సాక్షి, హైదరాబాద్: మనలో ఒకరికి పిజ్జా ఇష్టం.. మరొకరికి సమోసా ఇష్టం.. ఇంకొకరికి బిరియానీ అంటే ప్రాణం.. ఒక్కొక్కరిదీ ఒక్కో టేస్ట్.. మరి జంతువుల టేస్ట్ ఏంటో మీకు తెలుసా? మన నెహ్రూ జంతు ప్రదర్శనశాలలోనే బోలెడన్ని జంతువులు ఉంటాయి కదా.. వాటి ఇష్టాయిష్టాలు ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు ఆలోచిద్దాం.. వాటి టేస్ట్‌లు ఏమిటో తెలుసుకుందాం? రోజూ ఏం తింటున్నాయో చూసి వద్దాం.. సో చలో జూ...
అక్కడా, ఇక్కడా.. ఇలా తేడా!
అడవుల్లో స్వేచ్ఛగా పెరిగే జంతువులు, పక్షులకు, ఇక్కడి వాటికి తేడా ఉంటుంది. అక్కడ వాటికి సహజసిద్ధమైన ఆహారం దొరుకుతుంది. అయితే అక్కడ వయస్సు పెరిగి ఒంట్లో సత్తువ తగ్గినప్పుడు ఆకలితో చచ్చిపోతుంటాయి. కానీ, ఇక్కడ బలవర్ధకమైన ఆహారం, అవసరం అయినప్పుడు మందులు ఇవ్వడం వల్ల బయటి జంతువుల కంటే ఎక్కువ కాలం జీవిస్తాయి.
కొన్ని డైలీ.. మరికొన్ని వీక్లీ..
కొన్ని జంతువులు ఉదయం నుంచి సాయంత్రం వరకు తింటూనే ఉంటాయి. మరికొన్ని ఒక పూట మాత్రమే తింటాయి. ఇక సరీసృపాలు వారానికి ఒక్కసారి మాత్రమే తింటాయి. నిద్ర కూడా ఒక్కో వన్యప్రాణిది ఒక్కో స్టైల్. కొన్ని రాత్రి మెలకువతో ఉంటాయి. పొద్దంతా నిద్రపోతాయి. ఆయా ప్రాణుల ఆహార అవసరాలు, జీవనశైలికి అనుగుణంగా జూ పార్క్ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. వన్యప్రాణుల ఆహారం కోసం ప్రత్యేక ప్లాట్‌ఫామ్‌లు ఏర్పాటు చేశారు.
పులులు, సింహాలు ఇలా..
పులులు, సింహాలకు ప్రతిరోజు ఏడు కిలోల నుంచి 12 కిలోల వరకు పశువు మాంసం, కాలేయం ఇస్తారు. పులులు, సింహాలు పసందుగా కాలేయం తింటాయి. పశువుల కిడ్నీలు, బ్రెయిన్ కూడా ఇస్తారు. ఇంతేకాదు మరిగించిన అర లీటర్ పాలు కూడా ఇస్తారు. చిరుతకు మూడు కిలోల పశువుల మాంసం, అరలీటరు పాలు ఇస్తారు. రోజుకు ఒకే పరిమాణంలో కాకుండా ఆహారం పెంచుతూ, తగ్గిస్తూ ఉంటారు.
ఎలుగుబంటి
జూ పార్కులో హిమాలయన్ బ్లాక్, స్లాత్ బేర్ ఎలుగుబంట్లు ఉన్నాయి. వీటికి రకరకాల పండ్లు, చెరకు ముక్కలు, రెండు వందల గ్రాముల తేనె, రెండు కిలోల మైదా జావా, రెండు కిలోల రొట్టెలు, లీటర్ పాలు ఇస్తారు.
నీటి ఏనుగు
ఒక్కో నీటి ఏనుగుకు 150 కిలోలకుపైగా రోజువారీ ఆహారం ఇవ్వాల్సి ఉంటుంది. 70 కిలోల పచ్చగడ్డి, పశుదాణా 20 కిలోలతోపాటు రకరకాల కూరగాయలను ఆహారంగా ఇస్తారు. దీనికి 3 పూటలా ఆహారం ఇస్తారు.
పక్షి జాతులకు
పక్షులకు ఇచ్చే ఆహారం పరిమాణం తక్కువగానే ఉంటుంది. విదేశీ పక్షులైన పెలికాన్ పక్షులకు రోజుకు కిలో చేపలు ఇస్తారు. చాలా రకాల పక్షులకు రోజుకు 50 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు పప్పులు, గింజలు, ధాన్యాలు ఇస్తారు.
ఏనుగులు
అన్ని జంతువుల్లోకెల్లా భారీగా ఆహారం తినే జంతువు ఏనుగు. దీనికి రోజుకు 250 కిలోలకు తక్కువ కాకుండా ఆహారం అందించాల్సి ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు తింటూనే ఉంటుంది. ప్రతిరోజు 150 కిలోల పచ్చగడ్డి, 50 కిలోల పశుదాణా, రాగి జావ, బెల్లం, ఉప్పు, అరటిపళ్ళు, 50 కిలోల చెరకు, కొబ్బరి ఆకులు అందించాల్సి ఉంటుంది.
తాబేలు
తాబేళ్ల ఆహారం తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే. సుమారు 300 ఏళ్ల సుదీర్ఘ జీవితం గడిపే తాబేళ్లు రోజువారీ ఆహారం కేవలం 250 గ్రాములే. క్యాబేజి, క్యారెట్, పాలకూర వంటివి అన్నీ కలుపుకొని కేవలం 250 గ్రాములు మాత్రమే తింటాయి. ఇక నీటి తాబేలు రోజూ 200 గ్రాముల చేపను మాత్రమే తింటుంది.
ఇతర జంతువులకు..
- తోడేలుకు రెండు కిలోలపశువుల మాంసం ఇవ్వాల్సి ఉంటుంది.
- నక్కకు కిలో పశువు మాంసం మొసలికి 5 కిలోల చొప్పున పశువు మాంసంతోపాటు పుచ్చకాయలు, పండ్లు, చేపలు ఇస్తారు.
- దుప్పులు, ఇతర జింక జాతులకు కిలో పశుదాణాతోపాటు పచ్చగడ్డి అవసరాన్ని బట్టి, రెండు కట్టెల తోటకూర, పావుకిలో క్యారెట్, 100 గ్రాముల క్యాబేజీ, కొద్ది మోతాదులో కీరదోస, గుమ్మడి వంటివి పెడతారు.
- కొండచిలువకు వారానికి ఒక కోడి, ఒక ఎలుక సరిపోతుంది.
- ఇతర పాములకు వారానికి ఆరు నుంచి ఎనిమిది కప్పలు, ఒకటి లేదా రెండు ఎలుకలు ఒక ఆహారంగా ఇస్తారు.
- బర్డ్‌ఫ్లూ నివారణ చర్యల్లో భాగంగా జూలో చికెన్ వినియోగించడం లేదు. దీంతోపాటు పక్షులు సంచరించే ప్రాంతంలో అధికారులు నిఘా పెంచారు.
Comments
Please login to add a commentAdd a comment