వచ్చే నెల 1 నుంచి కామన్ మెనూ
-గురుకులాలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీల్లో అమలు
-కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో ప్రతిరోజు గుడ్డు, పండ్లు,
-ప్రతి ఆదివారం చికెన్
-గురుకులాల్లో ఐదు రోజులు గుడ్లు, రెండు రోజులు చికెన్
హైదరాబాద్: రాష్ట్రంలో అన్ని సొసైటీల పరిధిలోని గురుకులాలు, మోడల్ స్కూళ్లు, కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) వచ్చే నెల 1వ తేదీనుంచి కామన్ మెనూ అమల్లోకి రానుంది. ఇందుకోసం అవసరమైన చర్యలపై అధికారులు దృష్టిసారించారు. కామన్ మెనూ అమలుపై ఇదివరకే నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం సోమవారం మరోసారి ఈ అంశంపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఒక్కో సొసైటీ పరిధిలోని గురుకులాల్లో ఒక్కో రకంగా భోజనం అందించేవారు. అంతేకాక ఒకే సొసైటీ పరిధిలోని ఒక్కో గురుకులంలో కూడా వివిధ రకాలుగా భోజనం అందిస్తున్నారు. ఇకపై విద్యార్థులకు అలా ఇష్టారాజ్యంగా భోజనం అందించడానికి వీల్లేదు.
మెనూను అమలు చేయాల్సిందే..
ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం అన్ని గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో (బాలికల హాస్టళ్లు ఉన్నవి) భోజనానికి కామన్ మెనూను అమలు చేయాల్సిందే. ఇందులో భాగంగా 391 కేజీబీవీలు, 110 మోడల్ స్కూళ్లలో ప్రతిరోజు గుడ్డు, పండ్లు, ప్రతి ఆదివారం చికెన్‌తో విద్యార్థినులకు భోజనం అందిస్తారు. ఇక 247 గిరిజన సంక్షేమ గురుకులాలు, 129 సాంఘిక సంక్షేమ గురుకులాలు, 47 తెలంగాణ ప్రభుత్వ గురుకులాలు, 20 బీసీ సంక్షేమ గురుకులాలు, 71 మైనారిటీ గురుకులాల్లో ఐదు రోజులు గుడ్లు, రెండు రోజులు చికెన్‌తో (100 గ్రాముల చొప్పున) భోజనం అందిస్తారు. చికెన్‌ను రెండో బుధవారం, నాలుగో బుధవారం అందిస్తారు. ఒక్కో విద్యార్థిపై ప్రతి రోజు రూ. 26.50 వెచ్చించి ఈ భోజనం అందిస్తారు.
అలాగే విద్యార్థికి ప్రతి రోజూ 50 మిల్లీ లీటర్ల పాలు అందిస్తారు. పాలతోపాటు బోర్న్‌వీటా, హార్లిక్స్, రాగి మాల్ట్, ఇంకా చెనా స్ప్రౌట్స్, పెసర్లు, బొబ్బర్లలో ఏదో ఒకటి ఇస్తారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, టీ వంటివి ఇస్తారు. రాత్రి మళ్లీ డిన్నర్ కింద భోజనం అందిస్తారు. భోజనంలోకి వండిపెట్టే కూరగాయలు వారంలో రెండుసార్లకు మించి ఒకేరకానివి వాడకూడదు. వంట చేసేందుకు విజయా బ్రాండు పల్లి నూనె లేదా రైస్ బ్రాన్ ఆయిల్, రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ మాత్రమే వాడాలి. పండ్లు సాయంత్రం భోజన సమయంలో అందజేయాలి. కామన్ మెనూను ఆయా పాఠశాలల్లో నోటీసు బోర్డుపై ప్రదర్శిస్తారు. మెనూతోపాటు టోల్ ఫ్రీ నంబరు రాస్తారు. మెనూను నిబంధనల ప్రకారం అమలు చేయకపోతే విద్యార్థులు టోల్‌ఫ్రీ నంబరుకు ఫిర్యాదు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మొదట వచ్చే నెల 1 నుంచి కేజీబీవీలు, తెలంగాణ గురుకులాలు, మోడల్ స్కూళ్లలో దీనిని అమలు చేస్తారు. మిగతా సంక్షేమ శాఖల పరిధిలోని గురుకులాల్లోనూ వారం వ్యవధిలో అమల్లోకి తెస్తారు.