
మహమ్మారి కరోనా తల్లికి సోకింది. కానీ కడుపులో ఉన్న బిడ్డను తాకలేదు. ప్రసవించిన తల్లిని ఐసోలేషన్ వార్డుకు తరలించారు.
కోల్‌సిటీ (రామగుండం): కరోనా సోకిన ఓ నిండు గర్భిణికి పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు గురువారం ఆపరేషన్ చేసి పండంటి ఆడ శిశువుకు పురుడు పోశారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం నర్మ గ్రామానికి చెందిన ఓ మహిళ గర్భం దాల్చింది. గోదావరిఖనిలోనే ఉంటున్న ఆమె భర్త ప్రతినెలా ఏరియా ఆస్పత్రిలో పరీక్షలు చేయిస్తున్నారు. నెలలు నిండడడంతో బుధవారం ఆస్పత్రికి రాగా.. ఉమ్మనీరు తక్కువగా ఉందని, వెంటనే ఆపరేషన్ చేయాలని, దీనికి ముందుగా కరోనా టెస్ట్ చేయాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారు.
కరోనా టెస్టులో ఆమెకు పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమెకు గురువారం కోవిడ్ నిబంధనల ప్రకారం గైనకాలజిస్ట్ డాక్టర్ కల్యాణి, అనస్థీషియా డాక్టర్ అగర్‌బాబా పీపీఈ కిట్ ధరించి ఆపరేషన్ చేశారు. పుట్టిన ఆడశిశువుకూ కరోనా టెస్ట్ చేయగా.. నెగెటివ్ వచ్చింది. బాలింతను కోవిడ్ ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్యులు కళ్యాణి, అగర్‌బాబా, స్టాఫ్‌నర్సులు భవాని, లీలా, సిబ్బంది ఆశిష్, ఓదెలును ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్‌ఎంఓ భీష్మ, కోవిడ్ ఐసోలేషన్ వార్డు ఇన్‌చార్జి రాజశేఖర్‌రెడ్డి, జనరల్ ఫిజీషియన్ రాజేంద్రప్రసాద్ తదితరులు అభినందించారు.
చదవండి: 8 మంది భర్తలను మోసగించి.. తొమ్మిదో పెళ్లికి రెడీ
చదవండి: పెళ్లి సంబంధాలు రాక.. ఒంటరిగా ఉండలేక యువతి