Menu chart
-
ఆ రెస్టారంట్ మె‘న్యూ’ చూస్తే కన్ఫ్యూజ్ అవ్వాల్సిందే..
కరోనాతో తీవ్రంగా దెబ్బతిన్న హోటళ్లు, రెస్టారెంట్లు, కేఫ్‌లు ఈ మధ్యనే కాస్త పుంజుకుంటున్నాయి. ఈ సమయంలో కస్టమర్లను ఆకర్షించేందుకు కొన్ని రెస్టారెంట్లు వివిధ రకాల ఆఫర్లను ప్రకటిస్తు్తంటే..ఫుణేలోని ఓ రెస్టారెంట్ వింత మెనూతో ముందుకొచ్చింది. సాధారణంగా మెనూలో ఆహార పదార్థాల లిస్టు ఉంటుంది. కానీ ఈ రెస్టారెంట్.. మెనూలో ‘డూస్ అండ్ డోంట్స్’ అంటూ విచిత్ర జాబితా పెట్టి కస్టమర్లను కన్ఫ్యూజ్ చేస్తోంది. విచిత్రంగా వ్యవహరిస్తున్న ఈ రెస్టారెంట్ పేరు ‘ఇరానీ కేఫ్’. ఈ కేఫ్‌లో ఎంతో రుచికరమైన తినుబండారాలు తక్కువ ధరకే దొరుకుతాయి. అయితే రెస్టారెంట్ ఫుడ్ మెనూలో రెండు డజన్ల వింత నిబంధనలను చేర్చింది యాజమాన్యం. రెస్టారెంట్‌కు వెళ్లినవారు, రెస్టారెంట్ పరిసరాల్లో ఉన్న వారంతా తప్పనిసరిగా ఈ రూల్స్ పాటించాల్సిందేన ట. నిబంధనల్లో ‘‘నో స్మోకింగ్, నో అవుట్ సైడ్ ఫుడ్, నో బార్గెయినింగ్, నో బ్రషింగ్ టీత్, నో స్లీపింగ్, నో కోంబింగ్, నో ఫ్రీ అడ్వైస్, గాంబ్లింగ్ గురించి చర్చించకూడదు, చిల్లర అడగడం వంటివాటిని రెస్టారెంట్లో అనుమతించరు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరికి ఈ నిబంధనలు నచ్చుతుంటే మరికొందరికి ఊపిరి కూడా పీల్చుకోవద్దు అంటారా ? అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు ఈ రెస్టారెంట్‌కు ఒక్కసారైనా వెళ్లాల్సిందేనని చెబుతున్నారు. -
వినూ... ఇది మా మెనూ
సాక్షి, హైదరాబాద్: మనలో ఒకరికి పిజ్జా ఇష్టం.. మరొకరికి సమోసా ఇష్టం.. ఇంకొకరికి బిరియానీ అంటే ప్రాణం.. ఒక్కొక్కరిదీ ఒక్కో టేస్ట్.. మరి జంతువుల టేస్ట్ ఏంటో మీకు తెలుసా? మన నెహ్రూ జంతు ప్రదర్శనశాలలోనే బోలెడన్ని జంతువులు ఉంటాయి కదా.. వాటి ఇష్టాయిష్టాలు ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు ఆలోచిద్దాం.. వాటి టేస్ట్లు ఏమిటో తెలుసుకుందాం? రోజూ ఏం తింటున్నాయో చూసి వద్దాం.. సో చలో జూ... అక్కడా, ఇక్కడా.. ఇలా తేడా! అడవుల్లో స్వేచ్ఛగా పెరిగే జంతువులు, పక్షులకు, ఇక్కడి వాటికి తేడా ఉంటుంది. అక్కడ వాటికి సహజసిద్ధమైన ఆహారం దొరుకుతుంది. అయితే అక్కడ వయస్సు పెరిగి ఒంట్లో సత్తువ తగ్గినప్పుడు ఆకలితో చచ్చిపోతుంటాయి. కానీ, ఇక్కడ బలవర్ధకమైన ఆహారం, అవసరం అయినప్పుడు మందులు ఇవ్వడం వల్ల బయటి జంతువుల కంటే ఎక్కువ కాలం జీవిస్తాయి. కొన్ని డైలీ.. మరికొన్ని వీక్లీ.. కొన్ని జంతువులు ఉదయం నుంచి సాయంత్రం వరకు తింటూనే ఉంటాయి. మరికొన్ని ఒక పూట మాత్రమే తింటాయి. ఇక సరీసృపాలు వారానికి ఒక్కసారి మాత్రమే తింటాయి. నిద్ర కూడా ఒక్కో వన్యప్రాణిది ఒక్కో స్టైల్. కొన్ని రాత్రి మెలకువతో ఉంటాయి. పొద్దంతా నిద్రపోతాయి. ఆయా ప్రాణుల ఆహార అవసరాలు, జీవనశైలికి అనుగుణంగా జూ పార్క్ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. వన్యప్రాణుల ఆహారం కోసం ప్రత్యేక ప్లాట్‌ఫామ్‌లు ఏర్పాటు చేశారు. పులులు, సింహాలు ఇలా.. పులులు, సింహాలకు ప్రతిరోజు ఏడు కిలోల నుంచి 12 కిలోల వరకు పశువు మాంసం, కాలేయం ఇస్తారు. పులులు, సింహాలు పసందుగా కాలేయం తింటాయి. పశువుల కిడ్నీలు, బ్రెయిన్ కూడా ఇస్తారు. ఇంతేకాదు మరిగించిన అర లీటర్ పాలు కూడా ఇస్తారు. చిరుతకు మూడు కిలోల పశువుల మాంసం, అరలీటరు పాలు ఇస్తారు. రోజుకు ఒకే పరిమాణంలో కాకుండా ఆహారం పెంచుతూ, తగ్గిస్తూ ఉంటారు. ఎలుగుబంటి జూ పార్కులో హిమాలయన్ బ్లాక్, స్లాత్ బేర్ ఎలుగుబంట్లు ఉన్నాయి. వీటికి రకరకాల పండ్లు, చెరకు ముక్కలు, రెండు వందల గ్రాముల తేనె, రెండు కిలోల మైదా జావా, రెండు కిలోల రొట్టెలు, లీటర్ పాలు ఇస్తారు. నీటి ఏనుగు ఒక్కో నీటి ఏనుగుకు 150 కిలోలకుపైగా రోజువారీ ఆహారం ఇవ్వాల్సి ఉంటుంది. 70 కిలోల పచ్చగడ్డి, పశుదాణా 20 కిలోలతోపాటు రకరకాల కూరగాయలను ఆహారంగా ఇస్తారు. దీనికి 3 పూటలా ఆహారం ఇస్తారు. పక్షి జాతులకు పక్షులకు ఇచ్చే ఆహారం పరిమాణం తక్కువగానే ఉంటుంది. విదేశీ పక్షులైన పెలికాన్ పక్షులకు రోజుకు కిలో చేపలు ఇస్తారు. చాలా రకాల పక్షులకు రోజుకు 50 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు పప్పులు, గింజలు, ధాన్యాలు ఇస్తారు. ఏనుగులు అన్ని జంతువుల్లోకెల్లా భారీగా ఆహారం తినే జంతువు ఏనుగు. దీనికి రోజుకు 250 కిలోలకు తక్కువ కాకుండా ఆహారం అందించాల్సి ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు తింటూనే ఉంటుంది. ప్రతిరోజు 150 కిలోల పచ్చగడ్డి, 50 కిలోల పశుదాణా, రాగి జావ, బెల్లం, ఉప్పు, అరటిపళ్ళు, 50 కిలోల చెరకు, కొబ్బరి ఆకులు అందించాల్సి ఉంటుంది. తాబేలు తాబేళ్ల ఆహారం తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే. సుమారు 300 ఏళ్ల సుదీర్ఘ జీవితం గడిపే తాబేళ్లు రోజువారీ ఆహారం కేవలం 250 గ్రాములే. క్యాబేజి, క్యారెట్, పాలకూర వంటివి అన్నీ కలుపుకొని కేవలం 250 గ్రాములు మాత్రమే తింటాయి. ఇక నీటి తాబేలు రోజూ 200 గ్రాముల చేపను మాత్రమే తింటుంది. ఇతర జంతువులకు.. తోడేలుకు రెండు కిలోలపశువుల మాంసం ఇవ్వాల్సి ఉంటుంది. నక్కకు కిలో పశువు మాంసం మొసలికి 5 కిలోల చొప్పున పశువు మాంసంతోపాటు పుచ్చకాయలు, పండ్లు, చేపలు ఇస్తారు. దుప్పులు, ఇతర జింక జాతులకు కిలో పశుదాణాతోపాటు పచ్చగడ్డి అవసరాన్ని బట్టి, రెండు కట్టెల తోటకూర, పావుకిలో క్యారెట్, 100 గ్రాముల క్యాబేజీ, కొద్ది మోతాదులో కీరదోస, గుమ్మడి వంటివి పెడతారు. కొండచిలువకు వారానికి ఒక కోడి, ఒక ఎలుక సరిపోతుంది. ఇతర పాములకు వారానికి ఆరు నుంచి ఎనిమిది కప్పలు, ఒకటి లేదా రెండు ఎలుకలు ఒక ఆహారంగా ఇస్తారు. బర్డ్‌ఫ్లూ నివారణ చర్యల్లో భాగంగా జూలో చికెన్ వినియోగించడం లేదు. దీంతోపాటు పక్షులు సంచరించే ప్రాంతంలో అధికారులు నిఘా పెంచారు. -
ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ ఉండదిక
లండన్: ఒక పిజ్జా కొంటే రెండో పిజ్జా ఫ్రీ, ఒక బిర్యానీ కొంటే ఇంకో బిర్యానీ ఫ్రీ వంటి ఆఫర్లను మనం చూసే ఉంటాం. అయితే బ్రిటన్‌లో ఇలాంటి ఆఫర్లకు అడ్డుకట్ట పడబోతోంది. అంతేకాదు ప్రతి ఆహారం వల్ల ఎంత కేలరీల శక్తి వస్తుందో ఆయా వివరాలను కూడా రెస్టారెంట్లు మెనూలో ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు. దేశంలో విపరీతంగా పెరిగిపోతున్న ఊబకాయాన్ని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇలాంటి ఆలోచనలు బ్రిటిష్ ప్రభుత్వానికి కొత్తేం కాదు. గతంలోనూ ఇలాంటి ఆలోచనలు చేశారు. అయితే ప్రస్తుతం కోవిడ్ కారణంగా కూర్చొని తినేవారి సంఖ్య పెరగడం, దాంతో ఊబకాయం కూడా పెరగడంతో ప్రభుత్వం ఈ దిశగా అడుగులేస్తోంది. ఐసీయూకు వచ్చే వారిలో 8 శాతం మంది ఊబకాయంతో ఉన్నవారేనని సమాచారం. యువకుల్లో మూడింటి రెండొంతుల మంది అధిక బరువుతో బాధ పడుతున్నారని, 28 శాతం మంది ఊబకాయంతో బాధపడుతున్నారని ప్రభుత్వం అంటోంది. బరువు తగ్గడం కష్టమే అయినా చిన్న చిన్న మార్పులతో ఫిట్‌గా ఉండొచ్చని ప్రధాని జాన్సన్ అన్నారు. -
స్కూల్ కిట్ కొత్త మెనూ..!
