డోర్నకల్/వరంగల్: ప్రభుత్వ నర్సరీ ఏర్పాటు కోసం ఖబ్రస్థాన్‌ను ఆక్రమించారని ఆరోపిస్తూ డోర్నకల్ మండలం అమ్మపాలెం గ్రామానికి చెందిన పలువురు ముస్లింలు మానుకోట జిల్లా కలెక్టర్ గౌతమ్ వాహనాన్ని అడ్డగించారు. వివరాలిలా ఉన్నాయి. అమ్మపాలెంలో ఏర్పాటు చేసిన నర్సరీని కలెక్టర్ బుధవారం పరిశీలించేందుకు వచ్చారు. పరిశీలన అనంతరం అక్కడి నుంచి వెళ్తుండగా ఎస్‌కె మునీర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కలెక్టర్ వాహనాన్ని అడ్డగించారు.
21 సంవత్సరాల క్రితం సర్వే నంబర్ 571లోని 1.20 ఎకరాల బంచరాయి భూమిని ఖబ్రస్థాన్ కోసం కేటాయించారని మునీర్ తదితరులు తెలిపారు. ఆ స్థలంలో 20 మంది ముస్లింల సమాదులు ఉండగా.. ఇటీవల నర్సరీ ఏర్పాటు కోసం వాటిని తొలగించి ఆక్రమించారని ఆరోపించారు. కలెక్టర్ స్పందించి ఖబ్రస్థాన్ స్థలాన్ని వెంటనే తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. స్పందించిన కలెక్టర్ విచారణ జరిపి నివేదిక సమర్పించాలని తహసీల్దార్‌ను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment