kgvbs
-
13 ఏళ్ల క్రితమే ఆంగ్ల బోధన
రాష్ట్రంలో ప్రాథమిక స్థాయిలో ఆంగ్ల బోధన 13 ఏళ్లుగా ‘సక్సెస్’ఫుల్‌గా నడుస్తోంది. మహానేత ముందు చూపుతో ఏర్పాటు చేసిన సక్సెస్‌స్కూళ్లలో ఆనాడే ఆంగ్లబోధన మొదలైంది. అటు తరువాత కేజీబీవీలు... మోడల్ స్కూళ్లకూ విస్తరించింది. అదే స్ఫూర్తితో ఆరోతరగతి వరకూ పూర్తిగా ఆంగ్లమాధ్యమం ప్రవేశపెడితే విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి. అదేదో గొప్ప తప్పిదమైనట్టు గగ్గోలు పెడుతున్నాయి. కానీ నిరుపేదలకు దీనివల్ల ఎంత మంచి జరగబోతోందో... అర్థం చేసుకోవట్లేదు. రాజకీయ కోణంలో చూస్తూ లేనిపోని భయాందోళనలు సృష్టిస్తున్నాయి. సాక్షి, విజయనగరం: ప్రభుత్వ పాఠశాలల్లో మాతృభాషతోపాటు ఆంగ్లమాధ్యమాన్ని సమాంతరంగా అందించే విధానాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి 2006లోనే తీసుకొచ్చారు. తరువాత వచ్చిన పాలకులు ఆయన లక్ష్యాలను పట్టించుకోక పోవడం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లోని ఆంగ్లమాద్యం అటకెక్కింది. అయినప్పటికీ జిల్లాలో ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాల విద్యార్ధుల్లో మూడింట ఒక వంతు మంది ఇంగ్లిష్ మీడియం చదువుతున్నారు. వీటి నిర్వహణలో చిత్తశుద్ధి చూపకపోవడం వల్ల ప్రైవేటు విద్యావ్యవస్థను పరోక్షంగా బలోపేతం చేశాయి. గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థుల తల్లిదండ్రులు సైతం వేలకు వేల రూపాయలు ఫీజులు చెల్లించి మరీ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లకు పంపుతున్నారు. పిల్లలను చది వించే విషయంలో తల్లిదండ్రులు అప్పులు చేసేందుకు కూడా వెనుకాడటం లేదు. ఇంగ్లిష్ మీడియంలో చదివించాలనే తల్లిదండ్రుల ఆకాంక్షను ప్రైవేటు పాఠశాలలు ఆసరాగా మలచుకున్నాయి. వారి ఫీజుల దోపిడీని ప్రజా సంకల్పయాత్రలో తెలుసుకున్న వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ‘నేను విన్నాను... నేను ఉన్నాను..’ అంటూ పేదలకు భరోసా ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలోనే బోధించేలా నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఇప్పుడు మేధావులు, విద్యావేత్తలు, ప్రజలు హర్హం వ్యక్తం చేస్తున్నారు. 13 ఏళ్ల క్రితమే వైఎస్ హయాంలో ఆంగ్ల బోధన రాష్ట్రంలో ఇంగ్లిష్ మీడియం కోరుకుంటున్న తల్లిదండ్రులు ప్రైవేటు వైపు మొగ్గుచూపుతున్న పరిస్థితులను తొలుత దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి పాదయాత్రలోనే గుర్తించారు. ఇంగ్లిష్ మీడియం పెట్టాలనే ముందుచూపుతో పదవిలోకి వచ్చిన తరువాత 2006లో ఆయన తొలుత సమాంతరంగా ఇంగిఎలష్ మీడియం ప్రవేశ పెట్టారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకోసం జిల్లాలో అప్పట్లోనే 173 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ‘సక్సెస్ స్కూల్’ పేరుతో ఇంగ్లిష్ మీడియం సమాంతరంగా ప్రవేశ పెట్టారు. ఇంగ్లిష్ బోధించేందుకు కొందరు ఉపాధ్యాయులను సక్సెస్ స్కూళ్లకు కేటాయించారు. అప్పట్లో వైఎస్ ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టక పోయి ఉంటే ప్రభుత్వ బడులు చాలా వరకు కనుమరుగయ్యేవని విద్యావేత్తలు, మేధావులు అంటున్నారు. మహానేత వేసిన బీజం కేజీబీవీలకూ విస్తరణ వైఎస్‌రాజశేఖరరెడ్డి నాడు వేసిన బీజం కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో కూడా విస్తరించి అమలులో వచ్చింది. రెండేళ్ల క్రితం అమలులోకి వచ్చిన 33 కేజీబీవీలలో ఇంతవరకు 12 వేల మంది వరకు బాలికలు పదోతరగతి పూర్తి చేసుకొని బయటకు వచ్చారు. పదేళ్లక్రితం ప్రారంభించిన 16 మోడల్ స్కూళ్లలో ఆంగ్ల మాద్యమంలో చదివి పదోతరగతి పూర్తి చేసుకొని బయటకు వచ్చి ఉన్నతంగా స్థిరపడిన వారు 20 వేల మంది వరకు ఉన్నారు. ఈ ఏడాది జిల్లాలో వివిధ యాజమాన్యాల ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాద్యం అందుకుంటున్న విద్యార్ధులు 68,869 మంది వరకు ఉన్నారు. మొత్తం 2,10,898 మంది విద్యార్థుల్లో మూడింట ఒక వంతు ఆంగ్ల మాద్యమం వారే ఉన్నారు. వీరందరికీ ఇప్పటికే ప్రాధమిక స్థాయి నుంచి ఆంగ్లంపై అవగాహన ఉంది. వైఎస్ తరువాత వచ్చిన పాలకుల్లో చిత్తశుద్ధి కొరవడి ఆంగ్లబోధన పటిష్టానికి చర్యలు చేపట్టలేకపోయారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ పరిస్థితిని అధిగమించే రీతిలో ప్రణాళికలు వేస్తోంది. బాబు హయాంలో 117 స్కూళ్ల మూసివేత చంద్రబాబు హయాంలో ప్రస్తుతం నడుస్తున్న సమాంతర ఆంగ్లమాద్యమ విధానాన్ని పూర్తి విస్మరించారు. పరోక్షంగా ప్రైవేటు విద్యావ్యవస్థను ప్రోత్సహించేలా వ్యవహరించి రేషనలైజేషన్ పేరుతో జిల్లాలో 117 పాఠశాలలను మూసేశారు. మున్సిపల్ మంత్రి నారాయణ తమ విద్యాలయాల్లోని అమలు చేసిన విధానాలను రుద్దారు. ‘కెరియర్ ఫౌండేషన్ కోర్సు(సీఎఫ్‌సీ), అద్వాన్స్ ఫౌండేషన్ కోర్సు(ఏఎఫ్సీ)లను ప్రవేశపెట్టి ఇంగ్లిష్ బోధనలను ప్రవేశ పెట్టారు. ఇందుకోసం రూ.లక్షలకు లక్షలు పెట్టి ప్రత్యేక పుస్తకాలను కూడా ముద్రించి విద్యార్థులకు అందజేశారు. అప్పుడు తప్పుకాదన్నవారు ఇప్పుడు ఇలా వాదించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాల వల్లే విద్యారంగం తిరోగమనం వైపు వెళ్లిందన్న విమర్శలూ వస్తున్నాయి. సంకల్పయాత్రలో వీటిని గుర్తించిన వై.ఎస్.జగన్మోహనరెడ్డి విద్యావిధానంలో ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెట్టి, అమ్మ ఒడి, నాడు నేడు వంటి కార్యక్రమాలను చేపడుతున్నారు. నమ్మకం పెరిగింది కేజీబీవీల్లో 6వ తరగతి నుంచి ఆంగ్లమాధ్యమంలో పది వరకు చదివాను. దానివల్ల ప్రస్తుతం పాలిటెక్నికల్ డిప్లమా ఆంగ్ల మాధ్యమ చదువులు సులవయ్యాయి. ఆ తరువాత ఉన్నత చదువులు చదవడానికి భయం పోయింది. పాఠశాల స్థాయిలో ఆంగ్ల మాధ్యమం చదవడం వల్ల ఇష్టపడిన రంగంలో స్థిరపడగలననే నమ్మకం కలిగింది. – ఆరిపాక జ్యోతి, పాలిటెక్నికల్, నీలావతి, గంట్యాడ మండలం ఇంటర్లో ఇంగ్లిష్ మీడియం శుభపరిణామం ప్రభుత్వ పాఠశాలల స్థాయిలో ఏర్పాటు చేసిన ఆంగ్ల మాధ్యమం వల్ల మంచి ఫలితాలే వస్తాయి. మరోవైపు తెలుగు సబ్జెక్టు బోధనల్లో మరింత పటిష్టత అవసరం. ఆ దిశగా పాఠ్యాంశాలు, బోధనా శైలిలో సంస్కరణలు రావాలి. చదివిన పేద, మధ్యతరగతి విద్యార్థుల కోసం ఉన్నత పాఠశాలల్లో ఇంటర్మీడియట్ కోర్సులు పెట్టడం మంచి పరిణామమే. – టి.సన్యాసిరాజు, ప్రధాన కార్యదర్శి, ప్రధానోపాధ్యాయుల సంఘం -
ఇదే మెనూ.. పెట్టింది తిను
సాక్షి, సిద్దిపేట : 'శనివారం అక్కన్నపేట కస్తూరిబాగాంధీ బాలికల పాఠలలో మెనూ చార్టు ప్రకారం మధ్యాహ్న భోజనంలో అన్నం, బీరకాయ కూర, చుక్కకూర పప్పు, రసం, నెయ్యి, పెరుగు వడ్డించాలి. కానీ అక్కడ కేవలం పప్పు, సాంబారు మాత్రమే వండారు. ఇదేంటి అని అడిగితే ఇంకా కూరగాయలు సరఫరా చేసే కాంట్రాక్టర్ కూరగాయలు పింపించలేదని అక్కడ ఉన్న ఇన్చార్జి స్పెషల్ ఆఫీసర్ చెప్పారు’. ఇది ఒక్క అక్కన్నపేట కేజీబీవీ పరిస్థితే కాదు.. జిల్లాలో అధిక శాతం కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టల్స్, గురుల పాఠశాలల పరిస్థితీ ఇలాగే ఉంది. తాజా కూరగాయలు, పాలు, కిరాణం ఇతర వస్తువుల సరఫరాకు టెండర్లు వేసి సక్రమంగా సరఫరా చేస్తామని చెప్పిన కాంట్రాక్టర్లు ధరలు పెరగడంతో మెనూలోనివి కాకుండా తక్కువ ధరకు లభించేవి, పుచ్చులు, వాడిపోయినవి సరఫరా చేస్తూ చేతులు దులుపుకొంటున్నారు. ఎన్నిసార్లు చెప్పినా కాంట్రాక్టర్లు స్పందించడంలేదని పలువురు ప్రిన్సిపాల్స్ ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా కాకుండా కాంట్రాక్టర్లు సరఫరా చేసిందే మెనూగా జిల్లాలో అత్యధిక శాతం హాస్టళ్లలో విద్యార్థులకు వండి పెడుతున్నారు. జిల్లాలో 23 కేజీబీవీలు, 31 బీసీ, 31ఎస్సీ, 6ఎస్టీ 6 మైనార్టీ, 9 టీఎస్ఎంఎస్ బాలికల రెసిడెన్సియల్స్, 8 మహాత్మా జ్యోతీరావు పూలే బీసీ రెసిడెన్సియల్స్ 17 టీఆర్ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్‌తోపాటు టీఎస్ఆర్ రెసిడెన్షియల్, ప్రభుత్వ పాలిటెక్నిక్ హాస్టల్, గజ్వేల్, సిద్దిపేట, మొదలైన పాఠశాలలు ఉన్నాయి. వీటిలో మొత్తం 20,713 మంది విద్యార్థులున్నారు. అయితే వీరికి ప్రతీ రోజు ఆల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం పెట్టాలి. అదీ కూడా తాజా కూరగాయలు, పాలు, పండ్లు, మటన్, చికెన్, ఆకుకూరలు, నెయ్యి వంటివాటితో తయారు చేయాలి. ఇందుకు గాను చికెన్‌కు కేజీకి రూ. 169, మటన్ రూ. 430, కూరగాయలు అన్ని రకాలకు కేజీ రూ.20, నిమ్మకాయలు వందకు రూ. 30 చొప్పున చెల్లిస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఆలుగడ్డ, బెండకాయ, క్యాబేజీ, వంకాయ, బీరకాయ, దోసకాయ, సోరకాయ, దొండకాయ, క్యాలీఫ్లవర్, టమాట, చిక్కుడు, గోకరకాయ, పచ్చిమిర్చి, పూదీన, కొత్తిమీర, మెంతి, పాలకూర, గొంగూర, తోటకూర, చుక్కకూర మొదలైనవి సరఫరా చేయాలి. కానీ ఇప్పుడు టమాట, బీరకాయ, పచ్చిమిర్చి, క్యాబీజీ మొదలైన కూరగాయల ధర కిలో రూ.40కిపైగా ఉంది. దీంతో కాంట్రాక్టర్లు కేవలం బెండకాయలు, వంకాయలు, ఆలుగడ్డ వంటి తక్కువ ధరకు వచ్చే కూరగాయలు మాత్రమే సరఫరా చేస్తున్నారని వార్డెన్లు, ప్రిన్సిపల్స్ చెబుతున్నారు. దీంతో ప్రభుత్వం ప్రకటించిన మెనూ కాకుండా కాంట్రాక్టర్ పంపించిన కూరగాయలను వండి పెట్టే దుస్థితి నెలకొంది. దీంతో రోజూ ఒకే రకం కూరగాయలు పెడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్పందించని అధికారులు.. పెరుగుతున్న పిల్లలకు సన్నబియ్యంతోపాటు, మంచి కూరగాయలతో బలవర్థకమైన ఆహారం అందించాలని ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది. అయితే దీన్ని పక్కన పెట్టి పలువురు కాంట్రాక్టర్లు తమ ఇష్టారాజ్యంగా కూరగాయలు సరఫరా చేస్తున్నా అడిగే నాథుడు కరువయ్యారు. పలు పాఠశాలల నుంచి ఈ విషయాన్ని ప్రిన్సిపాల్స్, వార్డెన్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా చేశారు. కానీ వారు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉండటంలో అంతర్యమేమిటని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. తక్కువ రేటు ఉన్నప్పుడు మెనూ గురించి ఆలోచించని కాంట్రాక్టర్లు ఇప్పుడు రేటు పెరిగిందని నాసిరకం కూరగాయులు ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో పలువురు అధికారులు, కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ముడుపులు తీసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి టెండర్లో పేర్కొన్న విధంగా Üరఫరా చేయాలని, లేని పక్షంలో సదరు కాంట్రాక్టును రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలా అయితేనే విద్యార్థులకు మంచి ఆహారం అందుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
టీచర్ల నియామకాలకు జిల్లాస్థాయి కమిటీలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ పరీక్ష నిర్వహించి ఫలితాలను వెల్లడిస్తుండగా, విద్యాశాఖ ఆ ఫలితాల్లో అర్హత గల వారికి పోస్టింగ్‌లు ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా విద్యాశాఖ ఆమోదం కోసం ఫైలును ప్రభుత్వానికి పంపించింది. దీంతో వారికి పోస్టింగ్‌లు ఇచ్చేందుకు అవసరమైన మార్గదర్శకాల రూపకల్పన, నియామకాల ప్రక్రియను పూర్తి చేసేందుకు జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ విద్యాశాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి ఫైలుపై గురువారం సంతకం చేశారు. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన సంతకం చేసిన తొలి ఫైలు ఇదే. ఇప్పటివరకు టీఎస్పీఎస్సీ నుంచి దాదాపు 2 వేల వరకు పోస్టింగ్‌లు ఇచ్చేందుకు అభ్యర్థుల జాబితా టీఎస్పీఎస్సీ నుంచి విద్యాశాఖకు అందింది. అందులో 900 వరకు ఇంగ్లిషు మీడియం సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు జాబితా ఉండగా, మిగతావి స్కూల్ అసిస్టెంట్ ఇతర పోస్టులకు ఎంపికైన వారి జాబితా ఉంది. ఇక వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, కేజీబీవీ, గురుకుల పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి 8వ తరగతి విద్యార్థుల వరకు యూనిఫారాలు అందించే ఫైలుపైనా ఆయన సంతకం చేశారు. దీనికి రూ.74.01 కోట్లు వెచ్చించి విద్యాశాఖ విద్యార్థులకు యూనిఫారాలు అందించనుంది. కేజీబీవీల్లో 9వ తరగతి.. మరోవైపు 84 కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో (కేజీబీవీ) వచ్చే విద్యా సంవత్సరంలో 9వ తరగతి ప్రారంభించేందుకు మంత్రి ఆమోదం తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 475 కేజీబీవీలు ఉన్నాయి. అందులో 88 కేజీబీవీల్లో ఇంటర్మీడియట్ వరకు విద్యను ప్రభుత్వం అందిస్తోంది. మరో 303 కేజీబీవీల్లో పదో తరగతి వరకు విద్య బోధనను అందిస్తోంది. తాజాగా వచ్చే విద్యా సంవత్సరంలో మరో 84 కేజీబీవీల్లో 9వ తరగతి వరకు విద్యను అందించనుంది. కేజీబీవీలను ప్రారంభించిన కొద్దీ ఏటా ఒక్కో తరగతిని పెంచుతూపోతోంది. కిటకిటలాడినమంత్రి చాంబర్ ఆవరణ అధికారులు, సంఘాల నేతలు, యాజమాన్య సంఘాలు, జిల్లా నాయకులు, సందర్శకులతో విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి చాంబర్ ఆవరణ కిటకిటలాడింది. ఆయనను కలిసిన వారిలో ఐఏఎస్ అధికారులు అశోక్, విజయ్‌కుమార్, బుర్రా వెంకటేశం, పాఠశాల విద్య అధికారులు శేషుకుమారి, పీవీ శ్రీహరి, లింగయ్య, రమేశ్, గోపాల్‌రెడ్డి, ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ గౌతమ్‌రావు, సునీల్, డిగ్రీ కాలేజీ యాజమాన్యాల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రకాశ్, పరమేశ్వర్, గ్రూప్–1 అధికారుల సంఘం అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్ తదితరులు ఉన్నా రు. ఇక మంత్రి నివాసంలో ఇంటర్ విద్య జేఏసీ చైర్మన్ డాక్టర్ పి.మధుసూదన్‌రెడ్డి, టీటీ యూ అధ్యక్షుడు మణిపాల్‌రెడ్డి తదితరులు ఆయనను కలసి అభినందనలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన జగదీశ్‌రెడ్డి అంతకుముందు గురువారం సచివాలయంలో ఉదయం 11:30 గంటలకు విద్యాశాఖ మంత్రిగా జగదీశ్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు హోంమంత్రి మహమూద్ అలీ, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పలువురు ఇతర ప్రజాప్రతినిధులతోపాటు విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలు, కాలేజీల యాజమాన్యాలు అభినందనలు తెలిపాయి. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తనకు మళ్లీ మంత్రి పదవి ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో సీఎం విద్యాశాఖ ఇచ్చారని, తాను ప్రత్యేక దృష్టి సారించి తెలంగాణ విద్యాశాఖను దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో నిలబెడతానన్నారు. సమైక్య రాష్ట్ర ప్రభుత్వాలు తీర్చలేని సమస్యలను టీఆర్ఎస్ ప్రభుత్వం పరిష్కరిస్తూ ముందుకు సాగుతోందన్నారు. -
కేజీబీవీల్లోవసతులు కల్పించాలి
–విద్యార్థులకు మంచి బోధన కల్పించాల్సిన బాధ్యత స్పెషల్ ఆఫీసర్లదే –తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయెుద్దు –కలెక్టర్ సత్యనారాయణరెడ్డి సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్, పాల్గొన్న అధికారులు నల్లగొండ : జిల్లాలోని కస్తూరిబాగాంధీ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా మౌలిక సౌకర్యాలన్నీ కల్పించాలని కలెక్టర్ పి.సత్యనారాయణ రెడ్డి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కస్తూరిబా గాంధీ ఆశ్రమ పాఠశాలల స్పెషల్ ఆఫీసర్లు, ఇంజనీరింగ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని 46 కస్తూరిబాగాంధీ ఆశ్రమ పాఠశాలలు ఉండగా వాటిలో కొన్నింటికీ తలుపులు, కిటికీలు సరిగా లేవన్నారు. వెంటనే వాటిని బిగించాలని సూచించారు. 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు స్పెషల్ ఆఫీసర్లు ముందస్తు ప్రణాళికతో విద్యార్థులను తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఎంతో నమ్మకంతో ఆశ్రమ పాఠశాలల్లో చేర్చిస్తున్నారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా చూడాల్సిన బాధ్యత స్పెషల్ ఆఫీసర్లదేనన్నారు. విద్యార్థులకు మంచి బోధన అందేలా చూడాలన్నారు. ప్రభుత్వం ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు పేద విద్యార్థుల విద్య కోసం ఖర్చు చేస్తుందని, దాని ప్రతిఫలంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని కోరారు.ఉపాధ్యాయులు కొరత ఉన్నట్లయితే గెస్ట్ టీచర్లను నియమించుకోవాలని సూచించారు. ప్రతి పాఠశాలలో తాగునీరు, ప్రహరీలు, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలు ఉండే విధంగా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. స్పెషల్ ఆఫీసర్లు విద్యార్థులకు అందుబాటులో ఉండాలన్నారు. సమావేశంలో ఏజేసీ వెంకట్రావు, డీఈఓ చంద్రమోహన్, సర్వశిక్షా అభియాన్ పీడీ కిరణ్‌కుమార్, కస్తూరిబా గాంధీ ఆశ్రమ పాఠశాలల స్పెషల్ ఆఫీసర్లు, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
వచ్చే నెల 1 నుంచి కామన్ మెనూ
-గురుకులాలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీల్లో అమలు -కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో ప్రతిరోజు గుడ్డు, పండ్లు, -ప్రతి ఆదివారం చికెన్ -గురుకులాల్లో ఐదు రోజులు గుడ్లు, రెండు రోజులు చికెన్ హైదరాబాద్: రాష్ట్రంలో అన్ని సొసైటీల పరిధిలోని గురుకులాలు, మోడల్ స్కూళ్లు, కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) వచ్చే నెల 1వ తేదీనుంచి కామన్ మెనూ అమల్లోకి రానుంది. ఇందుకోసం అవసరమైన చర్యలపై అధికారులు దృష్టిసారించారు. కామన్ మెనూ అమలుపై ఇదివరకే నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం సోమవారం మరోసారి ఈ అంశంపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఒక్కో సొసైటీ పరిధిలోని గురుకులాల్లో ఒక్కో రకంగా భోజనం అందించేవారు. అంతేకాక ఒకే సొసైటీ పరిధిలోని ఒక్కో గురుకులంలో కూడా వివిధ రకాలుగా భోజనం అందిస్తున్నారు. ఇకపై విద్యార్థులకు అలా ఇష్టారాజ్యంగా భోజనం అందించడానికి వీల్లేదు. మెనూను అమలు చేయాల్సిందే.. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం అన్ని గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో (బాలికల హాస్టళ్లు ఉన్నవి) భోజనానికి కామన్ మెనూను అమలు చేయాల్సిందే. ఇందులో భాగంగా 391 కేజీబీవీలు, 110 మోడల్ స్కూళ్లలో ప్రతిరోజు గుడ్డు, పండ్లు, ప్రతి ఆదివారం చికెన్‌తో విద్యార్థినులకు భోజనం అందిస్తారు. ఇక 247 గిరిజన సంక్షేమ గురుకులాలు, 129 సాంఘిక సంక్షేమ గురుకులాలు, 47 తెలంగాణ ప్రభుత్వ గురుకులాలు, 20 బీసీ సంక్షేమ గురుకులాలు, 71 మైనారిటీ గురుకులాల్లో ఐదు రోజులు గుడ్లు, రెండు రోజులు చికెన్‌తో (100 గ్రాముల చొప్పున) భోజనం అందిస్తారు. చికెన్‌ను రెండో బుధవారం, నాలుగో బుధవారం అందిస్తారు. ఒక్కో విద్యార్థిపై ప్రతి రోజు రూ. 26.50 వెచ్చించి ఈ భోజనం అందిస్తారు. అలాగే విద్యార్థికి ప్రతి రోజూ 50 మిల్లీ లీటర్ల పాలు అందిస్తారు. పాలతోపాటు బోర్న్‌వీటా, హార్లిక్స్, రాగి మాల్ట్, ఇంకా చెనా స్ప్రౌట్స్, పెసర్లు, బొబ్బర్లలో ఏదో ఒకటి ఇస్తారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, టీ వంటివి ఇస్తారు. రాత్రి మళ్లీ డిన్నర్ కింద భోజనం అందిస్తారు. భోజనంలోకి వండిపెట్టే కూరగాయలు వారంలో రెండుసార్లకు మించి ఒకేరకానివి వాడకూడదు. వంట చేసేందుకు విజయా బ్రాండు పల్లి నూనె లేదా రైస్ బ్రాన్ ఆయిల్, రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ మాత్రమే వాడాలి. పండ్లు సాయంత్రం భోజన సమయంలో అందజేయాలి. కామన్ మెనూను ఆయా పాఠశాలల్లో నోటీసు బోర్డుపై ప్రదర్శిస్తారు. మెనూతోపాటు టోల్ ఫ్రీ నంబరు రాస్తారు. మెనూను నిబంధనల ప్రకారం అమలు చేయకపోతే విద్యార్థులు టోల్‌ఫ్రీ నంబరుకు ఫిర్యాదు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మొదట వచ్చే నెల 1 నుంచి కేజీబీవీలు, తెలంగాణ గురుకులాలు, మోడల్ స్కూళ్లలో దీనిని అమలు చేస్తారు. మిగతా సంక్షేమ శాఖల పరిధిలోని గురుకులాల్లోనూ వారం వ్యవధిలో అమల్లోకి తెస్తారు.