-
ఇదే మెనూ.. పెట్టింది తిను
సాక్షి, సిద్దిపేట : 'శనివారం అక్కన్నపేట కస్తూరిబాగాంధీ బాలికల పాఠలలో మెనూ చార్టు ప్రకారం మధ్యాహ్న భోజనంలో అన్నం, బీరకాయ కూర, చుక్కకూర పప్పు, రసం, నెయ్యి, పెరుగు వడ్డించాలి. కానీ అక్కడ కేవలం పప్పు, సాంబారు మాత్రమే వండారు. ఇదేంటి అని అడిగితే ఇంకా కూరగాయలు సరఫరా చేసే కాంట్రాక్టర్ కూరగాయలు పింపించలేదని అక్కడ ఉన్న ఇన్చార్జి స్పెషల్ ఆఫీసర్ చెప్పారు’. ఇది ఒక్క అక్కన్నపేట కేజీబీవీ పరిస్థితే కాదు.. జిల్లాలో అధిక శాతం కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టల్స్, గురుల పాఠశాలల పరిస్థితీ ఇలాగే ఉంది. తాజా కూరగాయలు, పాలు, కిరాణం ఇతర వస్తువుల సరఫరాకు టెండర్లు వేసి సక్రమంగా సరఫరా చేస్తామని చెప్పిన కాంట్రాక్టర్లు ధరలు పెరగడంతో మెనూలోనివి కాకుండా తక్కువ ధరకు లభించేవి, పుచ్చులు, వాడిపోయినవి సరఫరా చేస్తూ చేతులు దులుపుకొంటున్నారు. ఎన్నిసార్లు చెప్పినా కాంట్రాక్టర్లు స్పందించడంలేదని పలువురు ప్రిన్సిపాల్స్ ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా కాకుండా కాంట్రాక్టర్లు సరఫరా చేసిందే మెనూగా జిల్లాలో అత్యధిక శాతం హాస్టళ్లలో విద్యార్థులకు వండి పెడుతున్నారు. జిల్లాలో 23 కేజీబీవీలు, 31 బీసీ, 31ఎస్సీ, 6ఎస్టీ 6 మైనార్టీ, 9 టీఎస్ఎంఎస్ బాలికల రెసిడెన్సియల్స్, 8 మహాత్మా జ్యోతీరావు పూలే బీసీ రెసిడెన్సియల్స్ 17 టీఆర్ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్‌తోపాటు టీఎస్ఆర్ రెసిడెన్షియల్, ప్రభుత్వ పాలిటెక్నిక్ హాస్టల్, గజ్వేల్, సిద్దిపేట, మొదలైన పాఠశాలలు ఉన్నాయి. వీటిలో మొత్తం 20,713 మంది విద్యార్థులున్నారు. అయితే వీరికి ప్రతీ రోజు ఆల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం పెట్టాలి. అదీ కూడా తాజా కూరగాయలు, పాలు, పండ్లు, మటన్, చికెన్, ఆకుకూరలు, నెయ్యి వంటివాటితో తయారు చేయాలి. ఇందుకు గాను చికెన్‌కు కేజీకి రూ. 169, మటన్ రూ. 430, కూరగాయలు అన్ని రకాలకు కేజీ రూ.20, నిమ్మకాయలు వందకు రూ. 30 చొప్పున చెల్లిస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఆలుగడ్డ, బెండకాయ, క్యాబేజీ, వంకాయ, బీరకాయ, దోసకాయ, సోరకాయ, దొండకాయ, క్యాలీఫ్లవర్, టమాట, చిక్కుడు, గోకరకాయ, పచ్చిమిర్చి, పూదీన, కొత్తిమీర, మెంతి, పాలకూర, గొంగూర, తోటకూర, చుక్కకూర మొదలైనవి సరఫరా చేయాలి. కానీ ఇప్పుడు టమాట, బీరకాయ, పచ్చిమిర్చి, క్యాబీజీ మొదలైన కూరగాయల ధర కిలో రూ.40కిపైగా ఉంది. దీంతో కాంట్రాక్టర్లు కేవలం బెండకాయలు, వంకాయలు, ఆలుగడ్డ వంటి తక్కువ ధరకు వచ్చే కూరగాయలు మాత్రమే సరఫరా చేస్తున్నారని వార్డెన్లు, ప్రిన్సిపల్స్ చెబుతున్నారు. దీంతో ప్రభుత్వం ప్రకటించిన మెనూ కాకుండా కాంట్రాక్టర్ పంపించిన కూరగాయలను వండి పెట్టే దుస్థితి నెలకొంది. దీంతో రోజూ ఒకే రకం కూరగాయలు పెడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్పందించని అధికారులు.. పెరుగుతున్న పిల్లలకు సన్నబియ్యంతోపాటు, మంచి కూరగాయలతో బలవర్థకమైన ఆహారం అందించాలని ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది. అయితే దీన్ని పక్కన పెట్టి పలువురు కాంట్రాక్టర్లు తమ ఇష్టారాజ్యంగా కూరగాయలు సరఫరా చేస్తున్నా అడిగే నాథుడు కరువయ్యారు. పలు పాఠశాలల నుంచి ఈ విషయాన్ని ప్రిన్సిపాల్స్, వార్డెన్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా చేశారు. కానీ వారు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉండటంలో అంతర్యమేమిటని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. తక్కువ రేటు ఉన్నప్పుడు మెనూ గురించి ఆలోచించని కాంట్రాక్టర్లు ఇప్పుడు రేటు పెరిగిందని నాసిరకం కూరగాయులు ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో పలువురు అధికారులు, కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ముడుపులు తీసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి టెండర్లో పేర్కొన్న విధంగా Üరఫరా చేయాలని, లేని పక్షంలో సదరు కాంట్రాక్టును రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలా అయితేనే విద్యార్థులకు మంచి ఆహారం అందుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
రైళ్లలో బిల్లు ఇవ్వకుంటే భోజనం ఫ్రీ
న్యూఢిల్లీ: రైళ్లలో ఇకపై ఆహారపదార్థాల జాబితాను ధరలతో సహా రైళ్లలో ప్రదర్శించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ‘బిల్లు ఇవ్వకుంటే మీ భోజనం ఉచితమే. దయచేసి టిప్ ఇవ్వకండి’ అనే సందేశాన్ని టిన్ ప్లేట్లపై ముద్రించనున్నారు. రైల్వేమంత్రి గోయల్ అధ్యక్షతన రైల్వేబోర్డు, జోనల్ మేనేజర్లు, డివిజినల్ మేనేజర్లతో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రైళ్లలో అన్ని సాధారణ ఫిర్యాదుల కోసం ఒకే హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని గోయల్ అన్నారు. ప్రస్తుతం 723 స్టేషన్లకున్న ఉచిత వైఫై సౌకర్యాన్ని 2వేల స్టేషన్లకు విస్తరించాలని ఆదేశించారు. ఈ ఏడాది మార్చికల్లా రైళ్లలో కేటరింగ్ సిబ్బందికి పాయింట్ ఆఫ్ సేల్(పీవోఎస్)యంత్రాలను అందిస్తామని వెల్లడించారు. -
హిందూ మీల్స్‌పై వెనక్కి తగ్గిన ఎమిరేట్స్
న్యూఢిల్లీ : దుబాయ్ అధికారిక విమానయాన సంస్థ ఎమిరేట్స్ తన అధికారిక మెనూ నుంచి ‘హిందూ మీల్స్’ ఆప్షన్‌ను తొలగించాలనే నిర్ణయంపై వెనక్కి తగ్గింది. సోషల్ మీడియా యూజర్ల నుంచి పెద్ద ఎత్తున్న నిరసన వ్యక్తమవడంతో, తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టు ఎమిరేట్స్ తెలిపింది. ఫుడ్ ఆప్షన్స్ నుంచి హిందూ మీల్స్‌ను వెనక్కి తీసుకోవాలని, భారతీయుల మతసంబంధమైన విశ్వాసాలకు అనుగుణంగా శాంకాహారం, మాంసాహారం ఆఫర్ చేయనున్నట్టు ఎమిరేట్స్ ఈ వారం ప్రారంభంలో ప్రకటించింది. కానీ ఈ నిర్ణయాన్ని సోషల్ మీడియా యూజర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. తమ కస్టమర్ల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను ఆధారంగా చేసుకుని, హిందూ మీల్ ఆప్షన్‌ను కొనసాగించనున్నామని ఎమిరేట్స్ ధృవీకరించింది. దీంతో తమ హిందూ కస్టమర్లను తేలికగా గుర్తించవచ్చని, వారి అభ్యర్థనమేరకు దీన్ని కొనసాగిస్తున్నామని ఎమిరేట్స్ బుధవారం సాయంత్రం ఓ ప్రకటన వెలువరించింది. ఎమిరేట్స్ ఎన్నో రకాల ప్రత్యేక భోజనాలను కస్టమర్లకు ఆఫర్ చేస్తుందని, వారిలో తమ హిందూ కస్టమర్లు కూడా ఉంటారని తెలిపింది. ప్రయాణికులకు తాము కల్పించే సేవలు గురించి నిరంతరం పరిశీలిస్తూ ఉంటామని పేర్కొంది. తాము ప్రకటించే ఆఫర్ల గురించి, సేవల గురించి ప్రయాణికుల అభిప్రాయాలను తెలుసుకుంటామని, ఇది తమ సేవలను మరింత మెరుగుపర్చుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పింది. ‘ప్రయాణికుల అభిరుచికి తగ్గట్లుగా మా విమానయాన సంస్థలో ఆహారాన్ని, డ్రింక్స్‌ను అందిస్తాం. మా దగ్గర చాలా మంచి చెఫ్‌లు ఉన్నారు. వారు ప్రయాణికుల అభిరుచులకనుగుణంగా, మా సాంప్రదాయలను ప్రతిబింబించే రుచికరమైన వంటకాలు తయారు చేస్తారు. మేము ప్రయాణికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పదార్ధాలను తయారు చేయిస్తాం’ అని ఎమిరేట్స్ తెలిపింది. పెద్ద పెద్ద విమానయాన సంస్థలన్నీ మతపరమైన అంశాలను, ఆహార నియమాలు, వైద్య అంశాలను పరిగణలోకి తీసుకుని మీల్ ఆప్షన్లను అందిస్తూ ఉంటాయి. ఎయిరిండియా, సింగపూర్ ఎయిర్‌లైన్స్ మెనూలలో ‘రిలీజియస్’ పేరు మీద స్పెషల్ మీల్స్ కూడా ఉన్నాయి. వాటిలో హిందూ నాన్-వెజిటేరియన్ మీల్, ముస్లి, మస్సెలెం మీల్, కోషర్ మీల్ ఉన్నాయి. అంతర్జాతీయ విమానయాన సంస్థలు వెజిటేరియన్ మీల్ కోసం కూడా పలు ఆప్షన్లను ఆఫర్ చేస్తున్నాయి. ఇండియన్ వెజ్, జైన్ మీల్, ఓరియెంటల్, వెగాన్ వంటి మీల్స్‌ను ఎయిర్‌లైన్స్ తమ ప్రయాణికులకు అందిస్తూ ఉంటాయి. -
మెనూ ప్రకారం భోజనం అందించాలి
తాడ్వాయి(ఎల్లారెడ్డి) : విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని కలెక్టర్ సత్యనారాయణ సూచించారు. తాడ్వాయి మండలంలోని ఎర్రపహాడ్‌లో గల మహాత్మజ్యోతిబా పూలే బాలుర గురుకుల పాఠశాలను ఆదివారం తనిఖీ చేశారు. హాస్టల్‌ను ఎçప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, ఆవరణలో రకరకాల మొక్కలను నాటాలని సూచించారు. పిల్లలను ప్రణాళిక ప్రకారం చదివించాలని, వార్షిక పరీక్షలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. అనంతరం గురుకుల పాఠశాలకు సంబంధించిన రికార్డులు, విద్యార్థుల హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. ఆయన వెంట సర్పంచ్ పోతగౌడ్, ఎంపీటీసీ సభ్యుడు లింగారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. -
మెనూ చార్ట్ ఇదే...అమలు పరచండి
* 2015-16కు సంబంధించి పాటించాలని జిల్లాల్లోని హాస్టళ్లకు ఆదేశం * మెనూ చార్ట్‌ను సమీక్షించాలని కలెక్టర్లకు సూచన సాక్షి,హైదరాబాద్ : వెనుకబడిన తరగతులకు చెందిన ప్రీ -మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో ప్రస్తుత విద్యాసంవత్సరానికి (2015-16) సంబంధించి అమలుచేయాల్సిన మెనూచార్ట్‌ను ప్రభుత్వం ఖరారుచేసింది. ఈ మేరకు సోమవారం నుంచి ఆదివారం వరకు వివిధ సమయాల్లో హాస్టళ్లలో అందుబాటులోకి తీసుకురావాల్సిన ఆయా ఆహారపదారా్థుల గురించి అందులో వివరించారు. ఈ మెనూను అమలుచేయాలని అన్ని జిల్లాలకు ఆ చార్ట్‌ను బీసీసంక్షేమశాఖ పంపించింది. దీన్ని జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు జిల్లా బీసీ సంక్షేమాధికారులతో సమీక్షించి, ఆయా జిల్లాల అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసుకోవచ్చునని సూచించింది. కొత్త విధానం ప్రకారం ప్రీమెట్రిక్ హాస్టళ్లకు సంబంధించి రోజుకు ఒక్కో విద్యార్థికి బియ్యం 400 గ్రాముల చొప్పున, పామాయిల్,పప్పులు,ఉప్పు, చింతపండు, కోడిగుడ్లు,పండ్లు,స్వీట్లు ఇతరాలు కలుపుకుని రోజుకు ఒక్కో విద్యార్థికి రూ.27 వరకు ఖర్చు అవుతుందని లెక్క కట్టారు. పెద్దక్లాసుల విద్యార్థులకు నెలకు రూ. 850 వంతున, చిన్నక్లాసుల విద్యార్థులకు నెలకు రూ.750 వంతున కలుపుకుని సరాసరి రూ.810 వరకు అంచనావేశారు. ఇక పోస్ట్‌మెట్రిక్ హాస్టల్ విద్యార్థులకు రోజుకు ఒక్కొక్కరికి రూ.35 చొప్పున ఖర్చు అవుతుందని, ఈ విధంగా ఒక్కో విద్యార్థికి నెలకు రూ.1,050 చొప్పున వ్యయం అవుతుందని పేర్కొన్నారు. ప్రీమెట్రిక్ హాస్టళ్లలో ఇలా.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రీ మెట్రిక్ హాస్టళ్లలోని విద్యార్థులకు సోమవారం నుంచి ఆదివారం వరకు ఉదయం 6.30 గంటలకు రాగిమాల్ట్ (పాలతో), అల్పాహారంగా ఒక్కోరోజు ఉప్మా,కిచిడీ, పులిహోర, ఇడ్లీని ఏదైనా ఒక పండుతో పాటు ఇవ్వాలి. స్కూళ్లలోనే మధ్యాహ్నభోజనం అందుబాటులో ఉన్నందున ఆదివారం మాత్రం హాస్టళ్లలో రైతాతో పాటు ఎగ్ బిరియానీ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యార్థులకు హాస్టల్లోనే మధ్యాహ్నభోజనం అమలు చేయాలి. సాయంత్రం పల్లీ లడ్డు, శెనగగుగ్గిళ్లు, బిస్కెట్లు, 30 గ్రాముల బొబ్బర్లు, ఉలవలు పెట్టాలి. రాత్రి అన్నం,సాంబారు, ఒకకూర,పెరుగుతో పాటు శనివారం మినహా అన్ని రోజులు కోడిగుడ్డు పెట్టాలి. పోస్ట్‌మెట్రిక్ హాస్టళ్లలో .. అన్ని జిల్లాల్లోని పోస్ట్‌మెట్రిక్ హాస్టళ్లలో సోమవారం నుంచి ఆదివారం వరకు ఉదయం 6.30 గంటలకు తేనీరు, టిఫిన్‌గా ఉప్మా చెట్నీ,కిచిడి చెట్నీ, పులిహోర, టమా ట రైస్, పులగం వంటివి ఇవ్వాలి. మధ్యాహ్నభోజనం కింద అన్నం,సాంబారు, ఆకుకూరలు, ఆదివారాలు పెరుగుపచ్చడితో పా టు ఎగ్ బిరియానీ పెట్టాలి. ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యార్థులకు హాస్టల్లోనే మధ్యాహ్నభోజనం పెట్టాలి. రాత్రి భోజనంలో సోమవారం నుంచి ఆదివారం వరకు అన్నం, ఆకుకూర, రసం,పెరుగు, ఆదివా రం మినహా కోడిగుడ్డు పెట్టాల్సి ఉంటుంది.