ఇక్కడ చూస్తున్నవారంత సినిమా టికెట్‌ల కోసం లైన్ లో ఉన్నవారు కాదు..ప్రభుత్వ పరిహారం కోసం క్యూ కట్టిన వారు కాదు..వారు పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి టోకెన్‌లు తీసుకోవడం కోసం బారులు తీరిన రైతులు..సూర్యాపేట జిల్లా పాలకీడు మండల వ్యవసాయ కార్యాలయం ముందు తెల్లవారుజాము నుంచే వందలాది రైతులు టోకెన్‌ల కోసం ఇలా క్యూ లైన్ కట్టారు
సాక్షి, మిర్యాలగూడ : ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో సన్నధాన్యం సాగు రైతుల కొంప ముంచింది. ఒకవైపు దిగుబడి తగ్గి, మరోవైపు మద్దతు ధర లభించక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం టోకెన్ విధానం అమలు చేస్తుండడంతో వరి కోయడానికి కూడా టోకెన్ల తీసుకుని వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో టోకెన్ల కోసం రోజూ రైతులు తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల వద్ద బారులుదీరుతున్నారు. కష్టనష్టాల కోర్చి పంట పండించి చేయాలని వ్యవసాయాధికారులు సూచించారు. దాంతో ఈ ప్రాంతంలో 90 శాతం రైతులు సన్నధాన్యం రకాలైన పూజ, పూజా గోల్డ్, హెచ్‌ఎంటీ, జైశ్రీరామ్ సాగుచేశారు. కాగా రైతులు సాగు చేసిన సన్నధాన్యాన్ని ప్రభుత్వ ఐకేపీ కేంద్రాల్లో కొనుగోలు చేయడం లేదు. దాంతో రైతులు మిల్లుల వద్ద విక్రయించుకునే పరిస్థితి వచ్చింది. చదవండి: గిన్నిస్ రికార్డ్ సాధించిన ఉత్తరాఖండ్ రైతు
లభించని మద్దతు ధర..
ఈ ఏడాది అధిక వర్షాల వల్ల సన్న రకాలకు అధికంగా తెగుళ్లు సోకాయి. దాంతో పెట్టుబడి పెరిగింది. అంతే కాకుండా వరి కోసే ముందు కూడా వర్షాల వల్ల పంటలకు నష్టం వాటిల్లింది. దాంతో పంట దిగుబడి భారీగా తగ్గింది. సాధారణంగా సన్నరకం వరి సాగుకు ఎకరానికి 30 బస్తాల నుంచి 40 బస్తాల వరకు ధాన్యం దిగుబడి రావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం 25 బస్తాలే వస్తోంది. ఈ ధాన్యానికి మద్దతు ధర లభించే పరిస్థితులు లేవు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రేడ్ –1 రకం ధాన్యానికి క్వింటాకు రూ.1,888 చెల్లించాల్సి ఉండగా మిల్లర్లు క్వింటాకు రూ.1,600 నుంచి రూ.1,750 వరకే చెల్లిస్తున్నారు. దాంతో ఈ ఏడాది సన్నరకం సాగు చేసిన రైతులకు నష్టాలే మిగిలాయి. దొడ్డు రకం ధాన్యం సాగు చేస్తే ఐకేపీ కేంద్రాల్లో మద్దతు ధర క్వింటాకు రూ.1,888 లభించడంతో పాటు దిగుబడి కూడా ఎకరానికి 30 బస్తాలు వచ్చింది. అయితే ప్రభుత్వ నిర్ణయంతో రైతులకు ఈ ఏడాది నష్టం వాటిల్లింది.
టోకెన్ల కోసం పడిగాపులు..
సన్నరకం ధాన్యం విక్రయించుకోవడానికి అధికారులు జారీ చేస్తున్న టోకెన్ల కోసం రైతులు ఆయా మండల కార్యాలయాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది. టోకెన్ తీసుకున్న తర్వాతనే వరి కోసి మిల్లుకు ధాన్యం తీసుకురావాలని నిబంధనలు ఉన్నందున రైతులు తహసీల్దార్ కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఈ నెల 10వ తేదీన 11, 12, 13వ తేదీలకు సంబంధించిన టోకెన్లు జారీ చేయడంతో గురువారం టోకెన్లు జారీ చేయడం లేదని మిర్యాలగూడ తహసీల్దార్ కార్యాలయం వద్ద అధికారులు బోర్డు ఏర్పాటు చేశారు. అయినా రైతులు కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఈ నేపథ్యంలో టోకెన్ల కోసం రైతులు గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడంతో పాటు ఖమ్మం రోడ్డుపై రాస్తారోకో చేశారు. ఉదయం 9 గంటలకే తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న రైతులు టోకెన్లు జారీ చేయాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో చేశారు. కాగా పోలీసులు రైతులకు నచ్చచెప్పి రాస్తారోకో విరమింపజేశారు.
రైతుల రాస్తారోకో
వేములపల్లి : ధాన్యాన్ని మిల్లుల్లో అమ్ముకునేందుకు అధికారులు టోకెన్లు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ఆగ్రహించిన రైతులు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట గల నార్కట్‌పల్లి– అద్దంకి రహదారిపై గురువారం రాస్తారోకో నిర్వహించారు. గురువారం ఉదయం టోకెన్లు పొందేందుకు రైతులు ఎంపీడీఓ కార్యాలయం పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అయితే అధికారులు మాత్రం టోకెన్లను 13వ తేదీ వరకు జారీ చేసేది లేదని చెప్పడంతో ఆగ్రహించిన రైతులు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఇప్పటికే అకాల వర్షాలకుతోడు తెగుళ్లు సోకి పంట నష్టపోయామన్నారు. పండిన కొద్దోగొప్పో ధాన్యాన్ని అమ్ముకునేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నామని ఆవేద వ్యక్తం చేశారు. మిర్యాలగూడ సమీపంలో మార్కెట్‌యార్డు ఉన్నప్పటికీ సన్నరకం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ప్రభుత్వ మద్దతు ధర పొందలేక తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. ధాన్యం అమ్ముకునేందుకు ఇబ్బందులు తలెత్తకుండా టోకెన్లు ఇస్తామన్న అధికారులు ఒక్కరోజు మాత్రమే 150వరకు జారీ చేశారని.. ఇప్పుడు మిల్లర్ల ఒత్తిడికి తలొగ్గి రోజుకు 50 టోకెన్లను మాత్రమే ఇస్తామనడం వారి అసమర్థతకు నిదర్శనమన్నారు. రైతులు రాస్తారోకో చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సుధీర్‌కుమార్ అక్కడికి చేరుకుని రైతులకు టోకెన్లు అందేలా చేస్తానని చెప్పడంతో ఆందోళన విరమించారు.
బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా..
రైతులు ధాన్యాన్ని మిల్లుల్లో అమ్ముకునేందుకుగాను అవసరమైన మేర టోకెన్లు అందించాలని కోరుతూ స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఎదుట గురువారం బీజేపీ మండల అధ్యక్షుడు చిర్ర సాంబమూర్తి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం ఏఓ రుషేంద్రమణికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు జవ్వాజి సత్యనారాయణ, దామోదర్‌రెడ్డి, పెదమాం వెంకన్న, సోమయ్య, సందీప్, భరత్, నవీన్‌రెడ్డి, రవి, హరికృష్ణ, ఏర్పుల వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.
టోకెన్ల కోసం రైతులు తొందరపడొద్దు : కలెక్టర్
నల్లగొండ : సన్నరకం ధాన్యం అమ్ముకునే విషయంలో టోకెన్ల కోసం రైతులు తొందరపడొద్దని ప్రతి రైతుకూ టోకెన్లు అందజేస్తామని కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. టోకెన్ల జారీకి పరిమితి లేదని, వచ్చే రెండు నెలల వరకు రైతులకు వెసులుబాటు కల్పిస్తామని పేర్కొన్నారు. మిర్యాలగూడలో మిల్లుల సామర్థ్యాన్ని బట్టి రోజూ టోకెన్లు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. అందరికీ ఒకేసారి టోకె న్లు ఇవ్వడం సాధ్యంకాదని, టోకెన్ పొందాక రైతులు వరి కోసి ధాన్యం మిల్లుకు తరలించాలని సూచించారు. రైతులు తొందరపడి రావడం వల్ల రద్దీ పెరిగి ఇబ్బందులు తలెత్తుతాయని తెలిపారు. మూడు నాలుగు రోజుల్లో సమస్య తీరుతుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment