దంపతులను బయటకు తీసుకొస్తున్న ఎన్‌డీఆర్‌ఎఫ్ సభ్యులు
అచ్చంపేట రూరల్: డిండి వాగు ఉధృతితో అవతలి ఒడ్డున 12 గంటల పాటు అలాగే ఉండిపోయిన గిరిజన రైతు దంపతులు సబావత్ బుజ్జి, వెంకట్‌రాం ఎట్టకేలకు సురక్షితంగా బయటపడ్డారు. వీరిని గురువారం తెల్లవారుజామున ప్రాణాలకు తెగించి నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ (ఎన్‌డీఆర్‌ఎఫ్) సభ్యులు కాపాడారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం సిద్ధాపూర్ సమీపంలోని ఈ వాగుకు అవతలి వైపు ఎత్తు ప్రాంతంలో బిక్కుబిక్కుమంటున్న దంపతులను చిమ్మచీకట్లో వారు సురక్షిత ప్రాంతానికి చేర్చారు. సిద్ధాపూర్‌కు ఎన్‌డీఆర్‌ఎఫ్ టీం సభ్యులు బుధవారం రాత్రి పది గంటలకు జనరేటర్ సాయంతో సిగ్నల్ లైట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. అర్ధరాత్రి 12 గంటలకు తమ వెంట తెచ్చుకున్న పరికరాలతో పడవను తయారు చేసుకుని వరద నీటిలోకి నలుగురు వెళ్లారు. ఉధృతి ఎక్కువగా ఉండటంతో వెనకకు తిరిగి వచ్చారు. కొద్దిసేపటికి మరోసారి అతి కష్టం మీద అవతలి ఒడ్డుకు చేరుకుని అక్కడే ఉన్న దంపతులకు ధైర్యం చెప్పారు. ఒంటి గంట తర్వాత పడవలో వారిని ఇవతలి ఒడ్డుకు తీసుకొచ్చారు. కాగా, తాము అర్ధరాత్రి వరకు నరకయాతనను అనుభవించామని దంపతులు తెలిపారు. ఆపదలో ఉన్న తమను కాపాడటానికి కృషి చేసిన ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment