టీచర్ల నియామకాలకు జిల్లాస్థాయి కమిటీలు | Education Minister Jagadish Reddy Approved For 84 KGBV Upgraded | Sakshi
Sakshi News home page

టీచర్ల నియామకాలకు జిల్లాస్థాయి కమిటీలు

Published Fri, Feb 22 2019 2:27 AM | Last Updated on Thu, Jul 11 2019 5:07 PM

Education Minister Jagadish Reddy Approved For 84 KGBV Upgraded - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలోని పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ పరీక్ష నిర్వహించి ఫలితాలను వెల్లడిస్తుండగా, విద్యాశాఖ ఆ ఫలితాల్లో అర్హత గల వారికి పోస్టింగ్‌లు ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా విద్యాశాఖ ఆమోదం కోసం ఫైలును ప్రభుత్వానికి పంపించింది. దీంతో వారికి పోస్టింగ్‌లు ఇచ్చేందుకు అవసరమైన మార్గదర్శకాల రూపకల్పన, నియామకాల ప్రక్రియను పూర్తి చేసేందుకు జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ విద్యాశాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి ఫైలుపై గురువారం సంతకం చేశారు. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన సంతకం చేసిన తొలి ఫైలు ఇదే. ఇప్పటివరకు టీఎస్‌పీఎస్సీ నుంచి దాదాపు 2 వేల వరకు పోస్టింగ్‌లు ఇచ్చేందుకు అభ్యర్థుల జాబితా టీఎస్‌పీఎస్సీ నుంచి విద్యాశాఖకు అందింది. అందులో 900 వరకు ఇంగ్లిషు మీడియం సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు జాబితా ఉండగా, మిగతావి స్కూల్‌ అసిస్టెంట్‌ ఇతర పోస్టులకు ఎంపికైన వారి జాబితా ఉంది. ఇక వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, కేజీబీవీ, గురుకుల పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి 8వ తరగతి విద్యార్థుల వరకు యూనిఫారాలు అందించే ఫైలుపైనా ఆయన సంతకం చేశారు. దీనికి రూ.74.01 కోట్లు వెచ్చించి విద్యాశాఖ విద్యార్థులకు యూనిఫారాలు అందించనుంది.
 
కేజీబీవీల్లో 9వ తరగతి.. 
మరోవైపు 84 కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో (కేజీబీవీ) వచ్చే విద్యా సంవత్సరంలో 9వ తరగతి ప్రారంభించేందుకు మంత్రి ఆమోదం తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 475 కేజీబీవీలు ఉన్నాయి. అందులో 88 కేజీబీవీల్లో ఇంటర్మీడియట్‌ వరకు విద్యను ప్రభుత్వం అందిస్తోంది. మరో 303 కేజీబీవీల్లో పదో తరగతి వరకు విద్య బోధనను అందిస్తోంది. తాజాగా వచ్చే విద్యా సంవత్సరంలో మరో 84 కేజీబీవీల్లో 9వ తరగతి వరకు విద్యను అందించనుంది. కేజీబీవీలను ప్రారంభించిన కొద్దీ ఏటా ఒక్కో తరగతిని పెంచుతూపోతోంది. 

కిటకిటలాడినమంత్రి చాంబర్‌ ఆవరణ 
అధికారులు, సంఘాల నేతలు, యాజమాన్య సంఘాలు, జిల్లా నాయకులు, సందర్శకులతో విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి చాంబర్‌ ఆవరణ కిటకిటలాడింది. ఆయనను కలిసిన వారిలో ఐఏఎస్‌ అధికారులు అశోక్, విజయ్‌కుమార్, బుర్రా వెంకటేశం, పాఠశాల విద్య అధికారులు శేషుకుమారి, పీవీ శ్రీహరి, లింగయ్య, రమేశ్, గోపాల్‌రెడ్డి, ఇంజనీరింగ్‌ కాలేజీ యాజమాన్యాల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్‌ గౌతమ్‌రావు, సునీల్, డిగ్రీ కాలేజీ యాజమాన్యాల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రకాశ్, పరమేశ్వర్, గ్రూప్‌–1 అధికారుల సంఘం అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్‌ తదితరులు ఉన్నా రు. ఇక మంత్రి నివాసంలో ఇంటర్‌ విద్య జేఏసీ చైర్మన్‌ డాక్టర్‌ పి.మధుసూదన్‌రెడ్డి, టీటీ యూ అధ్యక్షుడు మణిపాల్‌రెడ్డి తదితరులు ఆయనను కలసి అభినందనలు తెలిపారు. 

బాధ్యతలు స్వీకరించిన జగదీశ్‌రెడ్డి 
అంతకుముందు గురువారం సచివాలయంలో ఉదయం 11:30 గంటలకు విద్యాశాఖ మంత్రిగా జగదీశ్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు హోంమంత్రి మహమూద్‌ అలీ, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పలువురు ఇతర ప్రజాప్రతినిధులతోపాటు విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలు, కాలేజీల యాజమాన్యాలు అభినందనలు తెలిపాయి. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. రెండోసారి టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక తనకు మళ్లీ మంత్రి పదవి ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో సీఎం విద్యాశాఖ ఇచ్చారని, తాను ప్రత్యేక దృష్టి సారించి తెలంగాణ విద్యాశాఖను దేశంలోనే నంబర్‌వన్‌ స్థానంలో నిలబెడతానన్నారు. సమైక్య రాష్ట్ర ప్రభుత్వాలు తీర్చలేని సమస్యలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పరిష్కరిస్తూ ముందుకు సాగుతోందన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement