ndrf group
-
రైతు దంపతులు సురక్షితం
అచ్చంపేట రూరల్: డిండి వాగు ఉధృతితో అవతలి ఒడ్డున 12 గంటల పాటు అలాగే ఉండిపోయిన గిరిజన రైతు దంపతులు సబావత్ బుజ్జి, వెంకట్రాం ఎట్టకేలకు సురక్షితంగా బయటపడ్డారు. వీరిని గురువారం తెల్లవారుజామున ప్రాణాలకు తెగించి నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) సభ్యులు కాపాడారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం సిద్ధాపూర్ సమీపంలోని ఈ వాగుకు అవతలి వైపు ఎత్తు ప్రాంతంలో బిక్కుబిక్కుమంటున్న దంపతులను చిమ్మచీకట్లో వారు సురక్షిత ప్రాంతానికి చేర్చారు. సిద్ధాపూర్‌కు ఎన్డీఆర్ఎఫ్ టీం సభ్యులు బుధవారం రాత్రి పది గంటలకు జనరేటర్ సాయంతో సిగ్నల్ లైట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. అర్ధరాత్రి 12 గంటలకు తమ వెంట తెచ్చుకున్న పరికరాలతో పడవను తయారు చేసుకుని వరద నీటిలోకి నలుగురు వెళ్లారు. ఉధృతి ఎక్కువగా ఉండటంతో వెనకకు తిరిగి వచ్చారు. కొద్దిసేపటికి మరోసారి అతి కష్టం మీద అవతలి ఒడ్డుకు చేరుకుని అక్కడే ఉన్న దంపతులకు ధైర్యం చెప్పారు. ఒంటి గంట తర్వాత పడవలో వారిని ఇవతలి ఒడ్డుకు తీసుకొచ్చారు. కాగా, తాము అర్ధరాత్రి వరకు నరకయాతనను అనుభవించామని దంపతులు తెలిపారు. ఆపదలో ఉన్న తమను కాపాడటానికి కృషి చేసిన ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు కృతజ్ఞతలు తెలిపారు. -
గోదారమ్మ ఒడిలోనే వంశీ...
నిలిచిన గాలింపు చర్యలు వెనుదిరిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందం జలసమాధిగా భావిస్తున్న అధికారులు పుట్టెడు దుఃఖంలో కుటుంబసభ్యులు కాళేశ్వరం : ఆరు రోజులుగా పుట్టెడు దుఃఖంతో వంశీ కుటుంబసభ్యులు ఆఖరిచూపు కోసం ఎదురు చూస్తున్నారు. తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయూరు. పడవ ప్రమాదంలో కాటారం మండలం ఆదివారంపేట గ్రామానికి చెందిన బుర్రి వంశీ(11) జలసమాధి అయినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ నెల 21న మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచా తాలూకాలోని చింతలపల్లి నుంచి మహదేవపూర్ మండలం మెట్పల్లి వద్ద గోదావరి, ప్రాణహితనదులపై వంతెన వద్ద పడవ బోల్తా పడడంతో వంశీ గల్లంతైన విషయం తెలిసిందే. ఈప్రమాదంలో 24 మంది ప్రాణాలు కాపాడుకోగలిగారు. వంశీ కోసం ఆరు రోజులుగా తెలంగాణ, మహారాష్ట్ర పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సభ్యులు, రెవెన్యూ అధికారులు, వంతెన కాంట్రాక్టర్లు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టినా చివరికి నిరాశే మిగిలింది. శుక్రవారం ఎన్డీఆర్ఎఫ్ టీం తిరుగు ప్రయాణమయ్యారు. పోలీసులు కూడా ఆరు రోజులుగా వెతికి వంశీ ఆచూకీ తెలియకపోవడంతో నిరాశకు లోనవుతున్నారు. వంశీతో నీటిలో మునిగిన మూడు బైకులు అతికష్టం మీద లభ్యమయ్యాయి. సుమారు 2 మీటర్ల లోతులో ఇసుక కప్పేసి ఉంది. పొక్లెరుున్ల సాయంతో తాత్కాలిక వంతెనలకు ఇరువైపుల తవ్వి గాలింపు చర్యలు చేశారు. ఇదే ప్రమాదానికి గురైన వంశీ సోదరి సౌజన్య హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పరిస్థితి నిలకడ ఉన్నట్లు వైద్యులు తెలిపినట్లు బంధువులు పేర్కొంటున్నారు. వంశీ ఆచూకీ కోసం ఎదురు చూసిన తండ్రి మొగిళి, సోదరుడు అనిల్, బాబాయ్ రాజేశ్ కన్నీరుమున్నీరవుతున్నారు. మనసులో ఏదో ఒక చోట వంశీ వస్తాడనే చిన్న ఆశతో ఆరు రోజులుగా ఎదురుచూస్తున్నారు. చివరికి వారుకూడా వెనుదిరిగిపోతున్నారు. పోలీసులు మళ్లీ గాలింపును పొడి గిస్తామని చెబుతున్నారు. ఆరురోజులుగా సిరొంచా డీఎస్పీ శివాజీ పవార్, సీఐ లుకుడే,తహశీల్దార్ సతీష్‌కుమార్, ఎస్సై కృష్ణారెడ్డి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వీరితోపాటు ఎన్డీఆర్ఎఫ్ టీం 18మంది సభ్యులు తీవ్రంగా గాలించినా ఫలితం లేకపోయింది. అందరూ వెళ్లిపోవడంతో గోదావరి వంతెన ప్రాంతం నిర్మానుష్య వాతావరణ కనిపించింది. -
రుద్రుడి మాయేమో..!
ప్రాణాలతో బయటపడ్డ తల్లీబిడ్డలు ముంబై, న్యూస్‌లైన్: ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన భీమశంకరుడి పేరు పెట్టుకున్నందుకేనేమో.. ఊరు సమాధి అయినా ఆ శిథిలాల నుంచి మూడునెలల రుద్రుడనే చిన్నారి బాలుడు తల్లి ప్రమీలతోసహా ప్రాణాలతో బయటపడ్డాడు. శిథిలాల కిందే 30 గంటలు గడిపిన తల్లీబిడ్డలను ఎన్డీఆర్ఎఫ్ బృందం గురువారం బయటకు తీసింది. దీంతో ఇప్పటిదాకా ప్రాణాలతో బయటపడినవారి సంఖ్య 8కి చేరింది. అప్పటిదాకా బయటే ఉన్న తల్లి.. బిడ్డ ఏడ్వడంతో పాలిద్దామని ఇంట్లోకి వెళ్లిందని, అంతలోనే కొండచరియలు విరిగిపడి ఆ ఇంటిని కప్పేశాయని, అయితే ఇంట్లోని ఓ గదిలో ఉన్న తల్లీబిడ్డకు మాత్రం ఎటువంటి హాని కలగలేదని, దాదాపు 30 గంటలు శిథిలాల కింద ఉన్న కారణంగా నీరసించిపోయిందని అక్కడివారు తెలిపారు. తల్లీబిడ్డలిద్దరిని వైద్యం కోసం సమీపంలోని ఆస్పత్రికి పంపించారని తెలిపారు.