సాక్షి, సిద్దిపేట : 'శనివారం అక్కన్నపేట కస్తూరిబాగాంధీ బాలికల పాఠలలో మెనూ చార్టు ప్రకారం మధ్యాహ్న భోజనంలో అన్నం, బీరకాయ కూర, చుక్కకూర పప్పు, రసం, నెయ్యి, పెరుగు వడ్డించాలి. కానీ అక్కడ కేవలం పప్పు, సాంబారు మాత్రమే వండారు. ఇదేంటి అని అడిగితే ఇంకా కూరగాయలు సరఫరా చేసే కాంట్రాక్టర్ కూరగాయలు పింపించలేదని అక్కడ ఉన్న ఇన్‌చార్జి స్పెషల్ ఆఫీసర్ చెప్పారు’. ఇది ఒక్క అక్కన్నపేట కేజీబీవీ పరిస్థితే కాదు.. జిల్లాలో అధిక శాతం కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టల్స్, గురుల పాఠశాలల పరిస్థితీ ఇలాగే ఉంది.
తాజా కూరగాయలు, పాలు, కిరాణం ఇతర వస్తువుల సరఫరాకు టెండర్లు వేసి సక్రమంగా సరఫరా చేస్తామని చెప్పిన కాంట్రాక్టర్లు ధరలు పెరగడంతో మెనూలోనివి కాకుండా తక్కువ ధరకు లభించేవి, పుచ్చులు, వాడిపోయినవి సరఫరా చేస్తూ చేతులు దులుపుకొంటున్నారు. ఎన్నిసార్లు చెప్పినా కాంట్రాక్టర్లు స్పందించడంలేదని పలువురు ప్రిన్సిపాల్స్ ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వం సూచించిన విధంగా కాకుండా కాంట్రాక్టర్లు సరఫరా చేసిందే మెనూగా జిల్లాలో అత్యధిక శాతం హాస్టళ్లలో విద్యార్థులకు వండి పెడుతున్నారు. జిల్లాలో 23 కేజీబీవీలు, 31 బీసీ, 31ఎస్సీ, 6ఎస్టీ 6 మైనార్టీ, 9 టీఎస్‌ఎంఎస్ బాలికల రెసిడెన్సియల్స్, 8 మహాత్మా జ్యోతీరావు పూలే బీసీ రెసిడెన్సియల్స్ 17 టీఆర్ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్‌తోపాటు టీఎస్‌ఆర్ రెసిడెన్షియల్, ప్రభుత్వ పాలిటెక్నిక్ హాస్టల్, గజ్వేల్, సిద్దిపేట, మొదలైన పాఠశాలలు ఉన్నాయి. వీటిలో మొత్తం 20,713 మంది విద్యార్థులున్నారు.
అయితే వీరికి ప్రతీ రోజు ఆల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం పెట్టాలి. అదీ కూడా తాజా కూరగాయలు, పాలు, పండ్లు, మటన్, చికెన్, ఆకుకూరలు, నెయ్యి వంటివాటితో తయారు చేయాలి. ఇందుకు గాను చికెన్‌కు కేజీకి రూ. 169, మటన్ రూ. 430, కూరగాయలు అన్ని రకాలకు కేజీ రూ.20, నిమ్మకాయలు వందకు రూ. 30 చొప్పున చెల్లిస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఆలుగడ్డ, బెండకాయ, క్యాబేజీ, వంకాయ, బీరకాయ, దోసకాయ, సోరకాయ, దొండకాయ, క్యాలీఫ్లవర్, టమాట, చిక్కుడు, గోకరకాయ, పచ్చిమిర్చి, పూదీన, కొత్తిమీర, మెంతి, పాలకూర, గొంగూర, తోటకూర, చుక్కకూర మొదలైనవి సరఫరా చేయాలి.
కానీ ఇప్పుడు టమాట, బీరకాయ, పచ్చిమిర్చి, క్యాబీజీ మొదలైన కూరగాయల ధర కిలో రూ.40కిపైగా ఉంది. దీంతో కాంట్రాక్టర్లు కేవలం బెండకాయలు, వంకాయలు, ఆలుగడ్డ వంటి తక్కువ ధరకు వచ్చే కూరగాయలు మాత్రమే సరఫరా చేస్తున్నారని వార్డెన్లు, ప్రిన్సిపల్స్ చెబుతున్నారు. దీంతో ప్రభుత్వం ప్రకటించిన మెనూ కాకుండా కాంట్రాక్టర్ పంపించిన కూరగాయలను వండి పెట్టే దుస్థితి నెలకొంది. దీంతో రోజూ ఒకే రకం కూరగాయలు పెడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్పందించని అధికారులు..
పెరుగుతున్న పిల్లలకు సన్నబియ్యంతోపాటు, మంచి కూరగాయలతో బలవర్థకమైన ఆహారం అందించాలని ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది. అయితే దీన్ని పక్కన పెట్టి పలువురు కాంట్రాక్టర్లు తమ ఇష్టారాజ్యంగా కూరగాయలు సరఫరా చేస్తున్నా అడిగే నాథుడు కరువయ్యారు. పలు పాఠశాలల నుంచి ఈ విషయాన్ని ప్రిన్సిపాల్స్, వార్డెన్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా చేశారు. కానీ వారు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉండటంలో అంతర్యమేమిటని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
తక్కువ రేటు ఉన్నప్పుడు మెనూ గురించి ఆలోచించని కాంట్రాక్టర్లు ఇప్పుడు రేటు పెరిగిందని నాసిరకం కూరగాయులు ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో పలువురు అధికారులు, కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ముడుపులు తీసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి టెండర్‌లో పేర్కొన్న విధంగా Üరఫరా చేయాలని, లేని పక్షంలో సదరు కాంట్రాక్టును రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలా అయితేనే విద్యార్థులకు మంచి ఆహారం అందుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment