుగా పేర్కొంటూ వాటిని శిల్పాలు చెక్కేందుకు ఎక్కువగా వినియోగిస్తూ వచ్చారు. ఇటీవల యునెస్కో ప్రపంచ వారసత్వ నిర్మాణంగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంలోని నాగిని శిల్పాలను ఈ రాతితోనే చెక్కారు.
Comments
Please login to add a commentAdd a comment